Begin typing your search above and press return to search.

మైనేలోని మానవ మృగం... 18 మందిని చంపి సూసైడ్ చేసుకున్నాడు?

యుఎస్ రాష్ట్రంలోని మైనేలో సామూహిక కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దారుణాల్లో ఏకంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

By:  Tupaki Desk   |   28 Oct 2023 6:04 AM GMT
మైనేలోని మానవ మృగం... 18 మందిని చంపి సూసైడ్  చేసుకున్నాడు?
X

యుఎస్ రాష్ట్రంలోని మైనేలో సామూహిక కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దారుణాల్లో ఏకంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం 13 మందికి పైగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం చీకటి చాటున తప్పించుకుని పారిపోయిన హంతకుని కోసం రెండురోజులుగా భారీ వేట సాగుతోంది. హంతకుడిని 40 ఏళ్ల రాబర్ట్‌ కార్డ్‌ గా పోలీసులు గుర్తించారు. అయితే... తాజాగా అతడి డెడ్ బాడీ కనిపించిందని తెలుస్తుంది.

అవును... మైనేలో మారణహోమం జరిపిన అనుమానితుడి కోసం పోలీసులు గత రెండు రోజులుగా తీవ్రంగా గాలిస్తున్న సంగతి తెలిసిందే. మైనేలో ఇతడు సృష్టించిన మారణహోమంతో అగ్రరాజ్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సమయంలో ఆ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత అతడు విగతజీవిగా దొరికాడని సమాచారం. అతడు తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్లుగా యుఎస్ మీడియాలో కథనాలొస్తున్నాయి.

ఈ మారణహోమానికి సంబంధించిన అనుమానితుడిగా రాబర్ట్ కార్డ్ (40) అనే వ్యక్తిని పోలీసులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... లెవిస్టన్ నుండి ఏడు మైళ్లు (11 కి.మీ) దూరంలో అతడి మృతదేహం దొరికిందని చెబుతున్నారు. రీసైక్లింగ్ సెంటర్‌ కు సమీపంలోని చెట్లతో కూడిన ప్రాంతంలో శుక్రవారం రాత్రి 7:45 సమయంలో అతడి మృతదేహం కనుగొనబడిందని మైనే పబ్లిక్ సేఫ్టీ కమీషనర్ మైక్ సౌషుక్ తెలిపారు.

ఈ విషయాలపై గవర్నర్ జానెట్ మిల్స్ స్పందించారు. "రాబర్ట్ కార్డ్ ఇకపై ఎవరికీ ప్రమాదకరం కాదని తెలిసి నేను ఈ రాత్రి ఊపిరి పీల్చుకుంటున్నాను" అని గవర్నర్ అన్నారు. మరోపక్క 70 ఏళ్ల వయస్సులో ఉన్న భార్యాభర్తల నుండి అతని తండ్రితో పాటు హత్యకు గురైన 14 ఏళ్ల బాలుడి వరకు బాధితులను అధికారులు శుక్రవారం గుర్తించారు.

ఈ విషయం తెలిసి అనుమానితుడిని గుర్తించినప్పటినుంచీ రాబర్ట్‌ ది హింసాత్మక ప్రవృత్తి అని పోలీసులు అనుమానిస్తున్న సంగతి తెలిసిందే. అతని మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని.. రెండు వారాల క్రితమే ఓ మానసిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స కూడా తీసుకున్నాడని అధికారులు తెలిపరు.

దీంతో... 2017లో లాస్ వెగాస్‌ లో రద్దీగా ఉండే సంగీత ఉత్సవంపై ముష్కరుడు కాల్పులు జరిపి 60 మందిని చంపిన తర్వాత ఈ తాజా కాల్పులు యునైటెడ్ స్టేట్స్‌ లో అత్యంత ఘోరమైన కాల్పుల్లో ఒకటిగా చరిత్రకెక్కాయని అంటున్నారు.

కాగా... అమెరికాలో తాజా కాల్పులతో ఈ ఏడాదే ఏకంగా 36వ సామూహిక కాల్పుల ఘటన జరిగిందని తెలుస్తుంది. ఇక మైనే రాష్ట్రంలో కాల్పుల్లో ఇంతమంది బలవడం ఇదే తొలిసారి అని అంటున్నారు. ఈ రాష్ట్రం వేటకు, షూటింగ్‌ క్రీడలకు ప్రసిద్ధి కావడంతో... ఇక్కడ తుపాకీ కోసం లైసెన్సు కూడా అక్కర్లేదని సమాచారం!