వైసీపీతో దూరం.. మరో సీనియర్ నేత కుటుంబంపై ఆసక్తికర చర్చ
వైసీపీకి చెందిన సీనియర్ నేత మేకపాటి రాజమోహనరెడ్డి కుటుంబం పార్టీ నుంచి దూరంగా జరుగుతుందా? అన్న చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 9 Dec 2025 8:00 PM ISTవైసీపీకి చెందిన సీనియర్ నేత మేకపాటి రాజమోహనరెడ్డి కుటుంబం పార్టీ నుంచి దూరంగా జరుగుతుందా? అన్న చర్చ జరుగుతోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి అధినేత జగన్ కు అండగా ఉంటూ వచ్చిన మేకపాటి కుటుంబం కొద్దిరోజులుగా సైలెంటుగా ఉన్నట్లు చెబుతున్నారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి వయసు పైబడటంతో ఆయన గతంలో వలే చురుగ్గా రాజకీయాలు చేయడం లేదు. ఆయన సోదరుడు చంద్రశేఖరరెడ్డి గత ఎన్నికలకు ముందే పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కుమారుడు విక్రమ్ రెడ్డి, మరో సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో మేకపాటి కుటుంబం పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రధానంగా మాజీ సీఎం జగన్ వ్యవహారశైలిని తప్పుబడుతూ కొద్దిరోజుల క్రితం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి మాట్లాడారు. దీని తర్వాత పరిస్థితిలో మరింత మార్పు వచ్చిందని, ఆయనకు పార్టీకి గ్యాప్ పెరిగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ‘‘మాజీ సీఎం జగన్మోహనరెడ్డి చుట్టూ చేరిన వారి భజన వల్ల నష్టం జరుగుతోందని గత నెలలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి వ్యాఖ్యానించారు. చుట్టూ ఉన్న నేతలు భజన చేయడం వల్ల పొంగిపోతున్న మాజీ సీఎం జగన్ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారని మేకపాటి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. దీంతో మేకపాటి ఆలోచనలపై అప్పట్లోనే చర్చ జరిగింది. అయితే పార్టీ మేలు కోసమే ఆయన అలా వ్యాఖ్యలు చేయాల్సివచ్చిందని అధిష్టానానికి సమాచారం అందిందని అంటున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ, మేకపాటి కుటుంబం కొద్ది రోజులుగా సైలెంటుగా ఉంటుండంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వయసురీత్యా మేకపాటి క్రియాశీల రాజకీయాలు చేయకపోయినా, నెల్లూరు జిల్లాలో ఆయన కుటుంబ ప్రభావాన్ని తీసిపారేయలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో మేకపాటి, ఆయన సోదరుడు చంద్రశేఖరరెడ్డి వారి కుటుంబం తరఫున చురుకైన రాజకీయాలు చేసేవారు. చంద్రశేఖరరెడ్డి టీడీపీలో చేరిపోయారు. వయసురీత్యా మేకపాటి సోదరులు ఇద్దరూ తమ వారసులనే రాజకీయాల్లో కొనసాగిస్తున్నారు. అయితే మాజీ ఎంపీ మేకపాటి కుమారుల్లో ఒకరైన గౌతంరెడ్డి మరణించారు. మరో కుమారుడు విక్రమ్ రెడ్డి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. పార్టీ ఓడిన తర్వాత ఆయన ఇంతకుముందులా చురుగ్గా తిరగడం లేదు. ఇక మేకపాటి మరో సోదరుడు రాజగోపాలరెడ్డి గత ఎన్నికల్లో ఉదయగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అయితే ఇప్పుడు మేకపాటి కుటుంబంలో ఏ ఒక్కరూ చురుగ్గా వైసీపీ తరఫున రాజకీయాల్లో కొనసాగడం లేదని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా అధినేత జగన్మోహనరెడ్డి వైఖరిపై అసంతృప్తితో రగిలిపోతున్నారని అంటున్నారు. ఇతర పార్టీలతో కూడా సంప్రదింపులు మొదలుపెట్టారని అంటున్నారు. కూటమిలోని టీడీపీలో చేరాలా.. బీజేపీతో రాజకీయాలు కొనసాగించాలనే విషయమై రాజమోహనరెడ్డి కుటుంబం ఆలోచిస్తోందని ప్రచారం జరుగుతోంది. గత నెలలో జగన్ చుట్టూ భజనపరులు ఉన్నారని వ్యాఖ్యల ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేసినా, పార్టీ నుంచి ఎవరూ రాజమోహనరెడ్డిని సంప్రదించలేదని చెబుతున్నారు. ఇది కూడా ఆయన అసంతృప్తిని మరింత రాజేందని అంటున్నారు. మొత్తానికి మేకపాటి వ్యవహారం ప్రస్తుతం వైసీపీలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఆయన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం ఇప్పుడే ఉంటుందా? ఎన్నికల వరకు వేచిచూస్తారా? అనేది చూడాల్సివుంది.
