జగన్ చుట్టూ భజనగాళ్లు.. వైసీపీ పెద్దాయన సీరియస్ కామెంట్స్
తన కుమారుడు దివంగత నేత గౌతంరెడ్డి వర్థింతి సందర్భంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి పార్టీ వ్యవహారాలపై హాట్ కామెంట్స్ చేశారు.
By: Tupaki Political Desk | 3 Nov 2025 4:54 PM ISTవైసీపీ పార్టీ వ్యవహారాలపై పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పనితీరు, గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలపై మాట్లాడిన రాజమోహనరెడ్డి.. మాజీ సీఎంకు వాస్తవాలు చెప్పకుండా, ఆయన చుట్టూ చేరినవారంతా భజన చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నెల్లూరు ఎంపీగా పనిచేసిన రాజమోహనరెడ్డి వృద్ధాప్యం కారణంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ, నెల్లూరు జిల్లాలో వైసీపీ రాజకీయాలను మేకపాటి కుటుంబమే పర్యవేక్షిస్తోంది. దీంతో మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తన కుమారుడు దివంగత నేత గౌతంరెడ్డి వర్థింతి సందర్భంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి పార్టీ వ్యవహారాలపై హాట్ కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో అధికారం కోల్పోవడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చుట్టూ ఉన్నవారే కారణమని ఆయన ఆరోపించారు. జగన్ కు క్షేత్రస్థాయి పరిస్థితులపై సరైన నిర్దేశం చేయడం లేదని అభిప్రాయపడ్డారు. ఆయన చుట్టూ ఉన్న వారి ‘భజన’కు ఆకర్షితుడై ప్రజలకు దూరమయ్యారని అభిప్రాయపడ్డారు.
గత ఎన్నికల్లో ప్రజలు ఎందుకు తిరస్కరించారన్న విషయమై మాజీ సీఎం జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఓటమికి కారణాలను విశ్లేషించి, పార్టీ చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. తద్వారా ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందాలని మాజీ ఎంపీ మేకపాటి కోరారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును ప్రస్తావించకపోయినా, జగన్ అధికారంలో ఉండగా, అప్పటి ప్రతిపక్ష నేతను అరెస్టు చేయడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘ప్రతిపక్ష నాయకుడిని వేటాడి జైలులో పెట్టాల్సివుండకూడదు’’ అని కుండబద్ధలు కొట్టారు.
ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే తప్పుచేస్తోందని, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటోందని మేకపాటి ఆరోపించారు. ప్రజలు ప్రతీది గమనిస్తారని, 2029 ఎన్నికల్లో తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు. మాజీ సీఎం జగన్ చుట్టూ మేథావులు, మంచి నాయకులు ఉండాలని మేకపాటి ఆకాంక్షించారు. అలాంటి వారు మాత్రమే ఆయనకు మంచి సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు సరైన మార్గనిర్దేశం చేస్తారని అన్నారు.
వైసీపీలో అధినేత పనితీరులో తప్పులు ఎత్తి చూపడానికి, ఆ తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు చెప్పడానికి వెనుకాడని ఎందరో నాయకులు ఉన్నారన్న మేకపాటి.. దురదృష్టవశాత్తూ జగన్ చుట్టూ ఉన్న నేతలు తప్పు ఎక్కడ జరుగుతుందో చెప్పకుండా, ఆయన మెప్పు కోసం భజన చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ను తప్పుదారి పట్టిస్తున్న నేతలతో చాలా ప్రమాదకరమని, అలాంటి వారిని నమ్మొద్దని హితవుపలికారు. జగన్ తన తప్పులను సరిదిద్దుకోవాలని, ఇందుకు చేసిన తప్పులు అంగీకరించాల్సివుందని మాజీ ఎంపీ మేకపాటి స్పష్టం చేశారు.
