మా నమ్మకం నిలబెట్టారు.. ‘సింధూర్’పై అమరుల కుటుంబాల ఆవేదన
ఈ దాడులను తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం, బాధ్యులైన ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో మెరుపు దాడులు చేసింది.
By: Tupaki Desk | 7 May 2025 6:23 PM ISTపహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి యావత్ భారతావనిని విషాదంలోకి నెట్టింది. కశ్మీర్ అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన 26 మంది అమాయక పౌరులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అత్యంత దారుణంగా పొట్టన పెట్టుకున్నారు. మతం పేరుతో వారిని కాల్చి చంపిన ఈ ఘటన దేశ ప్రజల గుండెల్లో తీవ్రమైన గాయాన్ని మిగిల్చింది. ఈ దాడులను తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం, బాధ్యులైన ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో మెరుపు దాడులు చేసింది. భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ విజయవంతంగా లక్ష్యాలను చేరుకుంది.
ఈ దాడులపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి , కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగ ప్రకటనలు చేస్తున్నారు. ఆ దుర్ఘటనలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన శుభం ద్వివేది కూడా ప్రాణాలు కోల్పోయారు. ‘ఆపరేషన్ సింధూర్’ గురించి తెలియగానే.. శుభం భార్య ఐశన్య ద్వివేది తన ఆవేదనను, కృతజ్ఞతను కన్నీటితో వ్యక్తం చేశారు. ఐశన్యతో పాటు, శుభం తండ్రి సంజయ్ ద్వివేది కూడా భారత సైన్యం చర్యపై తమ మనోభావాలను తెలియజేశారు.
‘ఆపరేషన్ సింధూర్’ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిగిన ఒక సాధారణ ప్రతీకారం కాదని ఐశన్య ద్వివేది అన్నారు. ఈ దాడులు తన భర్తకు అర్పించిన నిజమైన నివాళి అని ఆమె భావోద్వేగంతో తెలిపారు. ప్రధాన మంత్రి మోదీ తమ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని ఆమె కొనియాడారు. ‘ఆపరేషన్ సింధూర్’ తన భర్త చేసిన త్యాగానికి నిజమైన గౌరవంగా అభివర్ణించిన ఐశన్య, ఇప్పుడు తన భర్త ఆత్మ శాంతిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన భర్త మరణానికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని చెబుతూ, అందుకు అనుమతించిన మోదీకి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
శుభం తండ్రి సంజయ్ మాట్లాడుతూ, భారత సైన్యం చేపట్టిన ఈ చర్య దేశ ప్రభుత్వంపై తమకున్న నమ్మకాన్ని మరింత పెంచిందని అన్నారు. ‘ఆపరేషన్ సింధూర్’ నిర్వహించిన భారత సైన్యానికి ఆయన సెల్యూట్ చేశారు. ప్రధాన మంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్తాన్‌లో విజృంభిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం ఏ విధంగా నాశనం చేసిందో చూసి తామంతా సైన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.
