జాగ్రత్త.. ఇక మనసులో తిట్టినా ఏఐ కనిపెట్టేస్తుంది!
ఎందుకంటే, మెటా సంస్థ తీసుకొస్తున్న ‘Brain2Qwerty v2’ అనే సరికొత్త ఏఐ సిస్టమ్.. మీరు నోరు విప్పకపోయినా మీ మెదడులోని ఆలోచనలను ఇట్టే చదివేసి టెక్స్ట్ రూపంలో మార్చేస్తుందట!
By: A.N.Kumar | 30 Jun 2026 5:24 PM IST"నోరు జారితే క్షమించొచ్చు... కానీ మనసు జారితే?" అనే రోజులు నిజంగానే వచ్చేసినట్టున్నాయి. ఇప్పటివరకు మనసులో ఎవరినైనా తిట్టుకుంటే "ఎవరికీ తెలియదులే" అనే ధైర్యం ఉండేది. కానీ ఇకపై ఆ పప్పులు ఉడకవు. ఎందుకంటే, మెటా సంస్థ తీసుకొస్తున్న ‘Brain2Qwerty v2’ అనే సరికొత్త ఏఐ సిస్టమ్.. మీరు నోరు విప్పకపోయినా మీ మెదడులోని ఆలోచనలను ఇట్టే చదివేసి టెక్స్ట్ రూపంలో మార్చేస్తుందట!
బాస్ ముందే 'బిస్కెట్లు' వేస్తే అంతే సంగతులు!
ఈ వార్త బయటకు రావడం ఆలస్యం.. సోషల్ మీడియాలో మీమ్స్ రాయుళ్లు రంగంలోకి దిగిపోయారు. ఒకవేళ ఈ టెక్నాలజీ గనుక ఆఫీసుల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. బాస్ ఒక కుళ్లిపోయిన ఐడియా చెప్పినప్పుడు, మనం పైకి మాత్రం నవ్వుతూ "సార్.. ఎక్సలెంట్ ఐడియా సార్!" అంటాం. కానీ వెనుక ఉన్న ఏఐ స్క్రీన్ మీద మాత్రం "వీడికి వేరే పనిలేదు.. మళ్లీ కొత్త టార్గెట్ పెట్టి చంపేస్తున్నాడు" అని టైప్ అయిపోతే.. మరుసటి రోజు మన చేతిలో పింక్ స్లిప్ ఖాయం!
భార్య ఎంతో ప్రేమగా వచ్చి "ఏమండీ.. ఏంటి ఆలోచిస్తున్నారు?" అని అడిగితే.. భర్త పైకి చాలా సాత్వికంగా "ఏం లేదు డియర్" అంటాడు. కానీ ఏఐ సిస్టమ్ మాత్రం మెదడును స్కాన్ చేసి.. "ఇవాళ మళ్లీ షాపింగ్‌కి తీసుకెళ్లి నా అకౌంట్ ఖాళీ చేస్తుందేమో అని భయపడుతున్నాడు" అని లీక్ చేస్తే.. ఆ ఇంట్లో జరిగే మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎవరూ ఆపలేరు!
పొలిటికల్ లీడర్స్.. ఇక మేనిఫెస్టోలు కాదు.. ‘బ్రెయిన్ రిపోర్ట్’ ఇవ్వాలి
రాజకీయ నాయకుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా తయారయ్యేలా ఉంది. ఎన్నికల ప్రచార వేదికలపై మైక్ పట్టుకుని "ప్రజల సేవే మా పరమావధి.. మీకోసం ప్రాణాలైనా ఇస్తా" అని లీడర్ గంభీరంగా ప్రసంగిస్తుంటే.. వెనుక ఉన్న ఏఐ డిస్‌ప్లే బోర్డులో "ఈసారి గెలిస్తే ఏ ఏరియాలో ల్యాండ్స్ కబ్జా చేయాలి? ఎన్నికల ఖర్చు ఎలా రికవర్ చేయాలి?" అని స్క్రోలింగ్ పడితే ఆ సీన్ చూసి జనాలు గుండెలు బాదుకోవడం ఖాయం. భవిష్యత్తులో ఓటర్లు పార్టీ మేనిఫెస్టోలు కాకుండా లీడర్ల ‘బ్రెయిన్ రిపోర్ట్’ అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రేమికుల మధ్య కూడా ఇది పెద్ద పరీక్షే పెట్టనుంది. "నువ్వే నా ప్రపంచం బాబూ" అని గర్ల్‌ఫ్రెండ్‌కి మెసేజ్ టైప్ చేస్తుంటే.. మెదడులో మాత్రం "ఈ నెల బైక్ ఈఎంఐ ఎలా కట్టాలి? దోస్తుల దగ్గర అప్పు ఎలా తీర్చాలి?" అని రన్ అవుతున్న విషయాలను ఈ ఏఐ బయటపెడితే.. ఆ లవ్ స్టోరీ అక్కడితో శుభం కార్డు పడాల్సిందే.
జోకులు పక్కన పెడితే.. మెటా చెప్తున్న వివరాల ప్రకారం.. ఈ సిస్టమ్ ఎలాంటి సర్జరీలు లేదా తలలో చిప్‌లు అమర్చాల్సిన అవసరం లేకుండా మాగ్నెటోఎన్సెఫలోగ్రఫీ వంటి నాన్-ఇన్వేసివ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ట్రయల్స్‌లో ఇది 78% ఖచ్చితత్వం సాధించింది.
సరదా ముచ్చట్లు ఎలా ఉన్నా ఈ టెక్నాలజీ వెనుక ఉన్న అసలు ఉద్దేశం చాలా గొప్పది. స్ట్రోక్, పక్షవాతం, లేదా ఏఎల్ఎస్ వ్యాధి కారణంగా మాట్లాడే శక్తిని కోల్పోయిన రోగులకు ఇది ఒక వరప్రసాదం కానుంది. వారు తమ మనసులోని భావాలను, అవసరాలను ఇతరులతో పంచుకోవడానికి ఈ ఏఐ అద్భుతంగా సహాయపడుతుంది. ప్రస్తుతం ఇది పరిశోధన దశలోనే ఉంది.
టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా మనసులోని ప్రతి రహస్యాన్ని బయటపెట్టే రోజు నిజంగా వస్తే.. మనుషులు సామాజికంగా బతకడం కష్టమే.. మరి ఈ ఏఐ భవిష్యత్తులో నిజంగానే అందరి గుట్టు రట్టు చేస్తుందో లేక కేవలం మెడికల్ రంగానికే పరిమితమై సోషల్ మీడియాలో మీమ్స్‌గా మిగిలిపోతుందో చూడాలి.
