మెస్సీ.. నీకిది తెలుసా? ఒకప్పుడు హైదరాబాద్ ఫుట్ బాల్ రాజధాని
ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లయోనల్ మెస్సీ ఈ నెల 13న హైదరాబాద్ వస్తున్నాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై అనంతరం ఉప్పల్ మైదానంలో ఫుట్ బాల్ ఆడనున్నాడు.
By: Tupaki Desk | 4 Dec 2025 12:54 AM ISTప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లయోనల్ మెస్సీ ఈ నెల 13న హైదరాబాద్ వస్తున్నాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై అనంతరం ఉప్పల్ మైదానంలో ఫుట్ బాల్ ఆడనున్నాడు. అది కూడా ఎవరితోనో తెలుసా?.. సీఎం రేవంత్ టీమ్ తో.! ఈ నేపథ్యంలో రేవంత్ ఫుట్ బాల్ ఫుల్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. తన జట్టు ఆటగాళ్లతో ఆయన గ్రౌండ్ లో ఆడుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. అయితే, ఇప్పటివారికి తెలుసో లేదో కానీ.. ఒకప్పుడు హైదరాబాద్ ను భారత ఫుట్ బాల్ రాజధానిగా భావించేవారు. 1950 నుంచి 1970 వరకు రెండు దశాబ్దాల పాటు మన నగరం భారత ఫుట్ బాల్ కేంద్రంగా ఉండేది. సిటీ పోలీస్ ఫుట్ బాల్ క్లబ్ కు అయితే దేశవ్యాప్తంగా పేరుంది. ఇక సయ్యద్ అబ్దుల్ రహీమ్ దిగ్గజ కోచ్ గా చరిత్రలో నిలిచిపోయారు. ఈయన సారథ్యంలోనే భారత జట్టు ఏషియన్ గేమ్స్ లో స్వర్ణం గెలుచుకుంది. మరిప్పుడు..? ప్రపంచ ఫుట్ బాల్ ర్యాంకింగ్స్ లో భారత్ స్థానం వందకుపైనే. అసలు ప్రపంచ కప్ నకు క్వాలిఫై కావడం అనేది ఒక కల అనే చెప్పొచ్చు. మన కంటే చాలా చిన్న దేశాలు కూడా ఫుట్ బాల్ లో దూసుకెళ్తున్నాయి. కానీ, భారత్ లో మాత్రం ఈ క్రీడకు ఆదరణ పెరగడం లేదు. ఈ పరిస్థితి మారేందుకు మరికొన్ని దశాబ్దాలు పట్టే చాన్సుందని మాత్రం చెప్పవచ్చు.
ఫుట్ బాల్ ను ఒంటికాలిపై నిలబెట్టారు..
ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో భారత్ కు చోటు లేకపోవచ్చు. భారత ఫుట్ బాల్ చరిత్రను ఒంటికాలిపై నిలబెట్టిన ఘనత హైదరాబాద్ దే. ఒకదశలో భారత ఫుట్ బాల్ కు మన నగరం కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఈస్థాయికి కారణం హైదరాబాదీ ఆటగాళ్లే.
ఒలింపిక్స్ కు వెళ్లింది మన జట్టు
1956 మెల్ బోర్న్ ఒలింపిక్స్ ఫుట్ బాల్ లో భారత జట్టు తలపడిందంటే ఒకప్పుడు జట్టు ఎంత బలంగా ఉండేదో తెలుస్తోంది. అంతేకాదు ఈ ఒలింపిక్స్ లో మన జట్టు 4 వ స్థానంలో నిలిచింది. ఇందులో 9 మంది హైదరాబాదీ ఆటగాళ్లే కావడం విశేషం. 1954, 1962 ఆసియా క్రీడలలో సత్తాచాటిన భారత జట్టులోనూ హైదరాబాదీలదే హవా.
ఆయన కోచింగ్ అమోఘం..
హైదరాబాద్ కు చెందిన సయ్యద్ అబ్దుల్ రహీమ్.. ఈ పేరు చెబితే ఎవరికీ తెలియదేమో కానీ.. రహీమ్ సాబ్ అంటే హైదరాబాద్ స్పోర్ట్స్ సర్కిళ్లలో తెలియనివారు ఉండదరు. 1950-63 మధ్య భారత ఫుట్ బాల్ కోచ్ ఈయనే. ఇక మన నగరం నుంచి విక్టర్ అమల్ రాజ్ భారత జట్టు కెప్టెన్ గా పనిచేశారు.
అటు బొల్లారం.. ఇటు పాతబస్తీ..
స్వాతంత్ర్యానికి పూర్వం హైదరాబాద్ లోని బొల్లారం బ్రిటిష్ వారి సైనిక కేంద్రంగా ఉండేది. వారి ప్రోత్సాహంతో ఆ ప్రాంతంలో ఫుట్ బాల్ కల్చర్ పెరిగింది. ఇటు పాతబస్తీలో రహీమ్ సాబ్ వంటి మేటి ఆటగాళ్లతో ఫుట్ బాల్ బాగా యువతలోకి బాగా చొచ్చుకెళ్లింది. కానీ, కాలక్రమంలో ఈ స్థానాన్ని క్రికెట్ ఆక్రమించింది. ఫుట్ బాల్ వెనక్కుపోయింది. ఈ పరిస్థితి హైదరాబాద్ లోనే కాదు.. దేశమంతటా ఉంది.
