భర్తను చంపి.. విధవగా మారి.. ప్రియుడితో పెళ్లి.. మేఘాలయ మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మధ్యప్రదేశ్ కు చెందిన ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారి రాజా రఘువంశీతో మే 11న సోనమ్ రఘువంశీకి పెళ్లి జరిగింది.
By: Tupaki Desk | 10 Jun 2025 3:14 PM ISTమేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మధ్యప్రదేశ్ కు చెందిన ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారి రాజా రఘువంశీతో మే 11న సోనమ్ రఘువంశీకి పెళ్లి జరిగింది. పెళ్లయిన ఐదో రోజే, అంటే మే 16న, సోనమ్ తన ప్రియుడు రాజ్ కుశ్వాహాతో కలిసి భర్త హత్యకు పథకం వేసింది. 'నా భర్తను చంపేయ్.. నేను విధవగా మారి నిన్ను పెళ్లి చేసుకుంటా' అని ప్రియుడితో చెప్పి మరీ భర్తను హతమార్చిన కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
హనీమూన్‌లోనే హత్యకు స్కెచ్:
హనీమూన్ కోసం రాజా రఘువంశీతో కలిసి మేఘాలయకు వెళ్లిన సోనమ్, అక్కడే ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. చిరపుంజీలో జనసంచారం లేని మార్గం వైపు రాజాను తీసుకెళ్లింది. అక్కడ కిరాయి రౌడీలతో అతడిని హతమార్చింది. ఆ తర్వాత సోనమ్ కనిపించకుండా పోయింది. కొద్దిరోజుల తర్వాత రాజా రఘువంశీ మృతదేహం లభించింది.
పోలీసుల దర్యాప్తులో బయటపడిన నిజాలు:
టూరిస్ట్ గైడ్, హోటల్ సీసీటీవీ ఫుటేజి, ఫోన్ కాల్ డాటా ఆధారంగా మేఘాలయ, మధ్యప్రదేశ్ పోలీసులు దర్యాప్తు సాగించారు. తొలుత తాను అమాయకురాలినని, ఎవరో తనను కిడ్నాప్ చేశారని సోనమ్ బుకాయించింది. కానీ పోలీసుల విచారణలో నిజాలు బయటకు రావడంతో ఆమె నేరాన్ని అంగీకరించింది. కాల్ డేటాను పరిశీలించగా, రాజ్ కుశ్వాహాతో ఆమె పెళ్లికి ముందు నుంచే టచ్‌లో ఉన్నట్లు తేలింది.
హత్యకు ప్లాన్, ప్రియుడి ప్రమేయం:
"రాజాను చంపేద్దాం.. కిడ్నాప్ నాటకం చేద్దాం. అప్పటికి నేను విధవగా మారుతాను. నాన్న కూడా మన పెళ్లికి అంగీకరిస్తారు" అని సోనమ్ తన ప్రియుడు రాజ్‌కు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. భర్తను హత్య చేసిన కత్తిని (డావ్) గువాహటిలోంచి ఆన్‌లైన్ ద్వారా తెప్పించారు. సంఘటనకు ముందు నిందితులు సోనమ్ హోం స్టేకు 1 కి.మీ దూరంలోని హోటల్లో బస చేశారు. వారికి లొకేషన్ పంపించింది కూడా సోనమే.
అంత్యక్రియల్లోనూ ప్రియుడు:
ఈ కేసులో నిందితుడుగా ఉన్న రాజ్ కుశ్వాహా, రఘువంశీ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నట్లు రాజా రఘువంశీ కుటుంబసభ్యులు వెల్లడించారు. రఘువంశీ మృతదేహం దొరికిన తర్వాత దాన్ని ఇందౌర్‌కు తరలించేందుకు తాము నాలుగు వాహనాలను ఏర్పాటుచేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అందులో ఒక దాన్ని నిందితుడు నడిపాడని వారు వివరించారు. సోనమ్ తండ్రిని కూడా అతడు ఓదార్చినట్లు పేర్కొన్నారు. అరెస్టు తర్వాతనే అతడి గురించి తమకు తెలిసిందన్నారు. ఈ హత్యలో తన ప్రమేయం ఉందనే విషయం బయటపడకుండా ఉండేందుకే కుశ్వాహా రఘువంశీ కుటుంబానికి విధేయుడిలా నటించినట్లు తెలుస్తోంది.
ముగ్గురి అరెస్టు:
ఈ కేసులో మృతుడి భార్య సోనమ్‌తో సహా మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో రాజ్ కుశ్వాహా, కిరాయి రౌడీలు కూడా ఉన్నారు. సోనమ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. ఆమెను పాట్నా నుంచి గౌహతికి విమానంలో తరలించి, అక్కడి నుంచి మేఘాలయకు తీసుకెళ్లి కోర్టులో హాజరుపరచనున్నారు.