Begin typing your search above and press return to search.

మేటర్ సీరియస్... కేసీఆర్‌ చెప్పిన ఇంజినీరింగ్‌ అద్భుతం ఇదేనా?

రూ.1.30 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులో చుక్కనీరు నిల్వచేసే పరిస్థితి లేకపోవడం దారుణమని కిషన్ రెడ్డి ఫైరయ్యారు.

By:  Tupaki Desk   |   4 Nov 2023 3:59 AM GMT
మేటర్  సీరియస్... కేసీఆర్‌  చెప్పిన ఇంజినీరింగ్‌  అద్భుతం ఇదేనా?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో అధికార బీఆరెస్స్ కు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగాయని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చిన నేపథ్యంలో మేటర్ సీరియస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

అవును... కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై తాజగా ఎన్డీఎస్‌ఏ విడుదల చేసిన నివేధిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తుందని అంటున్నారు. దీంతో కేంద్రంలోని పెద్దలు, స్థానిక నేతలు... మొత్తంగా బీజేపీ నాయకులు ఈ విషయంపై అధికార బీఆరెస్స్ ను టార్గెట్ చేశారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నుంచి మొదలు బీజేపీ నేతలంగా కేసీఆర్ పై ఫైరవుతున్నారు.

ఇందులో భాగంగా... తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతి బట్టబయలైందని కేంద్ర జల్‌ శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడానికి సంబంధించి డ్యాం సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదిక అంశాన్ని ట్వీట్ చేస్తూ... బీఆరెస్స్ ప్రభుత్వ దురాశ, అవినీతి.. లక్షలాది ప్రజల జీవితాలను పణంగా పెట్టడంతో పాటు కోట్ల ప్రజాధనం కోల్పోయేలా చేసిందని విమర్శించారు.

ఇదే సమయంలో... కాళేశ్వరం ప్రాజెక్టుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరింది తప్ప.. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి ఆరోపించారు. రూ.1.30 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులో చుక్కనీరు నిల్వచేసే పరిస్థితి లేకపోవడం దారుణమని కిషన్ రెడ్డి ఫైరయ్యారు.

ఫలితంగా... కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. పిల్లర్లు కుంగిపోయినప్పటికీ... సీఎం నుంచి ఎలాంటి స్పందనా లేదని.. ప్రాజెక్టు వ్యయం, కాంట్రాక్టు విధానాలపై ఎలాంటి విషయాలను వెల్లడించకుండా అవినీతికి పాల్పడటమే దీనికి కారణం అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేసీఆర్‌ ను అపర భగీరథుడు, నదులకే నడక నేర్పిన నాయకుడంటూ కీర్తించిన బీఆరెస్స్ నేతలు.. ఎన్డీఎస్‌ఏ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఏమని స్పందిస్తారాని ప్రశ్నించారు డాక్టర్‌ లక్ష్మణ్‌. ఈ సందర్భంగా... ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో రూ.లక్ష కోట్ల తెలంగాణ ప్రజల సంపదను ఆవిరి చేశారని.. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఇదే క్రమంలో ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ కూడా స్పందించారు. ఇందులో భాగంగా... కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన వ్యయం మొత్తాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం నుంచి వసూలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంజినీరింగ్‌ అద్భుతం అని కేసీఆర్‌ చెప్పిన కాళేశ్వరం ఇదేనా అని సంజయ్ ప్రశ్నించారు. దీంతో ఎన్నికల వేళ విపక్షాలకు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారం బీఆరెస్స్ కు పెద్ద తలనొప్పులు తెచ్చిపెట్టేలానే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.