Begin typing your search above and press return to search.

11 మందిలో ఒకరు ఔట్..! ఎమ్మెల్యే మత్స్యలింగం ఏం చెప్పారంటే..?

ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడి టీడీపీ, బీజేపీలో చేరడంతో మున్ముందు మరిన్ని వలసలు ఉంటాయన్న చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   20 Sept 2025 3:54 PM IST
11 మందిలో ఒకరు ఔట్..! ఎమ్మెల్యే మత్స్యలింగం ఏం చెప్పారంటే..?
X

ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడి టీడీపీ, బీజేపీలో చేరడంతో మున్ముందు మరిన్ని వలసలు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. సిట్టింగు ఎమ్మెల్సీలతోపాటు ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి కూటమి పార్టీల తీర్థం తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో వాడివేడి చర్చకు దారితీస్తోంది. స్థానిక ఎన్నికలు దగ్గరతుండటంతో ప్రతిపక్షం వైసీపీని పూర్తిగా దెబ్బతీయాలనే లక్ష్యంతో అధికార పార్టీ చేరికలను ప్రోత్సహిస్తోందని చెబుతున్నారు.

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు సిట్టింగు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి వి.విజయసాయిరెడ్డి, క్రిష్ణయ్య, బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీకి దూరమయ్యారు. విజయసాయిరెడ్డి ఏకంగా రాజకీయాల నుంచే విరమించుకోగా, మస్తాన్ రావు, మోపిదేవి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. క్రిష్ణయ్య బీజేపీలో చేరారు. అదేవిధంగా వైసీపీకి దాదాపు 35 మంది ఎమ్మెల్సీలు ఉండగా, వీరిలో ఆరుగురు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేసి వైసీపీకి గుడ్ బై చెప్పారు. వీరిలో ముగ్గురు ఇప్పటికే టీడీపీలో చేరగా, ఎమ్మెల్సీ పోతుల సునీత బీజేపీలో చేరారు. జయమంగళం వెంకటరమణ, డిప్యూటీ చైర్మన్ ఖానం జనసేన, బీజేపీతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదే సమయంలో వైసీపీని వీడేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీలు టీడీపీలో చేరిన నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. అల్లూరి జిల్లాకు చెందిన అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం వైసీపీని వీడనున్నారంటూ రెండు రోజలుగా విస్త్రుత ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారి సభకు వెళ్లే అవకాశం ఇవ్వకుండా అధినేత అడ్డుకోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. దీంతో వైసీపీలో అంతర్గతంగా పెద్ద చర్చే జరిగింది. పార్టీ అధిష్టానం కూడా ఎమ్మెల్యేతో చర్చించిందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

అయితే తాను వైసీపీని వీడతానని జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే మత్స్యలింగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కట్టె కాలే వరకు అధినేత జగన్ తోనే ఉంటానని తేల్చిచెప్పారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, పార్టీ మార్పు కథనాలను ఖండించారు. పరిస్థితి అనుకూలించకపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతాను కానీ, పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. తనతోపాటు కుటుంబ సభ్యులు అంతా వైసీపీలోనే కొనసాగుతారని వెల్లడించారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి జగన్ కారణమని చెప్పుకొచ్చారు. రాజకీయంగా సముచిత స్థానం కట్టబెట్టిన జగన్ కు ద్రోహం చేయనని ఎమ్మెల్యే మత్స్యలింగం క్లారిటీ ఇచ్చారు.