Begin typing your search above and press return to search.

ఖర్చులు తగ్గించుకునేందుకు భర్త, మాజీ భర్తతో కలిసి ఉంటున్న మహిళ!

ప్రస్తుతం నగర జీవితం రోజురోజుకూ భారంగా మారిపోతుంది. ముఖ్యంగా ఇంటి అద్దెలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.

By:  Tupaki Desk   |   6 May 2025 6:00 PM IST
US Woman Lives With Husband, Ex-Husband
X

ప్రస్తుతం నగర జీవితం రోజురోజుకూ భారంగా మారిపోతుంది. ముఖ్యంగా ఇంటి అద్దెలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. చాలీచాలని జీతాలతో నగరాల్లో బతకడం కొందరికి నిజంగానే నరకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలోని ఒక మహిళ తన భర్తతో, మాజీ భర్తతో, పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో జీవిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఖర్చులను తగ్గించుకునేందుకు ఆమె తీసుకున్న ఈ వింత నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు ఆమె తెలివితేటలను మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసుకుందాం.

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన 25 ఏళ్ల మేఘన్ మీయర్ 2020లో టేలర్ అనే పోలీస్ అధికారిని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే, 2023లో మేఘన్,టేలర్ విడాకులు తీసుకున్నారు. కానీ, తమ కుమార్తె భవిష్యత్తు కోసం అప్పుడప్పుడు కలుసుకోవాలని.. ఇద్దరం కలిసే ఆమెను పెంచాలని నిర్ణయించుకున్నారు. విడాకుల తర్వాత మేఘన్ తన స్వస్థలమైన కాలిఫోర్నియాకు తిరిగి వెళ్లిపోయింది. అక్కడ ఆమె తన పాత స్నేహితుడు మైఖేల్‌ను కలిసింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. రెండు నెలల్లోనే మేఘన్ గర్భం దాల్చింది. ఆ తర్వాత మేఘన్, మైఖేల్ కూడా పెళ్లి చేసుకున్నారు.

తన కుమార్తె తల్లికి దూరంగా ఉండకూడదని, ఆమెకు దగ్గరగా ఉండాలని టేలర్ భావించాడు. అందుకోసం మేఘన్ ఇంటికి సమీపంలో ఒక ఇల్లు కొనాలని ప్లాన్ చేశాడు. కానీ, కాలిఫోర్నియాలో ధరలు ఆకాశాన్నంతటంతో అది సాధ్యపడలేదు. ఈ సమయంలో మేఘన్ ఒక వింత ప్రతిపాదన చేసింది. అందరూ ఒకే ఇంట్లో ఉందామని, ఖర్చులను షేర్ చేసుకుందామని ఆమె టేలర్, మైఖేల్‌లకు చెప్పింది. మొదట ఆశ్చర్యపోయినప్పటికీ టేలర్, మైఖేల్ ఇద్దరూ ఈ ప్రతిపాదనకు ఓకే అన్నారు.

దీంతో ముగ్గురూ కలిసి తమ ఇద్దరు పిల్లలతో ఒకే ఇంట్లో ఉంటున్నారు. టేలర్, మైఖేల్ ఇద్దరూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారని మేఘన్ చెబుతోంది. మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికీ, తర్వాత అలవాటు పడిపోయారని, ఇప్పుడు అంతా సంతోషంగా ఉన్నామని మేఘన్ తెలిపింది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వీరి గురించి కథనం రావడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో నెటిజన్లు దీనిపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మేఘన్ ఆలోచనను మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం ఇది అనైతికమని విమర్శిస్తున్నారు.