డైనోసార్ అస్థిపంజరం రూ.223 కోట్లు.. 24 కేజీల రాయి రూ.37 కోట్లు
అవును.. భూమి మీద లభించిన అత్యంత విలువైన రాయిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే కేవలం 24.5 కేజీల రాయి విలువ.. తాజాగా నిర్వహించిన వేలంలో రూ.37 కోట్ల ధర పలికింది.
By: Tupaki Desk | 18 July 2025 4:00 PM ISTఅవును.. భూమి మీద లభించిన అత్యంత విలువైన రాయిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే కేవలం 24.5 కేజీల రాయి విలువ.. తాజాగా నిర్వహించిన వేలంలో రూ.37 కోట్ల ధర పలికింది. పన్నులతో కలిపితే దీని విలువ రూ.45.61 కోట్లుగా తేల్చారు. ఎందుకింత ధర? ఈ రాయి అంత అరుదైనదా? దీని ప్రత్యేకత ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. ఈ రాయి మిగిలిన వాటికి ఎంత భిన్నమన్న విషయం అర్థమవుతుంది.
అంగారక గ్రహం నుంచి పడిన రాయి కావటమే దీని విలువ అంతగా పెరగటానికి కారణమని చెప్పాలి. ఇప్పటివరకు 400 అంగారక శిలలే భూమి మీద దొరికాయి. పలు సందర్భాల్లో ఇలా పడే రాళ్లు సముద్రంలో పడతాయి. అందుకు భిన్నంగా ఈ రాయి సహారా ఎడారిలో పడటంతో దీన్ని గుర్తించగలిగారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇప్పటివరకు అంగారక గ్రహం నుంచి దూసుకొచ్చి పడిన ఈ రాయి మిగిలిన వాటి కంటే పెద్దది కావటం కూడా భారీ ధర పలికేందుకు కారణమైంది.
38.1 సెంటీమీటరల పొడవు.. 24.5 కేజీల బరువున్న ఈ అరుదైన శిలకు ఎన్ డబ్ల్యూఏ 16788గా పేరు పెట్టారు. 2023 నవంబరులో ఆఫ్రికా ఖండంలోని నైగర్ దేశంలో దీన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తోకచుక్క / గ్రహశకలం భూవాతావరణం గుండా ప్రయాణించేటప్పుడు భూమి గురుత్వాకర్షణకు లోనవుతాయి. ఈ సందర్భంగా తోకచుక్క కొనలోని చిన్నపాటి శిలలు/ గ్రహశకలంలోని చిన్న రాతి ముక్కే ఈ అరుదైన శిలగా చెప్పాలి. ఇంత డబ్బులు పోసి వేలంలో సొంతం చేసుకున్న వారెవరన్న విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ తరహాలో అత్యంత అరుదైన చారిత్రక వస్తువుల్ని వేలం వేశారు. ఇదే వేలంలో భారీ ధరకు మరో వస్తువును అమ్మారు. అది సెరటాసారస్ డైనోసార్ ఆస్థిపంజరం. కోట్ల ఏళ్ల నాటి ఈ డైనోసారస్ అస్థిపంజరానికి రూ.223 కోట్లు పలకటం గమనార్హం. ఈ అరుదైన వస్తువులకు వేలాన్ని అమెరికాలో నిర్వహించారు.
