Begin typing your search above and press return to search.

తన రూటు ఏ కూటమి వైపో చెప్పేసిన మాయావతి!

ఈ నేపథ్యంలో ఏ కూటమిలోనూ చేరని బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతిపై విమర్శలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   30 Aug 2023 1:33 PM GMT
తన రూటు ఏ కూటమి వైపో చెప్పేసిన మాయావతి!
X

దేశంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ, బిజూ జనతాదళ్‌ (బీజేడీ), బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), జనతాదళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్‌), భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) మినహాయించి అన్ని ప్రధాన పార్టీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే కూటమిలో, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరిపోయిన సంగతి తెలిసిందే. రెండు కూటముల్లోనూ దాదాపు 25 చొప్పున పార్టీలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఏ కూటమిలోనూ చేరని బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతిపై విమర్శలు వస్తున్నాయి. గతంలోనూ ఆమెపై విమర్శలు వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్‌ బలంగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కు మద్దతు ఇవ్వకుండా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి బీఎస్పీ ఓట్లు చీలుస్తోందని.. దీనివల్ల దళితులు, మైనారిటీల ఓట్లు చీలిపోయి బీజేపీ లాభపడుతోందనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో పలు రాష్ట్రాల్లో మాయావతి పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్నారని తీవ్ర విమర్శలు చెలరేగాయి.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి మాయావతిని తమ కూటమిలో చేరాలని అడగలేదు. ఆమెను ఇండియా కూటమి లైట్‌ తీసుకుంది. మరోవైపు ఆమె తమతో కలవడం కంటే ఒంటరిగా పోటీ చేయడం వల్లే తమకు లాభమని లెక్కలేసుకున్న బీజేపీ కూడా ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించలేదు. దీంతో మాయావతి ఏ కూటమికి దగ్గర కాలేకపోయారు.

మరోవైపు గతేడాది జరిగిన ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్‌ సమాజ్‌ పార్టీకి కేవలం ఒకే ఒక్క సీటు లభించింది. అంతకముందు అంటే 2017లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే 18 సీట్లు తగ్గిపోయాయి.

2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ లో ఉన్న 80 లోక్‌ సభ స్థానాల్లో 9 స్థానాలను గెలుచుకున్న మాయావతి పార్టీ 2022 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానానికే పరిమితమై దారుణంగా విఫలమైంది. దీంతో అప్పటి నుంచి మాయావతి రాజకీయంగా స్తబ్ధుగా అయిపోయారు.

మళ్లీ ఇప్పుడు ఆగస్టు 31న, సెప్టెంబర్‌ 1న ఇండియా కూటమి సమావేశాలు ముంబైలో జరగనున్న నేపథ్యంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో కానీ కాంగ్రెస్‌ సహా విపక్షాల కూటమి ఇండియాతో కానీ కలిసే ప్రసక్తే లేదని మాయావతి తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌ లో వెల్లడించారు.

"ఎన్డీయే, ఇండియా.. రెండు కూటములు పేదల వ్యతిరేకం. అలాగే కులతత్వ, వర్గ విబేధాలు ఉన్నవి. కార్పొరేట్లకు వంతపాడే పార్టీలు. అలాగే కొంత మంది అనుకూల, పెట్టుబడిదారీ విధానాలతో కూడిన పార్టీలు" అని మాయావతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీరి విధానాలకు వ్యతిరేకంగా బీఎస్పీ నిరంతరం పోరాడుతోందని గుర్తు చేశారు. కాబట్టి వారితో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

2007 లాగా, బీఎస్పీ రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలో నాలుగు రాష్ట్రాలలో ఒంటరిగా పోటీ చేస్తుందని మాయావతి తేల్చిచెప్పారు. అందరూ బీఎస్పీతో పొత్తుకు ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే వారితో కలవలేదని బీజేపీతో కుమ్మక్కయిందని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. వారితో జత కడితే సెక్యులర్, కలవకపోతే బీజేపీ బీ–టీం అని అంటున్నారని ధ్వజమెత్తారు. ఇది చాలా అన్యాయమన్నారు. ద్రాక్ష దొరికితే మంచిది.. లేకపోతే ద్రాక్ష పుల్లన అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు మాయావతి వరుస ట్వీట్లు చేశారు. తద్వారా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ గఢ్, మిజోరాం ఎన్నికలతోపాటు పార్లమెంటుకు జరగబోయే ఎన్నికల్లోనూ బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని మాయావతి స్పష్టంగా తేల్చిచెప్పేశారు. తాను ఎన్డీయే కూటమిలో కానీ, ఇండియా కూటమిలో చేరేది లేదని కుండబద్దలు కొట్టారు.