రూ.13 వేల కోట్లకు పైగా మోసం... ఛోక్సీకి బెల్జియం కోర్టులో ఎదురుదెబ్బ!
ఆర్థిక నేరగాడు మొహుల్ ఛోక్సీ ని బెల్జియం పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో... తన అరెస్టుని ఛోక్సీ బెల్జియం కోర్టులో సవాల్ చేశారు.
By: Tupaki Desk | 29 April 2025 2:57 PM ISTపంజాబ్ నేషనల్ బ్యాంక్ ను దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు వెల్లువెత్తిన అనంతరం ఛోక్సీ.. ఆంటిగ్వా - బార్బుడాకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఛోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని చెబుతున్నారు. ఈ సమయంలో అతడిని బెల్జియం పోలీసులు అదుపులోకి తీసుకోగా.. తాజాగా కోర్టులో షాక్ తగిలింది.
అవును... ఆర్థిక నేరగాడు మొహుల్ ఛోక్సీ ని బెల్జియం పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో... తన అరెస్టుని ఛోక్సీ బెల్జియం కోర్టులో సవాల్ చేశారు. అయితే.. న్యాయస్థానంలో అతడికి ఎదురుదెబ్బ తగిలింది. అతని పిటిషన్ పై తాజాగా విచారణ జరగ్గా.. కోర్టు కేసును వాయిదా వేసింది. తదుపరి విచారణ ఎప్పుడుంటుంది అనేది తెలియాల్సి ఉంది.
ఈ పిటిషన్ లో ఛోక్సీ.. బెల్జియ పోలీసు అధికారులపై పలుమార్పు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా.. తన ప్రాథమిక హక్కులకు అధికారులు భంగం కలిగించారని ఆరోపించినట్లు తెలుస్తోంది. ఇక.. గత వారం ఛోక్సీ తన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు దాన్ని తిరస్కరించింది.
కాగా.. ఛోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఛోక్సీ బెల్జియం పౌరుడు అయిపోగా, నీరవ్ మోడీ లండన్ లో ఆశ్రయం పొందాడు. ఈ క్రమంలో ఛోక్సీ.. బెల్జియం దేశ జాతీయురాలైన తన సతీమణి ప్రీతి సాయంతో 2023 నవంబర్ లో అతడు బెల్జియం రెసిడెన్సీ కార్డును పొందినట్లు చెబుతున్నారు.
మరోపక్క భారత్ ను వదిలిపోయిన తర్వాత తనను హంగేరీకి చెందిన బార్బరా జబారియా అనే మహిళ ట్రాప్ చేసిందని మొహుల్ ఛోక్సీ ఆరోపించిన సంగతి తెలిసిందే! తనను అరెస్ట్ చేసే దిశగా భారత్ ఓ వ్యూహాన్ని రచించిందని.. అందులో భాగంగానే ఈ బార్బరా అనే మహిళను తనపైకి ప్రయోగించిందని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా... తొలుత తనవద్దకు తెలియని వ్యక్తిగా వచ్చిన బార్బరా.. అనంతరం క్లోజ్ ఫ్రెండ్ గా మారిందని, తనను డిన్నర్ లకు ఆహ్వానించే వరకూ తమ ఫ్రెండ్ షిప్ వెళ్లిందని.. ఈ క్రమంలోనే తనను కిడ్నాప్ చేసిన బార్బరా.. తనపై వలపుల వల విసిరిందని.. ఆ విధంగా తాను అరెస్ట్ అయ్యేలా చేసిందని.. దీని వెనుక భారత్ ప్లాన్ దాగి ఉందని ఆరోపించారు!
అయితే... ఛోక్సీ ఆరోపణలను బార్బరా తీవ్రంగా ఖండించింది. తాను హంగేరీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా తనతో పరిచయం పెంచుకునేందుకు ఛోక్సీ తన అసలు గుర్తింపును దాచి పెట్టారని.. ఆ విధంగా తనను అతడే మోసం చేశారని.. అతని కారణంగా తాను ఎన్నో ఇబ్బందులు పడ్డట్లు ఆమె వాపోయారు.
