Begin typing your search above and press return to search.

"అక్కడ ఆడపిల్లల కంటే ఆడపిల్లులకే స్వేచ్ఛ ఎక్కువ"!

ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి వేదికగా ఆఫ్గాన్ లో మహిళల స్వేచ్ఛపై హాలీవుడ్ నటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

By:  Tupaki Desk   |   25 Sept 2024 1:00 AM IST
అక్కడ ఆడపిల్లల కంటే ఆడపిల్లులకే స్వేచ్ఛ ఎక్కువ!
X

ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లినప్పటి నుంచీ మానవహక్కులు అనే విషయం ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని.. ఇక మహిళల హక్కుల విషయానికొస్తే నేతి బీరకాయలో నెయ్యి కంటే ఎక్కువ సమస్య అని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి వేదికగా ఆఫ్గాన్ లో మహిళల స్వేచ్ఛపై హాలీవుడ్ నటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

అవును... ఆఫ్గనిస్తాన్ లో మహిళలపై తాలిబాన్ల ఆంక్షల గురించి, వారి హక్కులను కాలరాస్తున్న విధానం గురించి అంతర్జాతీయంగా పలు నివేదికలు పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. వీటిపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో హాలీవుడ్ నటి, ఆస్కార్ అవార్డ్ గ్రహీత మెరిల్ స్ట్రిప్ ఐరాస వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ఆఫ్గన్ లో నేడు ఆడపిల్ల కంటే ఆడ పిల్లులకే ఎక్కువ స్వేచ్ఛ ఉందని మెరిల్ స్ట్రిప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు.. ఆఫ్గాన్ లో పిల్లులు బయట కూర్చొని సూర్యరశ్మిని ఆస్వాదించొచ్చు.. ఉడతలు పార్కుల్లో స్వేచ్ఛగా ఎగురుతూ తిరగొచ్చు.. కానీ అక్కడ పార్కుల్లో బాలికలు, మహిళలకు మాత్రం ప్రవేశాలను తాలిబన్లు నిలివేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే ఆఫ్గాన్ లో అమ్మాయిలకంటే ఉడతకే హక్కులు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఇక, ఓ పక్షి అక్కడ స్వేచ్ఛగా పాడగలదు కానీ.. మహిళలకు కనీసం అలాంటి స్వేచ్ఛ కూడా లేదని మెరిల్ స్ట్రీప్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమాజం ఏకతాటిపైకి వస్తే.. ఆఫ్గాన్ లో మహిళలకు తిరిగి స్వేచ్ఛా వాయువులను అందించవచ్చని అన్నారు.

న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల వేళ ఓ చర్చలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆఫ్గాన్ లో పిల్లులు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నాయని.. అమ్మాయిల కంటే ఉడతలకే ఎక్కువ హక్కులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

కాగా... ఆఫ్గనిస్తాన్ లో అమెరికా తన బలగాలను ఉపసంహరించుకున్న అనంతరం ఈ దేశం తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. 2021 ఆగస్టులో మొదలైన ఈ పాలనలో.. షరియా చట్టం అమలవుతుంది! దీంతో... మహిళలపై అనేక అంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో... బాలికలు చదువుకు దూరమయ్యారు. మహిళలను ఉద్యోగాలకూ అనుమతించడం లేదు!