తన ప్లేసులో మరో మహిళను చంపాలని ప్లాన్.. సోనమ్ తెలివికి పోలీసుల షాక్
మేఘాలయ హనీమూన్ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
By: Tupaki Desk | 14 Jun 2025 4:00 PM ISTమేఘాలయ హనీమూన్ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రఘువంశీని హత్య చేశాక, ఎవరైనా మహిళను చంపి, మృతదేహాన్ని కాల్చి, అది సోనమ్‌ది అని నమ్మించాలని నిందితులు ప్లాన్ చేసినట్లు సమాచారం. లేదా సోనమ్ మృతదేహం నదిలో కొట్టుకుపోయినట్లు నమ్మించాలని చూశారు. కానీ ఆ ప్రాంతంలో పర్యాటకులు ఎక్కువగా ఉండటంతో ఈ ప్లాన్‌లు వర్కవుట్ అవ్వలేదు.
పోలీసులు రంగంలోకి దిగడంతో ప్లాన్ వర్కవుట్ కాలేదు గానీ, లేకపోతే సోనమ్ కుట్రకు మరో ప్రాణం బలై ఉండేది. కస్టడీలో ఉన్న హనీమూన్ మర్డర్ మాస్టర్‌మైండ్ సోనమ్ ఎంక్వయిరీలో షాకింగ్ నిజాలు బయటికొస్తున్నాయి. షిల్లాంగ్‌లో రాజా రఘువంశీని హత్య చేశాక ఎలా పారిపోవాలో ముందే ప్లాన్ చేసుకుంది సోనమ్. ప్రియుడు రాజ్ కుష్వాహా ఇచ్చిన బురఖా వేసుకుని పోలీసుల కంటపడకుండా తప్పించుకుంది. షిల్లాంగ్ నుంచి గౌహతికి టాక్సీలో చేరుకుంది సోనమ్. తర్వాత బస్సులో పశ్చిమబెంగాల్‌లోని సిలిగురికి చేరింది. అక్కడినుంచి పాట్నాకు, ఆ తర్వాత రైల్లో లక్నోకి వచ్చింది. చివరికి బస్సులో ఇండోర్‌కి వెళ్లి అక్కడ ప్రియుడిని కలుసుకుంది.
హనీమూన్ వంకతో ఇండోర్ నుంచి గౌహతికి చేరుకోగానే అక్కడే రఘువంశీని అడ్డుతొలగించుకోవాలని సోనమ్ అనుకుంది. కానీ గౌహతిలో ప్లాన్ వర్కవుట్ కాలేదు. దీంతో సోనమ్ సూచనతో రాజ్ స్నేహితులు ముగ్గురూ మేఘాలయకు వెళ్లారు. వెసాడాంగ్ వాటర్‌ఫాల్స్ వద్ద అదను చూసుకుని, సోనమ్ డైరెక్షన్‌లో రాజా రఘువంశీని చంపేశారు. రాజ్‌తో పాటు సోనమ్ కూడా చనిపోయినట్టు నమ్మించాలనుకున్నారు. వేరే ఒక మహిళను చంపి, ఆమె శవాన్ని సోనమ్‌దిగా చూపించాలని నిందితులు స్కెచ్ వేశారు. కానీ ఆలోపే వారి పాపం పండింది. నిందితులంతా పోలీసులకు దొరికిపోయారు.
రాజా రఘువంశీని దారుణంగా చంపిన ముగ్గురూ డబ్బుకోసమే ఆ పనిచేశారని అంతా అనుకున్నారు. కానీ వారు కిరాయి హంతకులు కాదు. ఎలాంటి నేరచరిత్రా లేదు. రాజ్ కుష్వాహాకి స్నేహితులు. ఫ్రెండ్ అడిగాడని ప్రియురాలి భర్తను చంపేందుకు సిద్ధమయ్యారు. రాజ్ తన స్నేహితులకు 50 వేల రూపాయలు ఇచ్చాడు. భర్తను చంపేశాక సోనమ్ వారికి కొంత డబ్బిచ్చింది. ఆకాష్ అరెస్ట్ కాగానే ప్రియుడు రాజ్ సూచనతో గాజీపూర్‌లో సోనమ్ పోలీసులకు లొంగిపోయింది. కిడ్నాప్ కథ అల్లినా, అప్పటికే పోలీసులకు కీలక ఆధారాలు దొరకడంతో ఎంక్వైరీలో మర్డర్ కహానీ అంతా పూసగుచ్చినట్లు చెప్పేసింది.
రఘువంశీ మర్డర్ కేసులో సోనమ్‌తో పాటు ఐదుగురు నిందితులను 8 రోజుల కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, వారిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా త్వరలో చార్జిషీట్ దాఖలు చేయబోతున్నారు.
