నెల్లూరు పెద్దారెడ్డికి ఎమ్మెల్సీ కావాలట !
నెల్లూరు పెద్దారెడ్లు చాలా మంది ఉన్నారు. అందులో ఆయన కూడా ఒకరు. ఆయనది బలమైన రాజకీయ నేపథ్యం.
By: Tupaki Desk | 5 May 2025 4:24 AMనెల్లూరు పెద్దారెడ్లు చాలా మంది ఉన్నారు. అందులో ఆయన కూడా ఒకరు. ఆయనది బలమైన రాజకీయ నేపథ్యం. అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నారు. ఆయన పలు మార్లు ఎంపీగా గెలిచి నెల్లూరు రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఆ సమయంలోనే ఆయన సోదరుడుగా చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
ఆయన ఉదయగిరి నుంచి అనేక సార్లు గెలిచి తన సత్తా చాటుకున్నారు. మేకపాటి బ్రదర్స్ మొదట కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ తరువాత వైసీపీలో చేరారు. ఇక వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చాక తన సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవిని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆశించారు అని అంటారు. అది దక్కలేదు సరికదా పార్టీలో తమ మాట చెల్లలేదు అన్న భావనతో ఆయన కూటమి వైపు మళ్ళారు.
అలా ఆయన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధికి ఫుల్ గా సపోర్టు చేశారు దాంతో పార్టీ ఆయన మీద యాక్షన్ తీసుకుంది. మొత్తానికి మేకపాటి టీడీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో ఉదయగిరి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని అనుకుంటే అది కాస్తా దక్కలేదు. పోనీ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా ఎమ్మెల్సీ అయినా ఇచ్చి తన గౌరవానికి తగిన మర్యాద ఇస్తారు అనుకుంటే అదీ లేదని పెద్దాయన తెగ బాధపడుతున్నారని అంటున్నారు.
తనకు కాకపోయినా తన సతీమణీ శాంతకుమారికి అయినా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తారనుకుంటే అది కూడా దక్కలేదని తెలుస్తోంది. దాంతో మేకపాటి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది. తనకు పదవి దక్కకపోవడానికి స్థానిక ఉదయగిరి టీడీపీ నేతలే కారణం అని ఆయన భావిస్తున్నారుట.
దాంతో ఆయన వారి మీదనే విమర్శలు చేస్తూ పార్టీలో కొత్త చర్చకు తెర లేపుతున్నారని అంటున్నారు. అయితే మేకపాటి తిరిగి వైసీపీలోకి వెళ్తారని జరుగుతున్న ప్రచారం కాక రేపుతోంది. దాని మీద చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శాంతకుమారి అయితే ఘాటుగా స్పందించారు. తాము టీడీపీని వీడేది లేదని ఇక్కడే ఉంటామని చెబుతూనే చేసిన మేలు గుర్తు చేసుకోలేని వారు అని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మీద పరోక్ష విమర్శలు చేశారు.
దీంతో ఉదయగిరిలో ఏదో జరుగుతోంది అన్నది అయితే పసుపు పార్టీ పెద్దలకు అందుతున్న సమాచారంగా ఉంది అయితే నెల్లూరు పెద్దారెడ్డిని హైకమాండ్ పిలిచి బుజ్జగిస్తుందా ఏదైనా పదవి ఇస్తారా లేక లైట్ తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. అయితే పదవులు ఊరకే రావు అన్నది కూడా కొత్త రాజకీయ సామెతగా గుర్తు చేసుకోవాలి. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చి ఎన్నికల్లో కొంత హెల్ప్ చేస్తే చేయవచ్చు కానీ మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే టీడీపీ ఇపుడు గుర్తించి గౌరవిస్తోందని అంటున్నారు ఓపికగా ఉంటే ఏమైనా మంచి జరగవచ్చేమో కానీ ఇలా అసంతృప్తిని బయటేసుకుంటే మాత్రం కష్టమే అని అంటున్నారు.