Begin typing your search above and press return to search.

లేచింది పురుష ప్రపంచం...కమిషన్ ఏర్పాటు కోసం

ఇప్పటికి ఏడున్నర పదుల క్రితం ఒక పాత తెలుగు పాటను పింగళి నాగేంద్రరావు అనే మహా కవి రచించారు.

By:  Tupaki Desk   |   20 April 2025 2:01 PM IST
Mens Rights Protest Gains Momentum in India
X

ఇప్పటికి ఏడున్నర పదుల క్రితం ఒక పాత తెలుగు పాటను పింగళి నాగేంద్రరావు అనే మహా కవి రచించారు. లేచింది మహిళా లోకం అంటూ. ఆ తర్వాత మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకున్నాయి. వారి హక్కులను కాపాడేందుకు ప్రత్యేక మహిళా కమిషన్ ని జాతీయ స్థాయిలో రాష్ట్రాల స్థాయిలో రాజ్యాంగ బద్ధంగా ఏర్పటు చేశారు. దాంతో అబలలకు ఎంతో మందికి న్యాయం దక్కింది.

అయితే రానూ రానూ వికసిస్తున్న చైతన్యంతో లోకం కొత్త పుంతలు పోతోంది. లింగ వివక్ష కోణానికి అతీతంగా బాధితులు ఎవరైనా ఉండొచ్చు అన్నది కూడా బాగా తెలిసి వచ్చింది. మోసపోయేవారు ఫలానా జెండర్ కి చెందిన వారే అన్న గుడ్డి భ్రమలకు కాలం చెల్లుతున్న వేళ బలవంతుడు అని సమాజం దృష్టిలో గట్టి ముద్ర ఉన్న పురుషుడు కూడా డీలా పడుతున్నారు. చాలా సందర్భాలలో మోసపోతూ మౌనంగా తన జీవితాన్ని చాలిస్తున్నాడు.

ఒకప్పుడు భర్త బాధితులు అయిన మహిళలు ఎక్కువగా కనిపించేవారు ఇపుడు కూడా ఉన్నారు. అయితే మహిళలలో వచ్చిన చైతన్యం వల్ల కావచ్చు లేదా చట్టాల భయం వల్ల కావచ్చు కొంత అదుపులో ఉన్నాయని అంటున్నారు. అదే సమయంలో పురుషులకు ఏ చట్టపరమైన రక్షణ లేకపోవడం వల్ల వారి విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. అంతే కాదు తప్పుడు కేసులు పెడుతున్న చాలా కేసులలో వారు అమాయకులుగా మారి ఉసురు తీసుకుంటున్నారు.

ఇటీవల కాలంలో భార్యా బాధితులు ఎక్కువ అయ్యారు. హాస్యానికి అన్నట్లుగ ఇప్పటికి నాలుగు దశాబ్దాల క్రితం దివంగత ప్రముఖ జంధ్యాల రాజేంద్ర ప్రసాద్ ని హీరోగా పెట్టి వివాహ భోజనంబు సినిమా తీశారు. అందులో భార్యా బాధితులు అని ఒక సంఘం ఏర్పాటు చేసి చూపించారు. కానీ అదే ఇపుడు నిజం అవుతోంది. భార్యా బాధితులు అంతా సంఘంగా ఏర్పడుతున్నారు.

జాతీయ స్థాయిలో వారు అంతా ఒక్కటిగా నిలిచి తమకూ ఒక చట్టబద్ధమైన రక్షణ కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున పురుష సత్యాగ్రహం పేరుతో తాజాగా నిర్వహించిన ఆందోళనా కార్యక్రమంలో ప్రత్యేక కమిషన్ డిమాండ్ మారు మోగింది. సేవ్ ఫ్యామిలీ అన్న సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పురుషులు పాల్గొన్నారు.

ఇక భర్తల హక్కుల కోసం పోరాడుతున్న దేశంలోని నలభైకి పైగా ఎన్జీవోల నుంచి ప్రతినిధులు వేయి మందికి పైగా ఈ పురుష సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వందమందికి పైగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొన్నారు. భార్యల వేధింపులకు బలి అయిన భర్తలకు చెందిన కుటుంబ సభ్యులుగా వీరు హాజరయ్యారు.

ఇంతకీ ఈ పురుష సత్యాగ్రహం ఆందోళనలో చేసిన తీర్మానాలు ఏమిటి అంటే చట్టాలలో లింగ వివక్షను రూపుమాపాలని, గృహ హింస, లైంగిక వేధింపుల కేసులలో పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలను నిరోధించేలా చర్యలు చేపట్టాలని అంటున్నారు.

ప్రభుత్వం గతంలో చేసిన వరకట్నం, అత్యాచార చట్టాలు పూర్తిగా దుర్వినియోగం అవుతున్నాయని వారు పేర్కొన్నారు. మహిళలకు పురుషులకు సమానంగానే చట్టాలు ఉండాలని కోరుతున్నారు. నాడు సతీ సహగమనం అన్నారు, నేడు పతిసహగమనం పెద్ద ఎత్తున సాగుతోందని కూడా పురుష సత్యాగ్రహానికి హాజరైన వారు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి మగవారికీ ఒక ప్రత్యేక కమిషన్ ని ఏర్పాటు చేయమంటున్నారు.

మరి ఈ కాలానికి తగినట్లుగా ఈ కమిషన్ వేయాల్సిన అవసరం ఉందా లేదా అన్నది మేధావుల నుంచి సామాజిక రంగంలోని నిపుణుల వరకూ అంతా కలసి చర్చించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక మాట ఉంది. అన్యాయానికి లింగ వివక్ష లేదు, మోసపోయిన వారికి ఆడ మగ తేడా లేదు, బాధితుల కన్నీరుని లింగ వివక్షతో కొలమానం పెట్టి చూడరాదు. ఎవరికి అన్యాయం జరిగినా దానికి శిక్ష పడాలి. ఈ విధంగా ఆలోచిస్తే మన చట్టాలను మరింత మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉందని అంటున్నారు అంతా.