Begin typing your search above and press return to search.

సుప్రీంకోర్టుకు 15 మీడియా సంస్థల లేఖ!

ఈ నేపథ్యంలో 15 మీడియా సంస్థలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాయి. నిజాలను నిర్భయంగా వెలుగెత్తి చాటున్న జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని విన్నవించాయి.

By:  Tupaki Desk   |   5 Oct 2023 12:30 PM GMT
సుప్రీంకోర్టుకు 15 మీడియా సంస్థల లేఖ!
X

ఇటీవల కాలంలో దేశంలో పాత్రికేయులపై దాడులు, వేధింపులు ఎక్కువైపోయిన సంగతి తెలిసిందే. అలాగే మీడియా సంస్థలపైన దాడులు, ఈడీ వంటి వాటితో తనిఖీలు, వేధింపులు షరామామాలై పోయాయి. ఈ నేపథ్యంలో 15 మీడియా సంస్థలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాయి. నిజాలను నిర్భయంగా వెలుగెత్తి చాటున్న జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని విన్నవించాయి.

దేశంలోని దర్యాప్తు సంస్థలు.. సీబీఐ, ఈడీ జర్నలిస్టులను విచారించేందుకు, వారి నుంచి పత్రాలు, హార్డ్‌ డిస్క్‌లు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌ లు వంటివి స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక విధివిధానాలను రూపొందించాలని 15 మీడియా సంస్థలు కోరాయి. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశాయి.

జర్నలిస్టులపై ప్రతీకార దాడులు జరగకుండా చూడాలని మీడియా సంస్థలు సుప్రీంకోర్టుకు విన్నవించాయి. జర్నలిస్టులు నిజాలు మాట్లాడగలిగినంత కాలం దేశంలో స్వేచ్ఛ సురక్షితంగా ఉంటున్నట్టు భావించాలని పేర్కొన్నాయి. కొద్దిరోజుల క్రితం న్యూస్‌ క్లిక్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ లో పనిచేసే 46 మంది ఉద్యోగుల ఇళ్లలో ఢిల్లీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పోర్టల్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థను అరెస్టు చేసిన అంశాన్ని మీడియా సంస్థలు తమ లేఖ ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తెచ్చాయి.

దేశంలోని దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మీడియా సంస్థలు తమ లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం తమపై ఆయుధాలుగా ఉపయోగిస్తోందని విమర్శించాయి. దేశంలో చాలా మంది పాత్రికేయులు తమపై ప్రతీకార దాడులు జరుగుతాయనే భయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నాయి.

జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి కొంతమంది జర్నలిస్టులు రాసే వార్తలను ప్రభుత్వం అంగీకరించడంలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి మీడియా సంస్థలు తీసుకెళ్లాయి. జర్నలిస్టులను కట్టడి చేసేందుకు సోదాల పేరిట ప్రతీకార దాడులకు పాల్పడుతూ కేంద్ర ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించాయి. పాత్రికేయులు చట్టానికి అతీతులని తాము అనుకోవడం లేదని.. అదే సమయంలో పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే దుష్పరిణామాలు సంభవిస్తాయని తెలిపాయి.

పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే సమాజంలో ప్రజాస్వామ్య పునాదులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మీడియా సంస్థలు తమ లేఖలో పేర్కొన్నాయి. జర్నలిస్టులుగా ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం అని సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో ఆయా సంస్థలు పేర్కొన్నాయి.