Begin typing your search above and press return to search.

అశోక్ కుమార్తెకు చెక్ పెడుతున్న మీసాల గీత...!?

విజయనగరం అసెంబ్లీ సీటులో ఈసారి పోటీ రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   8 April 2024 3:44 AM GMT
అశోక్ కుమార్తెకు చెక్ పెడుతున్న మీసాల గీత...!?
X

విజయనగరం అసెంబ్లీ సీటులో ఈసారి పోటీ రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తాను రాజకీయంగా పదవీ విరమణ చేసి మరీ కుమార్తె అదితి గజపతిరాజుకు టికెట్ ఇప్పించుకున్నారు.

విజయనగరం అసెంబ్లీ నుంచి కుమార్తె విజయం సాధిస్తే పూసపాటి వారి మూడవ తరం కూడా రాజకీయంగా స్థిరపడుతుందని ఆయన ఆశపడుతున్నారు. అందుకోసమే ఆయన గత పదేళ్లుగా పావులు కదుపుతూ వస్తున్నారు. నిజానికి చూస్తే 2014లో అశోక్ కి లోక్ సభకు పోటీ చేయడం ఇష్టం లేదు. కానీ చంద్రబాబు ఆయనను పోటీకి పెట్టారు.

ఆ టైం లో విజయనగరం అసెంబ్లీ సీటుని మీసాల గీతకు ఇచ్చారు. ఆమె అలా తొలిసారి ఎమ్మెల్యేగా విజయనగరం నుంచి గెలిచి వచ్చారు. అంతకు ముందు ఆమె 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజకీయ అరంగేట్రం చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓటమి చూసారు. ఆ ఎన్నికల్లో ఆమె అశోక్ కి ప్రత్యర్థిగా ఉన్నారు.

ఆ తరువాత ఆమె టీడీపీలో చేరినా అశోక్ కి కానీ రాజా వారి బంగ్లాకు కానీ దూరంగా ఉంటూనే రాజకీయాలు చేశారు. మరో వైపు చూస్తే ఆమె 2014లో ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆమెను పక్కన పెట్టి విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో అశోక్ చక్రం తిప్పారు అని కూడా గీత వర్గం అంటుంది. ఇక 2019 నాటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గీతను పక్కన పెట్టి తన కుమార్తెకు అశోక్ టికెట్ ఇప్పించుకున్నారు.

అయితే తొలి ప్రయత్నంలో అదితి గజపతిరాజు ఓటమి పాలు అయ్యారు. దానికి కారణం బీసీ మహిళా ఎమ్మెల్యేల్ను పక్కన పెట్టడమే అని అంటారు. ఇక 2024 ఎన్నికల్లో తనకు తప్పకుండా టికెట్ వస్తుందని గీత భావిస్తే మళ్ళీ అదితికే టికెట్ ఇచ్చారు. దాంతో మీసాల గీత ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధపడుతున్నారు. ఆమె టీడీపీలో ఉన్నా అశోక్ బంగ్లా రాజకీయాలకు దూరంగానే తనదైన రాజకీయం చేస్తూ వచ్చారు.

ఇపుడు కూడా తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి చూస్తున్నారు అని అంటున్నారు. విజయనగరం అసెంబ్లీ సీటులో చూస్తే దాదాపుగా డెబ్బై వేల పై చిలుకు కాపులు ఉన్నారు. వారంతా బీసీ కాపులు. దాంతో అదే సామాజిక వర్గానికి చెందిన గీత తమ సామాజికవర్గం బలం మొత్తం జనాభాలో నలభై శాతంగా ఉంటే తనను ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించకపోవడం తో ఆగ్రహం చెందారని అంటున్నారు. ఆ సామాజికవర్గం మద్దతుతో ఆమె ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధపడుతున్నారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే అదితి గజపతిరాజు విజయావకాశాల మీద భారీ దెబ్బ పడుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.