Begin typing your search above and press return to search.

బ్యాక్ టు బ్యాక్ ట్విస్టులు: మేఘాలయ హనీమూన్ మర్డర్

జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన మేఘాలయ హనీమూన్ మర్డర్ విషయంలో వెలుగు చూస్తున్న విషయాలు.. బయటకు వస్తున్న వాస్తవాల్ని చూస్తే ట్విస్టుల మీద ట్విస్టులు అన్నట్లుగా మారింది.

By:  Tupaki Desk   |   9 Jun 2025 5:18 PM IST
బ్యాక్ టు బ్యాక్ ట్విస్టులు: మేఘాలయ హనీమూన్ మర్డర్
X

జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన మేఘాలయ హనీమూన్ మర్డర్ విషయంలో వెలుగు చూస్తున్న విషయాలు.. బయటకు వస్తున్న వాస్తవాల్ని చూస్తే ట్విస్టుల మీద ట్విస్టులు అన్నట్లుగా మారింది. బాధితుల వాదన ఒకలా.. నిందితుల మాట మరోలా.. అధికారుల ప్రకటనలు ఇంకోలా.. మొత్తం ఇష్యూపై గందరగోళ పరిస్థితి నెలకొంది. అసలేం జరిగింది? ఏం జరుగుతోంది? తప్పు ఎవరిది? నేరం ఎవరు చేశారు? లాంటి ప్రశ్నలకు వస్తున్న సమాధానాలు పరస్పర విరుద్ధంగా ఉండటం గమనార్హం.

ఈ నేపథ్యంలో అసలే జరిగింది? ఎవరు ఏం చెబుతున్నారు? అన్నది మాత్రమే మేం చెప్పాలనుకుంటున్నాం. ఎందుకుంటే.. పోలీసు అధికారుల వాదనకు.. నిందితురాలి మాటలకు పొంతన ఉండటం లేదు. అంతేకాదు.. నిందితురాలిగా పోలీసులు చెబుతున్నవేళ.. ఆమె తండ్రి వాదన భిన్నంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో వివిధ వర్గాలు చేస్తున్న వాదనల్ని మీకు సమగ్రంగా అందించాలని భావిస్తున్నాం.

అసలేం జరిగింది?

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన రాజా రఘవంశీకి మేలో సోనమ్ అనే మహిళతో పెళ్లైంది. ఇక్కడ రాజా రఘవంశీ కుటుంబం గురించి ఒక్క మాట చెప్పాలి. వారు ఇండోర్ లో ట్రాన్స్ పోర్టు వ్యాపారం చేస్తుంటారు. వారిద్దరు గత నెల 20న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత వారిద్దరు కనిపించకుండా పోయారు. ఇది జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. విహార యాత్రల కోసం.. హనీమూన్ కోసం ఈశాన్య రాష్ట్రాలకు పెద్ద ఎత్తున టూరిస్టులు వెళ్లినా.. ఎప్పుడూ ఇలాంటి ఉదంతాల్ని విన్నది లేదు. అందుకు భిన్నంగా చోటు చేసుకున్న ఈ పరిణామం షాకింగ్ గా మారింది.

మిస్టరీ మిస్సింగ్ తర్వాతేమైంది?

హనీమూన్ కు వచ్చిన జంట మిస్ అయిన 11 రోజుల తర్వాత రఘువంశీ డెడ్ బాడీ ఒక జలపాతం వద్ద దొరికింది. అతడి మృతదేహంపై కత్తిపోట్లు ఉన్నాయి. దీంతో అతను హత్యకు గురైనట్లుగా పోలీసులు భావించారు. అదే సమయంలో సోనమ్ ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. అనూహ్యంగా ఆమె గాజీపూర్ లో ప్రత్యక్షం కావటం ఒక ట్విస్టుగా మారింది.

గైడ్ ఇచ్చిన సమాచారంతో కొత్త ట్విస్టు

హనీమూన్ జంట మిస్ అయిన వేళ.. ఈ వ్యవహారంపై పోలీసులు సీరియస్ గా తీసుకొని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు స్థానిక గైడ్ ఒకరు కీలక అంశాన్ని వెల్లడించారు. మిస్ అయిన సదరు జంటను తాను చివరి సారిగా చూసిన సమయంలో మరో ముగ్గురు వ్యక్తులతో కనిపించినట్లుగా పేర్కొన్నారు.

ఇండియా టుడే కథనం ఏమిటి?

ఈ మిస్టరీ క్రైం విషయంలో జాతీయ స్థాయిలో పేరున్న ఇండియా టుడే ఒక షాకింగ్ అంశాన్ని వెల్లడించింది. ఆ మీడియా సంస్థ కథనం ప్రకారం సోనమ్ కు మరో వ్యక్తితో ప్రేమలో ఉండేవారని.. అయితే తల్లిదండ్రుల బలవంతం మీద రఘువంశీని పెళ్లాడాల్సి వచ్చినట్లుగా పేర్కొంది. సోనమ్ కు రాజ్ కుష్వాహా అనే వ్యక్తితో సంబంధం ఉందని.. అందుకు భర్తను చంపేందుకు సోనమ్ కుట్ర పన్నినట్లుగా పేర్కొంది. ఇందుకోసం మధ్యప్రదేశ్ కాంట్రాక్టు కిల్లర్లతో మాట్లాడుకున్నట్లుగా వెల్లడించింది.

పోలీసుల అధికారిక ప్రకటన సారాంశం ఏమిటి?

ఈ వ్యవహారంపై మేఘాలయ పోలీసులు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో కీలక అంశాల్ని పేర్కొన్నారు. సదరు అంశాల్ని మేఘాలయ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఇదాషిఫా నోంగ్ రాంగ్ ధ్రువీకరించారు. సదరు ప్రకటనలోని అంశాలు ఏమంటే..

- సోనమ్ ఉత్తరప్రదేశ్ లోని ఘజీపూర్ జిల్లాలోని నందగంజ్ పోలీస్ స్టేషన్ లో స్వచ్ఛందంగా లొంగిపోయారు. ప్రస్తుతం ఆమె యూపీ పోలీసుల కస్టడీలో ఉన్నారు.

- ఆమెను అక్కడి నుంచి తరలించేందుకు చట్టపరమైన ప్రోటోకాల్ అమలు చేస్తున్నాం.

- భర్తను హత్య చేయటానికి ఆమె కుట్ర పన్నారు. తన పథకాన్ని అమలు చేయటానికి కాంట్రాక్టు కిల్లర్లతో మాట్లాడుకున్నారు.

- మధ్యప్రదేశ్ కు చెందిన అనుమానితుల్లో ముగ్గురిని ఇప్పటివరకు అరెస్టు చేశాం. నాలుగో వ్యక్తి పరారీలో ఉన్నారు.

భర్త సోదరుడి ఏం చెప్పారు?

తన వదిన సోనమ్ రాజ్ కుశ్వాహా అనే వ్యక్తితో తరచూ మాట్లాడుతుందని పేర్కొన్నారు. సోనమ్ సోదరుడు గౌరవ్ నిర్వహిస్తున్న కంపెనీలో అతను అకౌంటెంట్ గా పని చేస్తున్నాడని చెప్పారు. ఈ వాదనకు బలం చేకూరేలా పోలీసులు అరెస్టు అయిన ఇద్దరు కూడా ఇదే కంపెనీలో పని చేస్తున్న వారు కావటం గమనార్హం.

సోనమ్ ఏం చెబుతోంది?

భర్తను సుపారీ ఇచ్చి మరీ చంపించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలి వాదన ఏమిటి? ఆమేం చెబుతుందన్నది చూస్తే.. తాను నిందితురాలిని కాదని బాధితురాలిగా చెప్పిన్నట్లు తెలుస్తోంది. తనను ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ‘నన్ను కిడ్నాప్ చేశారు. తర్వాత గాజీపూర్ లో వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచే నేను మావాళ్లకి ఫోన్ చేశా’ అని పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. గాజీపూర్ లోని ఒక హోటల్ వద్ద ఆమె ఉండగా.. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

సోనమ్ తండ్రి వాదన ఏంటి?

సోనమ్ మీద వస్తున్న కథనాలపై ఆమె తండ్రి దేవీ సింగ్ తప్పు పట్టారు. ఆమె ఎవరితోనూ సంబంధాలు లేవని.. రాజ్ అనే వ్యక్తి ఆమెతో కలిసి పని చేస్తాడని పేర్కొన్నారు. బలవంతంగా పెళ్లి చేశారన్న వాదనలో నిజం లేదన్నారు. మేఘాలయ పోలీసుల కట్టుకథగా ఆయన మండిపడ్డారు. ఈ కేసు విచారణను సీబీఐకు అప్పగించాలని ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుస్తానని చెబుతున్నారు.

మేఘాలయ సీఎం స్పందన ఏంటి?

జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన ఈ ఉదంతంపై తాజాగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా స్పందించారు. సోషల్ మీడియాలో ఆయన పోలీసుల్ని ప్రశంసిస్తూ పోస్టు పెట్టారు. ఏడు రోజుల్లోనే హత్యకేసును చేధించారని.. మధ్యప్రదేశ్ కు చెందిన ముగ్గురు దుండగుల్ని అరెస్టు చేశారన్నారు. నిందితురాలు పోలీసులకు లొంగిపోయినట్లుగా పేర్కొన్నారు. మరో నిందితుడ్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పారు.