Begin typing your search above and press return to search.

ఎన్.హెచ్.ఏ.ఐ.కి నష్టం... మేకపాటి సంస్థపై ఈడీ కేసు నమోదు?

అవును... కేఎంసీ కన్‌ స్ట్రక్షన్స్ కంపెనీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారని తెలుస్తుంది

By:  Tupaki Desk   |   19 Oct 2023 5:11 AM GMT
ఎన్.హెచ్.ఏ.ఐ.కి నష్టం... మేకపాటి సంస్థపై ఈడీ కేసు నమోదు?
X

నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్.హెచ్.ఏ.ఐ)ని మోసం చేశారన్న ఆరోపణలపై వైసీపీ ఇమాజీ మంత్రి దివంగత మేకపాటి గౌతంరెడ్డి కుటుంబ సభ్యుడు మేకపాటి విక్రంరెడ్డికి చెందిన కృష్ణమోహన్ కన్‌ స్ట్రక్షన్స్ (కెఎంసి) సహా పలువురు కాంట్రాక్టర్లపై ఎన్‌ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కేసులు నమోదు చేశారని తెలుస్తుంది. ఈ కేఎంసీ కన్‌ స్ట్రక్షన్స్ కంపెనీకి విక్రం రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు.

అవును... కేఎంసీ కన్‌ స్ట్రక్షన్స్ కంపెనీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారని తెలుస్తుంది. ఇదే సమయంలో... కోల్‌ కతా లోని భారత్ రోడ్ నెట్‌వర్క్ లిమిటెడ్ (బి.ఆర్‌.ఎన్‌.ఎల్), గురువాయూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (జి.ఐ.పి.ఎల్), హైదరాబాద్‌ లోని కెఎంసి కన్‌ స్ట్రక్షన్స్ లిమిటెడ్ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించిన అనంతరం కేసులు నమోదు చేశారని తెలుస్తుంది.

2006 నుంచి 2016 మధ్యకాలంలో కేరళలోని పాలక్కాడ్‌ లో 47వ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన రెండు సెక్షన్ల నిర్మాణ పనుల్లో మేకపాటి విక్రం రెడ్డి అవకతవకలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ అని అంటున్నారు. ఫలితంగా... ఎన్‌.హెచ్.ఏ.ఐకి సుమారు 102.44 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఈడీ అధికారులు అంచనా వేశారు.

ఎన్‌.హెచ్.ఏ.ఐ లోని రెండు విభాగాలకు సంబంధించిన పనులను అమలు చేసేందుకు కంపెనీ, అప్పటి డైరెక్టర్‌ విక్రం రెడ్డి పాలక్కాడ్‌ లోని కొంతమందీ అధికారులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్. ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించిందని అంటున్నారు.

ఈ జాతీయ రహదారి నిర్మాణంలో ప్రధాన కాంట్రాక్ట్ కంపెనీ జీఐపీఎల్‌ కు కృష్ణమోహన్ కన్‌స్ట్రక్షన్స్ (కెఎంసి) సబ్-కాంట్రాక్టింగ్ గా వ్యవహరించిందని తెలుస్తోంది. ఇందులో రోడ్డు ప్రాజెక్ట్ పూర్తి ధృవీకరణ పత్రాన్ని కేఎంసీ కన్‌ స్ట్రక్షన్స్.. మోసపూరితంగా పొందిందని, ప్రజల నుంచి అక్రమంగా టోల్ మొత్తాన్ని వసూలు చేసిందని ఈడీ అధికారులు నిర్ధారించినట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో... కేసు నమోదు చేయడానికి ముందు ఈడీ అధికారులు హైదరాబాద్‌ లోని కృష్ణమోహన్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ ఆఫీసులో సోదాలు నిర్వహించి కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. ఆ డాక్యుమెంట్ల ఆధారంగానే ఈ చీటింగ్ కేసు నమోదు చేశారని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే కంపెనీ యాజమాన్యానికి నోటీసులను జారీ చేస్తారని సమాచారం.