నక్కపల్లి కాదు ఉక్కు శక్తి
ఈ ఉక్కు కర్మాగారం పూర్తి అయితే యాభై వేల నుంచి డెబ్బై వేల మంది వరకూ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉత్తరాంధ్ర జిల్లాల వలస బాధ తప్పుకుంది.
By: Satya P | 23 March 2026 11:00 PM ISTఉత్తరాంధ్రా మీద ఏపీలో కూటమి ప్రభుత్వం పూర్తి ఫోకస్ పెట్టింది. దాంతో గడచిన ఇరవై నెలల కాలంలో ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తోంది. తాజాగా చూస్తే ఏకంగా లక్షా యాభై వేల కోట్ల రూపాయలతో దేశంలోనే అతి పెద్ద పెట్టుబడితో భారీ ఉక్కు కర్మాగారం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏర్పాటు అవుతోంది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ నిర్వహించారు. ఈ ఉక్కు కర్మాగారం పూర్తి అయితే యాభై వేల నుంచి డెబ్బై వేల మంది వరకూ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉత్తరాంధ్ర జిల్లాల వలస బాధ తప్పుకుంది.
చరిత్రలో నక్కపల్లి :
పాయకరావుపేటలో నక్కపల్లి అని ఒక మండలం ఉంది. అది నిన్నటిదాకా ఒక మాదిరి. కానీ ఈ రోజు నుంచి ఈ ప్రాంతం దశ తిరిగింది. ఏకంగా జాతీయ స్థాయిలో మారు మోగనుంది. దానికి కారణం భారీ ఎత్తున ఉక్కు కర్మాగారం నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏర్పాటు అవుతోంది. దాంతో నక్కపల్లి కాదు ఉక్కు శక్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు కితాబు ఇచ్చారు. ఈ ప్రాంతం ఇక మీదట పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందబోఒతోంది అని ఆయన చెప్పుకొచ్చారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ :
ఇక కేవలం ఇరవై నెలలలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటును సాకారం చేసి చూపించామని బాబు చెప్పుకొచ్చారు. ఇక ఈ భారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. కేవలం స్టీల్ ప్లాంట్‌కు మాత్రమే కాదని, స్టీల్ సిటీకి శంకుస్థాపన జరిగిందని బాబు చెప్పడం విశేషం. ఈ స్టీల్ ప్లాంట్ తో పాటు 11,198కోట్లతో క్యాప్టివ్ పోర్టు కూడా నిర్మాణం జరుగుతుందని బాబు తెలిపారు. ఇక 2028 నాటికి ప్లాంట్‌లో మొదటి దశ ఉత్పత్తి చేసేలా కార్యాచరణ ఉంటుందని అలాగే 2030 జూన్ నాటికి మొదటి బ్లాస్టర్ ఫర్సెన్, డిసెంబరు నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నెస్ నిర్మాణం పూర్తి చేస్తారని వివరించారు. అంతే కాదు జాతీయ రహదారిని అనుసంధానిస్తూ నాలుగు లైన్ల రహదారి కూడా పూర్తి అవుతుందని అన్నారు. అలాగే ఉక్కు పరిశ్రమకు ముడి ఇనుము సరఫరా కోసం పైప్ లైన్ కూడా వేయబోతున్నారని, దాంతో ఉక్కు ఉత్పత్తి ఒక్కటే కాదు ఆర్ధిక లావాదేవీలలో విద్య, వైద్యం, ఉద్యోగాలతో ఈ ప్రాంత రూపు రేఖలు మారతాయని బాబు చెప్పడం విశేషం.
ఉద్యోగాంధ్రగా :
కేవలం ఒక్క రోజు తేడాలో విశాఖలో కీలక ప్రాజెక్టులకు అంకురార్పణ జరిగింది. విశాఖలో ఒక బ్రాండెడ్ హొటల్ నిర్మాణానికి పర్యాటన మంత్రి కందుల దుర్గేష్ శ్రీకారం చుట్టారు. మరో వైపు చూస్తే విశాఖ నడిబొడ్డున అతి పెద్ద మాల్ ని కూడా కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. దీని వల్ల ఎనిమిది వేల మంది దాకా ఉపాధి దక్కుతుంది. ఇపుడు భారీ ఉక్కు కర్మాగారం గా మిట్టల్ ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోతోంది. రెండు దశలుగా మొత్తం 18 మిలియన్ టన్నుల స్టీల్ ఏటా ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. దాంతో వేలాది మందికి ఉపాధి కలుగుతుంది. వీటితో పాటుగా మరిన్ని ఐటీ పరిశ్రమలు ఇతర పరిశ్రమలు విశాఖ సహా ఉత్తరాంధ్రాలో రాబోతున్నాయి. ఈ క్రమంలో నిన్నటిదాకా ఉత్తరాంధ్రా వలసలు జిల్లాలుగా ఉండేది, కానీ ఇక మీదట ఉద్యోగాంధ్రాగా మారబోతోంది అని అంటున్నారు. ఇదంతా కూటమి ప్రభుత్వం అధినాయకుడు చంద్రబాబు విజన్ తోనే సాధ్యపడుతోంది అని అంటున్నారు.
