Begin typing your search above and press return to search.

ఎయిర్ పోర్టు మెట్రో.. ఎంజీబీఎస్ నుంచి కాదు నాగోల్ నుంచి?

నాగోల్ నుంచి ఎల్ బీ నగర్ కు 5కి.మీ.మార్గాన్ని గతంలోనూ ప్రతిపాదించారు. దీన్ని చేపట్టటం ద్వారా కొత్త ఎయిర్ పోర్టు వరకు విస్తరిస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 4:31 AM GMT
ఎయిర్ పోర్టు మెట్రో.. ఎంజీబీఎస్ నుంచి కాదు నాగోల్ నుంచి?
X

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రోను మొదలు పెట్టిన గత ప్రభుత్వం.. అందులో భాగంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ ను అనుకొని ఉండే స్టేషన్ తో చేపట్టాలని భావించటం తెలిసిందే. అయితే.. రేవంత్ సర్కారు మాత్రం అందుకు భిన్నంగా పాతబస్తీ మీదుగా ఎయిర్ పోర్టు మెట్రోను ఏర్పాటు చేస్తే.. పెద్ద ఎత్తున ప్రజలకు మేలు చేస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం.. ఆ దిశగా కసరత్తు చేసి నివేదిక ఇవ్వాలని కోరటం తెలిసిందే.

ఇందులో భాగంగా కారిడార్ 2 కొనసాగింపుగా ఎంజీబీఎస్ - ఫలక్ నుమా - చంద్రాయణగుట్ట - మైలార్ దేవ్ పల్లి - శంషాబాద్ ఎయిర్ పోర్టు మార్గానికి సంబంధించిన ఒక ప్లాన్ సిద్ధం చేశారు. అయితే.. తాజాగా మరో ప్లాన్ ను రెడీ చేసినట్లుగా చెబుతున్నారు. కారిడార్ 3 విస్తరణలో భాగంగా నాగోల్ నుంచి ఎయిర్ పోర్టుకు మెట్రోను తీసుకెళితే మరింత బాగుంటుందని.. ఆర్థికంగా మేలు చేస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఫలక్ నుమా నుంచి వచ్చే మార్గం చంద్రాయణగుట్ట వద్ద ఇరుకుదారిగా ఉంటుందని..దీనికి తోడు ఫైఓవర్ పై నుంచి మలుపు తీసుకోవటం క్లిష్టమైనదిగా భావిస్తున్నారు. దీనికి పరిష్కారంగా నాగోల్ నుంచి అయితే ఫ్లైఓవర్ కు సమాంతరంగా వెళ్లటంతో పాటు.. మరింత ఎక్కువ జనాభా ఉండే ప్రాంతం నుంచి వెళ్లటం వల్ల మేలు జరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కారిడార్ 2లో ఎంజీబీఎస్ - ఫలక్ నుమా అక్కడి నుంచి 1.5కి.మీ. దూరంలో చంద్రాయణగుట్ట కూడలిలో ఎయిర్ పోర్టు మెట్రో కలవనుంది. చాంద్రాయణగుట్టలో జంక్షన్ ఉంటుంది కాబట్టి జేబీఎస్ నుంచి వచ్చే వారు చంద్రాయణ గుట్ట వరకు వచ్చి అక్కడ ఎయిర్ పోర్టు మెట్రోకి మారాలి. మొదటి దశ పెండింగ్ లో భాగంగా ఎంబీజీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కి.మీ. మార్గం ఉంది. దీన్ని పూర్తి చేసి మరో 1.5 కి.మీ. పొడిగిస్తే చంద్రాయణగుట్ట వరకు వస్తుంది. ఈ మార్గంలో ఎయిర్ పోర్టుకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. నాగోల్ నుంచి ఎల్ బీ నగర్ కు 5కి.మీ.మార్గాన్ని గతంలోనూ ప్రతిపాదించారు. దీన్ని చేపట్టటం ద్వారా కొత్త ఎయిర్ పోర్టు వరకు విస్తరిస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. నాగోల్ - చంద్రయణగుట్ట - ఎయిర్ పోర్టు మార్గంలో సవాళ్లు ఉన్న విషయాన్ని గుర్తించారు. భూసేకరణ సమస్యలు లేకున్నా ఈ ప్రాంతంలో ఐదు ఫ్లైఓవర్లు ఉండటంతో వీటి పక్క నుంచి మెట్రో రైల్ రూట్ ను నిర్మించాల్సి ఉంటుంది. ఈ కారణంగా కాస్తంత దూరం పెరగే వీలుంది. మొత్తంగా ఎయిర్ పోర్టు మెట్రోను ఏ రూట్ నుంచి తీసుకెళితే ఎక్కువ లాభం ఉంటుందన్న అంశంపై పలు ఆప్షన్లను మెట్రో అధికారులు పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి.. చివరకుఏ రూట్ ఫైనల్ చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.