జగన్ చేయలేదు.. మీరేనా చేయండి చంద్రబాబు
నెల్లూరు జిల్లా ఉదయగిరి మేకపాటి కుటుంబం కంచుకోట. ఈ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గత ఎన్నికల్లో స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారు.
By: Tupaki Desk | 10 April 2025 3:00 PM ISTఆయన మాజీ ఎమ్మెల్యే.. గత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన నేత. 2023లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఎన్నికలకు ఏడాది ముందు ఎలాంటి పదవి ఆశించకుండానే టీడీపీకి దగ్గరయ్యారు. ఎన్నికలకు ముందు పసుపు కండువా కప్పుకుని స్వచ్ఛందంగా తన సీటు వదులుకున్నారు. టీడీపీ ప్రతిపాదించిన అభ్యర్థిగా మద్దతుగా ప్రచారం చేసి గెలిపించారు. అటువంటి నేత ఇప్పుడు ప్రభుత్వాధినేత చంద్రబాబును ఓ చిన్న కోరిక కోరారు. ఆయన అడిగింది చిన్నదే అయినా పార్టీలో పెద్ద పోటీ ఉండటమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. సీఎం చంద్రబాబును తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో కాదు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.
నెల్లూరు జిల్లా ఉదయగిరి మేకపాటి కుటుంబం కంచుకోట. ఈ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గత ఎన్నికల్లో స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారు. 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చంద్రశేఖర్ రెడ్డి ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తితో తిరుగుబాటు చేశారు. మేకపాటి కుటుంబం మొత్తం వైసీపీలో ఉన్నా, తనకు సరైన గుర్తింపు లేకపోవడం, నియోజవకర్గంలో తన మాట చెల్లుబాటు కాకుండా చేయడమే కారణంగా చెప్పారు. ఇక ఆయన రెండో భార్య శాంతికి ఉదయగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఇవ్వాలనే ప్రతిపాదనను వైసీపీ ప్రభుత్వం ఆమోదించకపోవడం కూడా చంద్రశేఖర్ రెడ్డిలో అసహనానికి గురిచేసిందని ప్రచారం కూడా ఉంది.
తన రాజకీయ వారసురాలిగా శాంతిని తీసుకురావాలనే ప్రయత్నాలకు మేకపాటి కుటుంబంలో ఆమోదం లభించకపోవడంతో వైసీపీ కూడా లైట్ తీసుకుందని అంటారు. దీంతో చంద్రశేఖర్ రెడ్డి ఆ పార్టీని వీడారు. తర్వాతి పరిణామాలతో టీడీపీకి దగ్గరయ్యారు. రకరకాల కారణాలతో గత ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి పోటీకి దూరంగా ఉండిపోయారు. ఆయన స్థానంలో టీడీపీ కాకర్ల సురేశ్ అనే నేతకు టికెట్ ఇవ్వడంతో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన చిరకాల కోరికను మళ్లీ తెరపైకి తెచ్చారని అంటున్నారు. ప్రస్తుతం నామినేటెట్ పోస్టులను భర్తీ చేస్తుండటంతో గత ప్రభుత్వంలో సాధించలేకపోయిన ఏఎంసీ చైర్మన్ పోస్టును తన భార్యకు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉంచారు మేకపాటి. అయితే ఆయన కోరిన పోస్టు చిన్నదే అయినా పెద్ద చిక్కుముడి ఉండటంతో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోందని చెబుతున్నారు.
ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ పోస్టును మహిళలకు రిజర్వు చేశారు. దీంతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలో ఆశలు చిగురించాయి అంటున్నారు. మహిళ రిజర్వు కోటా కింద తన భార్య శాంతిని చైర్మన్ చేయొచ్చని ఆయన భావిస్తే, ఎమ్మెల్యే సురేశ్ వేరొకరికి ఆ పోస్టు ఇస్తామంటూ హామీ ఇవ్వడంతో చిక్కుముడి పడిందని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యేకి ఇవ్వాలా? లేక సిట్టింగు ఎమ్మెల్యే సూచించిన నేతకు ఆ పోస్టు ఇవ్వాలా? అనే విషయంలో టీడీపీ పెద్దలు తర్జనభర్జన పడుతున్నారంటున్నారు. ఈ పరిస్థితుల్లో మేకపాటి ఆశలు నెరవేరుతాయో? లేదో? అన్నది ఆసక్తి రేపుతోంది.
