Begin typing your search above and press return to search.

హనీమూన్ టూ జైలు... సోనమ్ తాజా పరిస్థితిపై రెండు కీలక విషయాలు!

మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 July 2025 3:21 PM IST
హనీమూన్  టూ జైలు... సోనమ్  తాజా పరిస్థితిపై రెండు కీలక విషయాలు!
X

మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితురాలు సోనమ్ ప్రస్తుతం షిల్లాంగ్ జైల్లో ఉంది. ఈ సమయంలో.. ఆమె తాజా పరిస్థితికి సంబంధించిన రెండు కీలక విషయాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... జరిగిన సంఘటనపై ఆమె ఏమాత్రం పశ్చాత్తాప పడటం లేదని అంటున్నారు!

అవును... సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో నిందితురాలు సోనమ్‌ ప్రస్తుతం షిల్లాంగ్‌ జైలులో ఉండగా... నెల రోజులు దాటినా ఆమెను చూసేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదని అంటున్నారు. ఆమెకు ములాఖత్‌ అవకాశం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు కుటుంబ సభ్యులెవరూ నిందితురాలిని చూడటానికి రాలేదని జైలు వర్గాలు పేర్కొన్నాయి.

మరోవైపు.. చేసిన నేరానికి ఆమె ఏమాత్రం పశ్చాత్తాపపడట్లేదని చెబుతున్నారు. షిల్లాంగ్‌ జైలులో వార్డెన్ ఆఫీసుకు దగ్గరలో ఉన్న గదిలో సోనమ్‌ ను ఉంచగా.. ఇదే గదిలో ఆమెతో పాటు మరో ఇద్దరు అండర్‌ ట్రయల్‌ మహిళా ఖైదీలు ఉన్నారు. ఆమెను నిరంతరం సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచినట్లు జైలు వర్గాలు వెల్లడించాయి.

అయితే... తన వ్యక్తిగత జీవితం, చేసిన నేరం, అందుకు దారి తీసిన పరిస్థితులు, మొదలైన ఏ విషయం గురించీ ఆమె తోటి ఖైదీలకు ఎలాంటి వివరాలు చెప్పలేదని అంటున్నారు. ఆమె ఎవరితోనూ పెద్దగా మాట్లాడటం లేదని అంటున్నారు. ఇదే క్రమంలో కనీసం ఫోన్ లో కూడా ఆమెతో కుటుంబ సభ్యులు ఎవరూ మాట్లాడటం లేదని చెబుతున్నారు.

కాగా... మధ్యప్రదేశ్‌ కు చెందిన రాజా రఘువంశీకి ఈ ఏడాది మే 11న సోనమ్‌ తో వివాహం జరగ్గా.. 20న హనీమూన్‌ కోసం మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత వీరు కన్పించకుండా పోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే అదృశ్యమైన 11 రోజుల తర్వాత రాజా రఘువంశీ మృతదేహాన్ని లోయలో పోలీసులు గుర్తించారు.

ఆ సమయంలో... అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు. ఇదే సమయంలో సోనమ్‌ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఆమె జూన్‌ 7న ఆమె ఉత్తరప్రదేశ్‌ లోని గాజీపుర్‌ లో ప్రత్యక్షమైంది. ప్రియుడు రాజ్ కుశ్వాహో తో కలిసి భర్తను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.