భర్తను చంపి.. ఏమోషనల్ స్టేటస్ పెట్టింది.. కి‘లేడీ’ క్రైం కథ
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
By: Tupaki Desk | 11 Jun 2025 5:00 AMమేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త రాజా రఘువంశీని అత్యంత కిరాతకంగా చంపించిన భార్య సోనమ్, హత్య జరిగిన వెంటనే "ఏడేడు జన్మల్లోనూ నువ్వే నా తోడుగా" అనే క్యాప్షన్తో ఫోన్లో వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మధ్యప్రదేశ్ పోలీసులు దర్యాప్తులో వెల్లడించిన విషయాలు, సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహాతో ఆమెకున్న సంబంధం, హత్య ప్రణాళికకు సంబంధించిన వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.
-హత్య ప్రణాళిక - అద్దె హంతకులతో బేరం
పోలీసుల దర్యాప్తు ప్రకారం, సోనమ్ తన భర్త రాజా రఘువంశీని చంపేందుకు కిరాయి గూండాలను ఆశ్రయించింది. మొదట ₹4 లక్షలు ఇవ్వజూపగా, వారు నిరాకరించడంతో ఆ మొత్తాన్ని ₹20 లక్షలకు పెంచినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఒప్పందం ద్వారానే రాజా రఘువంశీ హత్యకు పథకం రచించబడినట్లు తెలుస్తోంది.
-హత్య తర్వాత... ప్రియుడితో పథకం
హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 23 నుండి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం గుర్తించబడింది. కనిపించకుండా పోయిన సోనమ్ ఉన్నట్టుండి ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యక్షమై, తనను ఎవరో కిడ్నాప్ చేసి, గాజీపుర్‌లో వదిలిపెట్టారని ఆరోపించింది. అయితే, మధ్యప్రదేశ్ పోలీసులు ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని తేల్చి చెప్పారు. అదనపు డీసీపీ రాజేశ్ దండోటియా వెల్లడించిన వివరాల ప్రకారం, మే 25-27 మధ్య సోనమ్ రైలులో ఇందౌర్‌కు వచ్చింది. అక్కడ దేవాస్ గేట్‌లోని ఓ అద్దె గదికి చేరుకుని, తన ప్రియుడు రాజ్ కుశ్వాహాను కలుసుకుంది. అక్కడే వీరిద్దరూ పారిపోయేందుకు పథకం రచించారు. ఓ ట్యాక్సీ మాట్లాడి సోనమ్‌ను యూపీకి పంపించాడు. యూపీకి ఎందుకు వెళ్లిందన్న దానిపై స్పష్టత లేదని, కేసును తప్పుదోవ పట్టించడం కోసమే ఆమె గాజీపుర్‌కు వెళ్లి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య తర్వాత మేఘాలయ నుంచి ఆమె రైలులో గువాహటి (అస్సాం)కి అక్కడి నుంచి పట్నా (బిహార్)కు వెళ్లినట్లు గుర్తించారు.
-కుటుంబానికి ముందే తెలిసిన సంబంధం - బెదిరింపులు
రాజా రఘువంశీ సోదరుడు విపిన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. రాజ్ కుశ్వాహాతో సోనమ్‌కు సంబంధం గురించి ఆమె ఇంట్లో వాళ్లకు ముందే తెలుసని తెలిపారు. రాజ్‌తో ప్రేమ గురించి సోనమ్ తల్లికి చెప్పి, రఘువంశీని పెళ్లి చేసుకోనని చెప్పింది. అయితే, ఆమె తల్లి అందుకు అంగీకరించక, బలవంతంగా రాజా రఘువంశీతో పెళ్లికి ఒప్పించినట్లు విపిన్ పేర్కొన్నారు. ఆ సమయంలో సోనమ్ తన తల్లిని బెదిరిస్తూ "పెళ్లి అయితే చేసుకుంటాను గానీ... ఆ తర్వాత రాజా రఘువంశీని ఏం చేస్తానో చూడు. మీరు అవన్నీ భరించాల్సిందే" అని చెప్పినట్లు తమకు తెలిసినట్లు విపిన్ వెల్లడించారు.
హత్య సమయంలో సోనమ్ అక్కడే...
ఈ కేసులో అరెస్టయిన నిందితుల్లో సోనమ్ మినహా మిగతా నలుగురు తమ నేరాన్ని అంగీకరించినట్లు ఇందౌర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. రాజా రఘువంశీని చంపే సమయంలో సోనమ్ అక్కడే ఉందని, ఘటనను చూసిందని నిందితులు చెప్పినట్లు తెలిపారు. ఘటన సమయంలో రాజ్ కుశ్వాహా ఇందౌర్‌లోనే ఉన్నాడు. మిగతా ముగ్గురు ప్రయాణ ఖర్చులకు ఇతడే డబ్బులు సమకూర్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.
రాజా రఘువంశీ పెళ్లి నచ్చని సోనమ్, పెళ్లయిన నాలుగు రోజులకే పుట్టింటికి వెళ్లి అక్కడ రాజ్ కుశ్వాహాతో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత వీరిద్దరూ రఘువంశీ హత్యకు కుట్ర చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ కేసులో అరెస్టయిన సోనమ్‌ను షిల్లాంగ్‌కు తీసుకొచ్చారు. బుధవారం ఆమెను కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.