నింగి వంగిందా.. నేల ఈనిందా.. అమరావతిలో ఏర్పాట్లు!
అమరావతిలో జరుగుతున్న ఏర్పాట్లను చూస్తే.. ఒకప్పుడు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు వారి అన్నగారు.. ఎన్టీఆర్ చెప్పిన డైలాగు.. గుర్తుకు వస్తోందని టీడీపీ నాయకులు అంటున్నారు.
By: Tupaki Desk | 18 April 2025 6:00 PM ISTఅమరావతిలో జరుగుతున్న ఏర్పాట్లను చూస్తే.. ఒకప్పుడు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు వారి అన్నగారు.. ఎన్టీఆర్ చెప్పిన డైలాగు.. గుర్తుకు వస్తోందని టీడీపీ నాయకులు అంటున్నారు. అప్పట్లో పార్టీ పెట్టినప్పుడు.. చైతన్య రథంపై అన్నగారు అనేక ప్రసంగాలు చేసేవారు. తెలుగు జాతిని జాగృతం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తన సభలకు వచ్చిన జనాలను చూసి.. ``నింగివంగిందా.. నేల ఈనిందా!`` అంటూ.. ప్రసంగం ప్రారంభించేవారు.
అంటే.. అన్నగారి సభలకు వచ్చిన జనాలు ఆ రేంజ్‌లో వచ్చేవారు. అలానే ఇప్పుడు కూడా.. అదే తరహా లో అమరావతిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణాన్నే 100 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అంటే.. ఇక్కడ అతిథులు, ముఖ్య నాయకులు, మంత్రులు... సహా ప్రజలు కూర్చుంటారు. ఇక, పార్కింగ్ ఏరియాను మరింత విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు. దీనికిగాను 150 ఎకరాలను కేటాయించారు.
ఇక, ఎటు చూసినా.. పనులు జరుగుతున్నాయి. 30కు పైగాబుల్డోజర్లు.. నిరంతరాయంగా.. 100 ఎకరాలను చదును చేస్తున్నాయి. మరోవైపు తాత్కాలిక మరుగు దొడ్ల నిర్మాణం.. సభా ప్రాంగణ నిర్మాణం.. వేదిక ఏర్పాట్లు.. ఇలా.. ఒకటా రెండా.. నిరంతరం పనులు జరుగుతూనే ఉన్నాయి. అదేసమయంలో సామగ్రితో నిండిన లారీలు తరలి వెళ్తూనే ఉన్నాయి. మే 2వ తేదీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి రానున్నారు.
ఈ క్రమంలో రాజధాని పనులకు ఆయన పునః ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగం గా సభను కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సుమారు 5 నుంచి 7 లక్షల మంది జనాలను తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పనులను ఈ నెల 28నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. అనంతరం 30న సీఎం చంద్రబాబు పరిశీలించి మార్పులు చేర్పులు సూచించనున్నారు. శుక్రవారం సభ జరగనుంది. ఇక, 5 వేల మంది పోలీసులను మోహరించి. భద్రతకు ఏర్పాట్లు చేస్తారు.
