Begin typing your search above and press return to search.

ఏపీ టూర్లో కార్పొరేటర్లు.. తెలంగాణలో మేయర్ సీటుకి ఎసరు!

నిధుల కేటాయింపులో తమతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా మేయర్‌ ఒంటెద్దుపోకడలకు పోతున్నారంటూ వీరంతా అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   21 Jan 2024 9:17 AM GMT
ఏపీ టూర్లో కార్పొరేటర్లు..  తెలంగాణలో మేయర్  సీటుకి ఎసరు!
X

తెలంగాణలో ప్రభుత్వం మారింది. దీంతో పలు చోట్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతున్నారు. దీంతో చాలా లెక్కలు మారిపోతున్నాయి. ఇందులో భాగంగా... పురపాలక, నగరపాలక సంస్థల్లో ఇప్పటి వరకు బీఆరెస్స్ పార్టీకి చెందిన వారు మేయర్లుగా, మున్సిపల్ ఛైర్మన్లుగా ఉండగా.. వారిపై ఇప్పుడు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. మాజీ మంత్రులు, బీఆరెస్స్ కీలక నేతల బుజ్జగింపులు సైతం ఇప్పుడు వర్కవుట్ కావడం లేదు.

అవును... ఇటీవల నల్గొండ మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని కాంగ్రెస్ చేజిక్కించుకున్నట్లుగానే మరికొన్ని చోట్ల ఆ పరంపర కొనసాగుతున్నట్లుంది! ఇందులో భాగంగా మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా జవహర్‌ నగర్‌ నగరపాలక సంస్థలో మేయర్ మేకల కావ్యపై పలువురు తాజాగా మరోసారి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి తెరలేపారు.

వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల ముందే 19 మంది కార్పొరేటర్లు మేయర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం.. మేడ్చల్ కలెక్టర్‌ కు ఈ విషయంపై తీర్మానం ఇచ్చారు. అయితే... నాడు రాజకీయ ఒత్తిళ్లు, అసెంబ్లీ ఎన్నికలు మొదలైన కారణాలతో ఆ తీర్మానానికి సంబంధించిన వ్యవహారం ముందుకు కదల్లేదు.

ఈ సమయంలో మరోసారి ఈ విషయమై కలెక్టర్‌ ను కలిశారు కార్పొరేటర్లు. ఇందులో భాగంగా వీలైనంత తొందరగా సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో... కలెక్టరేట్‌ నుంచి కార్పొరేషన్‌ కు సంబంధిత ఆదేశాలు వచ్చాయి. దీంతో... మరో 2 రోజుల్లో అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఈ క్రమంలో ఆదివారం క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. ఇందులో భాగంగా అవిశ్వాస తీర్మానం ఇచ్చిన 19 మంది కార్పొరేటర్లతో ఏపీలోని బాపట్లకు విహారయాత్రకు బయలుదేరి వెళ్లారని తెలుస్తుడీ. నిధుల కేటాయింపులో తమతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా మేయర్‌ ఒంటెద్దుపోకడలకు పోతున్నారంటూ వీరంతా అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.

మరోపక్క ఈ 19 మంది కార్పొరేటర్లను కలిసేందుకు మేయర్ కావ్య తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం లేదని తెలుస్తుంది. అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఈ కార్పొరేటర్లంతా త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కాగా... జవహర్‌ నగర్‌ నగర పాలక సంస్థలో మేయర్‌ మేకల కావ్య సహా 28 మంది సభ్యులున్నారు. వీరిలో 19మంది ఇప్పుడు ఎర్రజెండా ఎగరేశారు!