మావిగాన్...జగన్ భారీ వ్యూహమేనా ?
ఏపీకి రాజధాని అనగానే 2014 ప్రాంతంలో అంతా అనుకున్న మాట విజయవాడ పరిసరాలలోనే అని. ఆ విధంగా విజయవాడ వాసులు అయితే ఎంతో సంతోషించారు.
By: Satya P | 2 April 2026 4:00 AM ISTమావిగాన్ అంటూ వైసీపీ అధినేత జగన్ కొత్త ప్రకటన చేశారు. దాంతో ఇపుడు ఏపీ రాజకీయాల్లో ఈ పదం ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మావిగాన్ అంటే ఏమిటి అంటూ అంతా చర్చిస్తున్నారు. జగన్ ఏదో యధాలాపంగా లేక ఫ్లోలోనో ఈ మాట చెప్పలేదు, ఈ ప్రతిపాదన కూడా ఆయన ఊరకే చేయలేదు, దాని వెనక వైసీపీ వ్యూహం దాగుతుంది అని అంటున్నారు. మావిగాన్ అంటే మచిలీపట్నం విజయవాడ, గుంటూరులను కలుపుతూ రాజధానిగా అభివృద్ధి చేయడం. మొత్తం ఈ మూడు ప్రాంతాలు కలుపుకుని 40 లక్షల దాకా జనాభా ఉంటారు, 110 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఈ ప్రాంతం ఉంటుంది. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని జగన్ అంటున్నారు. అంతే కాదు, ఏపీకి ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ గా ఈ ప్రాంతం నిలుస్తుంది అని జనాల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించారు.
అసంతృప్తి ఉందా :
ఏపీకి రాజధాని అనగానే 2014 ప్రాంతంలో అంతా అనుకున్న మాట విజయవాడ పరిసరాలలోనే అని. ఆ విధంగా విజయవాడ వాసులు అయితే ఎంతో సంతోషించారు. అదే సమయంలో గుంటూరు వాసులు కూడా తమకు దగ్గరలో రాజధాని ఏర్పాటు కాబోతోంది అని భావించారు. కానీ జరిగింది వేరు. అమరావతి పేరుతో ఏకంగా కొత్త రాజధాని సృష్టికి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అక్కడే భూ సేకరణ చేపట్టారు. ఇక నిర్మాణాలు అన్నీ అక్కడే జరుగుతున్నాయి. అభివృద్ధి అంతా అక్కడే ఫ్యూచర్ లో కేంద్రీకృతం అయ్యే చాన్స్ ఉంది. ఒక విధంగా చూస్తే విజయవాడ గుంటూరు ప్రజానీకంలో ఈ విషయంలో అసంతృప్తి ఉందని అంటున్నారు. దాంతో సరిగ్గా ఇదే అంశం మీద వైసీపీ మావిగాన్ అంటూ కొత్త ప్రతిపాదన చేసింది అని అంటున్నారు.
కోరుకునేది అదే :
ఎవరైనా తమ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. రాజధాని తమ వద్దకు వస్తే అంతకంటే ఏమి కావాలని ఆలోచిస్తారు దాంతోనే ఈ ప్రాంతం జనాల నాడిని పట్టి మరీ వైసీపీ ఈ రకమైన ప్రపోజల్ పెట్టిందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అయితే అమరావతి రాజధాని పరిధిని సీఆర్డీయే ప్రాంతం నిర్దేశించిన మేరకే అంటూ కేంద్రానికి పంపించిన తీర్మానంలో పేర్కొంది అని అంటున్నారు అంటే సీఆర్డీయే పరిధి అంతా అమరావతికి భూములు సేకరించిన పరిసర ప్రాంతాలకే పరిమితం అయి ఉంది. దాంతో రాజధానికి ఈవల ఉన్న నగరాలుగానే గుంటూరు విజయవాడ ఉంటున్నాయి. ఇది జనాలలో అయితే చర్చగా ఉంది. సరిగ్గా ఇక్కడే వైసీపీ చురుకుగా పావులు కదుపుతోంది అని అంటున్నారు.
దశాబ్దాల తరువాత :
అయితే కూటమి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అమరావతి రాజధాని కనుక బ్రహ్మాండంగా అభివృద్ధి చెందితే భవిష్యత్తులో గుంటూరు విజయవాడ మొత్తం కలుస్తుందని దాంతో అద్భుతమైన రాజధానిగా అమరావతి మారుతుందని. అయితే దానికి దశాబ్దాల కాలం పట్టవచ్చు అన్న మాట కూడా ఉంది. ఎందుకంటే విస్తరణ అనేది అనుకున్నత వేగంగా జరగదు, ముందు అమరావతి రాజధానిగా బలపడాలి. అక్కడ పూర్తిగా నిర్మాణాలు జరిగి జనాభా అంతా తరలిరావాలి. ఆ మీదట అక్కద ఫ్లోటింగ్ పాపులేషన్ పెరిగి అది ఇంకా విస్తరించి గుంటూరు విజయవాడ దాకా కలవాలి. ప్రాక్టికల్ గా చూస్తే ఇది టైం టేకింగ్ ప్రాసెస్ గానే ఉంటుంది అని అంటున్నారు.
ఎంత వరకూ వర్కౌట్ అవుతుంది :
అందుకే జగన్ మావిగాన్ అని కొత్త ప్రతిపాదన చేశారా అన్న చర్చ వస్తోంది. ఈ ప్రతిపాదన ఎటూ కూటమి అంగీకరించదు, పైగా అమరావతికి చట్టబద్ధత సాధించిన మీదట కొత్త ఆలోచనలు ఏమి ఉంటాయి. కానీ వైసీపీ ఈ ప్రాంతాల ప్రజల ఆశలను గమనించిన పార్టీగా వ్యవహరించడం ద్వారా వారి మద్దతు చూరగొనే ప్రయత్నం చేసేందుకే మావిగాన్ అని ఒక ప్రతిపాదనను తెర ముందుకు తెచ్చింది అని అంటున్నారు. మరి జగన్ వ్యూహం ఎంత వరకూ వర్కౌట్ అవుతుంది అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.
