చోరీకి వచ్చి ఏసీ గదిలో అలా పడుకుండిపోయాడు
పేరుకు దొంగే కానీ కొందరు దొంగులు మిగిలిన వారి తీరుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు.
By: Garuda Media | 21 April 2026 12:11 PM ISTపేరుకు దొంగే కానీ కొందరు దొంగులు మిగిలిన వారి తీరుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. అలాంటోళ్లను మంచిదొంగ.. చిలిపిదొంగ.. ఫన్నీ దొంగ.. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇప్పుడు చెప్పే ఈ దొంగకు పేరును మీరే డిసైడ్ చేయాలి. ఎందుకంటే.. సదరు దొంగ రోటీన్ కు భిన్నంగా వ్యవహరించి అడ్డంగా బుక్ అయ్యాడు. వచ్చింది దొంగతనానికి అయినప్పటికీ.. తాను చోరీ చేయటానికి వచ్చిన ఇంట్లోని ఒక గదిలోని ఏసీ చల్లదనానికి వచ్చిన పని పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఆ గదిని వదల్లేక.. దొరికిపోయిన విచిత్ర ఉదంతం ఒకటి గుజరాత్ లో చోటు చేసుకుంది.
గుజరాత్ లోని జనాతానా ప్రాంతంలో పుష్పాంజలి అనే అపార్టమెంట్ ఉంది. ఆ అపార్టుమెంట్ ఆఫీసులోకి ఒక ముసుగు దొంగ ప్రవేశించాడు. రాత్రి వేళ సుమారు పది గంటల ప్రాంతంలో ముసుగు వేసుకొని.. చోరీకి వచ్చిన ఈ దొంగ.. రూ.60 వేల క్యాష్.. పది గ్రాముల వెండిని దొంగలించాడు. మామూలుగా అయితే.. తాను వచ్చిన చోరీ పనిని పూర్తి చేసుకొని తిరిగి వెళ్లిపోవాలి.
అసలు వేసవి కాలం. అందునా.. రాత్రిళ్లు సైతం మంటలు పుట్టేలా ఉక్కుపోతతో పాటు.. వాతావరణం వేడిగా ఉన్న వేళ.. తాను చోరీ చేయటానికి వచ్చిన గదిలోని ఏసీ చల్లదనానికి పులకించిపోయి.. తన దొంగతనం పూర్తైన తర్వాత అలానే ఆ గదిలో నిద్రపోయాడు. ఉదయం 5 గంటల వరకు నిద్రపోయిన అతన్ని గమనించి అదుపులోకి తీసుకున్నారు. ఏసీ గది చల్లదనంతో దొరికిపోయిన దొంగ ఉదంతం స్థానికంగా హాట్ టాపిక్ అయ్యింది.
