Begin typing your search above and press return to search.

బ్యారేజ్ లపై అవేమి మాటలు కేసీఆర్... ఇంతలోనే అంతమార్పా?

తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు, విపక్షం బీఆరెస్స్ కు మధ్య రాజకీయ వాతావరణం మరింత వేడెక్కిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   14 Feb 2024 9:39 AM GMT
బ్యారేజ్ లపై అవేమి మాటలు కేసీఆర్... ఇంతలోనే అంతమార్పా?
X

తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు, విపక్షం బీఆరెస్స్ కు మధ్య రాజకీయ వాతావరణం మరింత వేడెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా... తెలంగాణ ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనకు వెళ్లగా... సరిగ్గా అదే సమయంలో నల్లగొండ జిల్లాలో కేసీఆర్ సభ ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ ప్రసంగించిన మొట్టమొదటి సభ కావడంతో తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే... ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం లేస్తుంది. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి... కేసీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

అవును... తెలంగాణ ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి మేడిగడ్డ బ్యారేజిని సందర్శించిన విషయంపై స్పందించిన కేసీఆర్... "మేడిగడ్డ, బొందల గడ్డ పోతారట, మేడిగడ్డ పోయి ఏం పీకుతారు.. దమ్ముంటే నీళ్లు ఎత్తిపోయాలని.. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోతే బాగు చేయించి నీళ్లు ఇవ్వాలని అన్నారు. ఇదే సమయంలో... నాగార్జున సాగర్ కుంగలేదా.. కడెం ప్రాజెక్టు, మూసీ ప్రాజెక్టులకు ఇబ్బందులు రాలేదా అని ప్రశ్నించారు.

దీంతో ఈ విషయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా... మేడిగడ్డ బ్యారేజీలో రెండు మూడు పిల్లర్లు కూలితే తప్పా? అని కేసీఆర్‌ అంటున్నారు అని మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి... కేసీఆర్ మాటలు పూర్తి బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని.. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీరివ్వలేదని ఫైరయ్యారు. ఈ సందర్భంగా... లక్ష కోట్ల దోపిడీకి కాళేశ్వరం బలైపోయిందని అన్నారు.

అనంతరం ఈ డోసు మరింత పెంచిన రేవంత్... "కేసీఆర్‌ అవినీతికి మేడిగడ్డ కుంగింది.. అన్నారం సున్నమైంది.. కుంగింది ప్రాజెక్టు కాదు.. తెలంగాణ ప్రజల నమ్మకం" అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఇదే సమయంలో... మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పెను ప్రమాదంలో ఉన్నాయని.. వాటిలో నీళ్లు నింపితే అవి కొట్టుకుపోయే ప్రమాదంలో ఉన్నాయని సీఎం రేవంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో ఈ ప్రాజెక్టుల పేరు చెప్పి భారీ ఎత్తున అంచనాలు పెంచేశారని ఫైరయిన సీఎం... కేసీఆర్‌ ప్రభుత్వం మేడిగడ్డ అంచనా వ్యయాన్ని రూ. 1,800 కోట్ల నుంచి రూ. 4000 కోట్లకు పైగా పెంచింది. ప్రజలముందు దోషిగా నిలబడాల్సి వస్తుందనే కారణంతోనే కాంగ్రెస్‌ పై ఎదురుదాడికి నల్గొండలో సభ పెట్టారని నిప్పులు చెరిగిన రేవంత్... తప్పులన్నీ తాను చేసిన కేసీఆర్ తానో సత్యహరిశ్చంద్రుడిని అన్నట్లు ఆ సభలో మాట్లాడారని అన్నారు.

అసెంబ్లీకి రమన్నా రాలేదని.. కాలు విరిగిందని సాకు చెప్పారని.. సానుభూతి పొందేందుకే మాత్రం నల్గొండ సభకు వెళ్లారని.. కాళేశ్వరానికి ఆహ్వానించినా రాకపోగా ఆరోపణలు చేయడం దిగజారుడు రాజకీయమే అని.. పక్కనున్న అసెంబ్లీకి రాలేకపోతున్నారు కానీ, నల్గొండకు మాత్రం వెళ్లారని.. ఇప్పుడు చక్రాల కుర్చీతో సానుభూతి కార్యక్రమాలు చేస్తున్నారని రేవంత్ విరుచుకుపడ్డారు.

ఏది ఏమైనా... ఎన్నికలకు ముందు లక్ష ఎకరాలకు నీరిచ్చామని, భగీరథ ప్రయత్నం చేశామని, ఇంటింటికీ నీరిచ్చామని, తెలంగాణను సస్యశ్యామలం చేశామని చెప్పుకుని ప్రచారం చేసుకున్న కేసీఆర్... ఇప్పుడు మాత్రం మేడిగడ్డ బొందల గడ్డ అని అనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది కేసీఆర్ మార్కు నిర్లక్ష్యానికి ప్రతీక అని విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం కూడా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.