Begin typing your search above and press return to search.

జగన్ స్క్రిప్ట్ రైటర్‌ను తిట్టి ఏం ప్రయోజనం?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారంటే చాలు.. ఆ రోజు మీమ్ క్రియేటర్లకు పండగే అనుకునే పరిస్థితి వచ్చేసింది ఈ మధ్య.

By:  Garuda Media   |   4 April 2026 11:40 PM IST
జగన్ స్క్రిప్ట్ రైటర్‌ను తిట్టి ఏం ప్రయోజనం?
X

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారంటే చాలు.. ఆ రోజు మీమ్ క్రియేటర్లకు పండగే అనుకునే పరిస్థితి వచ్చేసింది ఈ మధ్య. ఐతే ఇప్పటిదాకా ఆయన వదిలిన ఆణిముత్యాలన్నీ ఒకెత్తయితే.. మూడు రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ‘మావిగన్’ను ప్రతిపాదిస్తూ ఇచ్చిన సలహా మరో ఎత్తు. జగన్ ఈ మాట చెబుతున్నపుడు ఆయనకే చాలా కామెడీగా అనిపించినట్లుగా ఒక వెటకారపు నవ్వు నవ్వారు. ఇక ‘మావిగన్’ విషయంలో జనాల వెటకారం అయితే మామూలుగా లేదు. జగన్ నోటి నుంచి ‘మావిగన్’ అనే మాట వచ్చిన కొన్ని గంటల్లో సోషల్ మీడియా మీమ్స్‌తో మోతెక్కిపోయింది.

నెటిజన్లు ‘మావిగన్’ను అనుకరిస్తూ చేసిన ప్రతిపాదనల గురించి ఇక్కడ రాయలేని పరిస్థితి. ఆ స్థాయిలో ఏపీలోని వివిధ ప్రాంతాల పేర్లలోంచి అక్షరాలను తీసుకుని రకరకాల పదబంధాలు తయారు చేసి జగన్‌ను ఒక ఆట ఆడుకున్నారు. ఈ ట్రోలింగ్ గురించి వైసీపీ వాళ్లకు తెలియకుండా ఏమీ లేదు. అయినా అంబటి రాంబాబు లాంటి నేతలు జగన్‌‌కు మద్దతుగా ప్రెస్ మీట్లు పెట్టి ‘మావిగన్’కు ఎలివేషన్ ఇవ్వడానికి ప్రయత్నించారు. సాక్షి పత్రిక అయితే.. రాష్ట్రవ్యాప్తంగా మావిగన్ గురించి విపరీతమైన చర్చ జరుగుతోందని.. అందరూ జగన్‌కే మద్దతుగా నిలుస్తున్నారంటూ పేజీలకు పేజీలు కథనాలు వడ్డిస్తోంది.

ఐతే ఎప్పుడూ వైసీపీకి మద్దతుగా మాట్లాడే కొందరు రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టులు సైతం ‘మావిగన్’ విషయంలో వాస్తవం బోధపడి.. జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతుండడం గమనార్హం. జర్నలిస్ట్ సాయి అయితే సాక్షి పత్రిక తీరును తీవ్రంగా తప్పుబడుతూ.. మావిగన్ విషయంలో ఇంత ట్రోలింగ్ జరుగుతుంటే ఈ కథనాలేంటి అంటూ ఎండగట్టారు. రాజధాని విషయంలో జగన్ స్టాండ్ మార్చుకున్న తీరును గుర్తు చేస్తూ.. మావిగన్ గురించి అధికారంలో ఉండగా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇక జగన్‌కు ఎన్నోసార్లు వీర లెవెల్లో ఎలివేషన్లు ఇచ్చిన రాజకీయ విశ్లేషకుడు ప్రసాద్, మరో వైసీపీ ప్రో అనలిస్టుతో కలిసి.. జగన్ తీరును, మావిగన్ ప్రతిపాదనను తీవ్రంగా ఎండగట్టారు.

గతంలో జగన్ ప్రెస్ మీట్ పెట్టట్లేదని ఫీలయ్యేవాళ్లమని.. కానీ ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెడితే భయపడుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ప్రెస్ మీట్‌లు ట్రోల్ మెటీరియల్‌గా మారుతున్న విషయం వాస్తవమన్న ప్రసాద్.. మావిగన్ మీద వచ్చిన ట్రోల్స్ అరాచకమన్నారు. జగన్‌కు స్క్రిప్టు రాసిస్తున్న వాళ్లదే తప్పు అంటూ.. ఆ రైటర్‌ను దరిద్రుడు అంటూ తిట్టిపోశారు ప్రసాద్. ఎవరో కడుపు మంటతోనే జగన్‌కు ఇలాంటి స్క్రిప్టులు రాసిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఐతే ప్రసాద్ లాగే చాలామంది జగన్‌కు స్క్రిప్టులు రాస్తున్న వాళ్లను తిట్టిపోస్తున్నారు కానీ.. ఎవరు ఏం రాసిచ్చినా గుడ్డిగా చదివేసేంత పిచ్చివాడా జగన్ అనేది ప్రశ్న. ఆయన అభిరుచికి తగ్గట్లే ఎవరైనా స్క్రిప్టు రాస్తారు తప్ప.. రాజధాని లాంటి పెద్ద విషయాల్లో రైటర్ల సొంత ఆలోచనలు ఏమంటాయని కాస్త ఆలోచించాలి. ఒకవేళ వాళ్లు సరిగా రాయకపోయినా.. తప్పుడు సలహాలు ఇచ్చినా.. జగన్ విజ్ఞత చూపించాలి కదా? సరిదిద్దుకునే అవకాశం ఆయన చేతిలోనే ఉంది కదా? అలా చేయట్లేదంటే జగన్ ఉద్దేశం ఏమన్నట్లు?