Begin typing your search above and press return to search.

హనీమూన్ మర్డర్.. మంగళసూత్రమే పట్టించింది

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్యకేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది.

By:  Tupaki Desk   |   12 Jun 2025 4:16 PM IST
హనీమూన్ మర్డర్.. మంగళసూత్రమే పట్టించింది
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్యకేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో వెలుగుచూసిన కీలక ఆధారాలలో ఒకటి మంగళసూత్రం. పెళ్లైన మూడో రోజే నూతన వధువు సోనమ్ తన మంగళసూత్రాన్ని, వేడ్డింగ్ రింగ్‌ను తీసి సూట్‌కేస్‌లో పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. సాధారణంగా కొత్తగా పెళ్లైన మహిళ మంగళసూత్రాన్ని అంత త్వరగా తీయదు. ఈ అంశమే పోలీసులకు అనుమానానికి తావిచ్చి, చివరికి ఆమెను అడ్డంగా దొరికేలా చేసిందని తెలుస్తోంది.

కుట్ర, హత్య: ప్రేమికుడితో కలిసి పన్నిన ఘోరం

హనీమూన్‌కు భర్త రాజా రఘువంశీతో కలిసి మేఘాలయకు వచ్చిన సోనమ్, ముందుగానే అతన్ని హత్య చేయాలని ప్రణాళిక రచించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కుట్రలో ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా కూడా భాగమయ్యాడు. మే 22న ఈ ఇద్దరు సోహ్రా ప్రాంతంలోని హోమ్‌స్టేకు చేరుకున్నారు. గది అందుబాటులో లేకపోవడంతో తమ సామాను అక్కడే ఉంచి ట్రెక్కింగ్‌కు బయల్దేరారు. మరుసటి రోజు మే 23న తిరిగి వచ్చిన తరువాత, వారు స్కూటర్‌పై వీసాడాంగ్ జలపాతం వైపు వెళ్లారు. అక్కడే రాజా రఘువంశీని లోయలోకి తోసి చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

-మంగళసూత్రం: కేసులో కీలక ఆధారం

ఈ హత్యకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన మేఘాలయ పోలీసులు హోమ్‌స్టేలోని రూమ్‌ను పరిశీలించారు. అక్కడే సూట్‌కేస్‌లో కనిపించిన మంగళసూత్రం, ఉంగరం అధికారులను తీవ్ర అనుమానానికి గురి చేశాయి. "కొత్తగా పెళ్లైన మహిళ మంగళసూత్రాన్ని అస్సలు తీయదు. మరి సోనమ్ ఎందుకు తీసిందని ప్రశ్నించాం. అప్పుడు ఆమె నేరాన్ని ఒప్పుకుంది" అని మేఘాలయ డీజీపీ మీడియాకు వెల్లడించారు. ఈ అంశమే కేసులో కీలక ఆధారంగా మారి, సోనమ్‌ను నిలదీయడానికి పోలీసులకు అవకాశం కల్పించింది.

-నేరం ఒప్పుకున్న నిందితురాలు: తీవ్ర శిక్ష కోరుతున్న కుటుంబ సభ్యులు

ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా సోనమ్‌నే పోలీసులు నిర్ధారించారు. ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా కూడా హత్యకు సహకరించినట్లు విచారణలో తేలింది. తమ అక్క భర్తను చంపించిందని సోనమ్ సోదరుడు గోవింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఆమె నేరం రుజువైతే ఉరిశిక్ష వేయాలి" అని గోవింద్ డిమాండ్ చేశారు.