Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పార్టీలో చేరిన జీహెచ్ఎంసీ మేయర్

ఈ నేపథ్యంలో మరో సంచలనం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కేకే కూతురు హస్తం గూటిలో చేరారు.

By:  Tupaki Desk   |   30 March 2024 6:48 AM GMT
కాంగ్రెస్ పార్టీలో చేరిన జీహెచ్ఎంసీ మేయర్
X

తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో సంచలనం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కేకే కూతురు హస్తం గూటిలో చేరారు. కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెర దించుతూ ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోవడం గమనార్హం.

ఆమెతో పాటు ఇంకా కొందరు కార్పొరేటర్లు కూడా పార్టీ మారారు. దీంతో జీహెచ్ఎంసీ మేయర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారవుతారు. ఇలా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటుంటే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు నేతలు పార్టీ మారేందుకు దోహదం చేస్తున్నాయని చెబుతున్నారు.

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తో బీఆర్ఎస్ నేతల్లో భయం కలుగుతోంది. అవినీతి ఆరోపణల మీద కవిత అరెస్ట్ కావడంతో ఇక బీఆర్ఎస్ పుంజుకోవడం కష్టమేనని తెలుస్తోంది. అందుకే నేతలు పార్టీ మారి కాంగ్రెస్ గూటిలో చేరాలని అనుకుంటున్నారు. కడియం కావ్య లేఖ కూడా చాలా మందిలో భయం పుట్టిస్తోంది. బహిరంగంగా పార్టీని వీడి వెళ్తుంటే ఇక బీఆర్ఎస్ లో భవితవ్యం లేదని నిరాశ చెందుతున్నారు.

ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ లో చేరుతున్నారని సమాచారం. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో విజయలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారి బలం పెరుగుతోంది.

రాబోయే రోజుల్లో ఇంకా కొందరు కూడా పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరతారని చెబుతున్నారు. ఇప్పటికే తమతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయి కాంగ్రెస్ కళకళలాడుతోంది. గతంలో బీఆర్ఎస్ చేసిన దానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రతీకారం తీర్చుకుంటోంది. అందుకే పార్టీని మొత్తం ఖాళీ చేయాలనే కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది.