Begin typing your search above and press return to search.

మీథేన్ లీక్ ఎంత ప్రమాదకరం? భోపాల్ తరహా విషాదం మళ్లీ జరిగేనా?

భోపాల్‌కు సుమారు 35కిలో మీటర్ల దూరంలో ఉన్న రాయ్ సేన్ జిల్లాలోని గెయిల్ ప్లాంట్ లో నిన్న ఉదయం అంటే బుధవారం మీథేన్ గ్యాస్ లీక్ కావడంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలకు గురైంది.

By:  Tupaki Desk   |   24 April 2025 8:09 PM IST
మీథేన్ లీక్ ఎంత ప్రమాదకరం? భోపాల్ తరహా విషాదం మళ్లీ జరిగేనా?
X

భోపాల్‌కు సుమారు 35కిలో మీటర్ల దూరంలో ఉన్న రాయ్ సేన్ జిల్లాలోని గెయిల్ ప్లాంట్ లో నిన్న ఉదయం అంటే బుధవారం మీథేన్ గ్యాస్ లీక్ కావడంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలకు గురైంది. వెంటనే ఫైర్ సేఫ్టీ టీమ్ కు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ లీకేజీని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. లీక్ జరిగిన కొద్ది గంటల్లోనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అన్ని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.ప్రస్తుతం ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపేశారు. మీథేన్ అత్యంత మండే స్వభావం కలిగి ఉంటుంది. వాసన లేని, రంగు లేని వాయువు, ఇది నిమిషాల్లో ప్రజల ప్రాణాలను తీయగలదు.

మీథేన్ గ్యాస్‌కు రంగు లేదా వాసన ఉండదు. గాలిలో మీథేన్ శాతం 50 శాతం కంటే ఎక్కువ అయితే అది ఊపిరి ఆడకుండా చేస్తుంది. మీథేన్ గ్యాస్ ఆక్సిజన్‌ను తగ్గిస్తుంది. కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్‌తో కలిసి మనిషి శరీరంలో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దీనివల్ల మరణం సంభవించవచ్చు. మీథేన్ గ్యాస్ చాలా వేగంగా పనిచేస్తుంది. శ్వాస తీసుకున్న వెంటనే నేరుగా మెదడుపై దాడి చేస్తుంది. దీనివల్ల మనిషి అపస్మారక స్థితిలోకి చేరుకుంటాడు. ఈ పరిస్థితిలో అతడికి తగినంత ఆక్సీజన్ అందదు. దీని ప్రత్యక్ష ప్రభావం ఊపిరితిత్తులు, గుండె మీద కనిపిస్తుంది.

మీథేన్ గ్యాస్‌తో మరణం ఎంత త్వరగా సంభవించగలదనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అవి గ్యాస్ సాంద్రత ఎంత ఉంది, వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది. అతను ఎంతసేపు గ్యాస్‌కు గురయ్యాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. గ్యాస్ సాంద్రత ఎక్కువగా ఉండి, ఒక వ్యక్తి ఎక్కువసేపు దాని ప్రభావానికి గురైతే అతడు త్వరగా మరణిస్తాడు. మీథేన్ గ్యాస్‌కు గురైనప్పుడు గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్లలో మంట, దగ్గు వస్తుంది. ఎందుకంటే ఇది మనిషి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. తలనొప్పి, ఉక్కిరిబిక్కిరి, మైకంతో పాటు, అధిక మొత్తంలో గ్యాస్ మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల మరణం సంభవిస్తుంది.

భోపాల్ గ్యాస్ దుర్ఘటన

డిసెంబర్ 2-3, 1984న భోపాల్‌లో ఇదే తరహాలో ఒక బాధాకరమైన దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం తర్వాత వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మానవ చరిత్రలో ఇది అత్యంత బాధాకరమైన పారిశ్రామిక విషాదాలలో ఒకటిగా చరిత్రలో నిలిచపోయింది. యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ కర్మాగారం నుండి వెలువడిన విషపూరిత వాయువు కారణంగా దాదాపు ఒక నగరం మొత్తం ఎలా నాశనమైందో అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో 5474 మంది మరణించారు. ఐదు లక్షల మందికి పైగా ప్రజలు దీని ప్రభావానికి గురయ్యారు. ఈ కర్మాగారంలో పురుగుమందుల ఉత్పత్తి కోసం మిథైల్ ఐసోసైనేట్ అనే రసాయనాన్ని ఉపయోగించేవారు. సేఫ్టీ ప్రమాణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ట్యాంక్ నుండి పెద్ద మొత్తంలో MIC గ్యాస్ లీక్ అయింది. అదే ప్రజల మరణానికి కారణమైంది.