Begin typing your search above and press return to search.

రైతును పెళ్లాడితే 5 లక్షలివ్వాలి.. వినూత్న విన్నపం

దీంతోనే రైతును పెళ్లాడితే రూ.లక్షల ప్రోత్సాహం ఇవ్వాలంటూ ఏకంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకే వినతిపత్రం ఇచ్చారు అక్కడి రైతు సంఘాల ప్రతినిధులు.

By:  Tupaki Desk   |   12 Feb 2024 2:30 PM GMT
రైతును పెళ్లాడితే 5 లక్షలివ్వాలి.. వినూత్న విన్నపం
X

భారత్ పూర్తిగా వ్యవసాయ ఆధారిత దేశం.. దాదాపు 70 శాతం జనాభా వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. కానీ, ప్రభుత్వాల విధానాలో.. మార్కెట్లో మాయాజాలమో.. వాతావరణ అనుకూలతలో.. వ్యాపారుల దోపిడీనో.. రైతుల అమాయకత్వమో.. ఏదైతేనేం..? అన్నదాతల కష్టాలు ఏటా పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. అందుకే వ్యవసాయాన్ని నమ్ముకున్న యువతకు వివాహాలు కావడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

రైతుకు కాదు ఉద్యోగికి..

స్వయంగా రైతు అయినప్పటికీ అతడు తన కుమార్తెను రైతుకు ఇచ్చి వివాహం చేసేందుకు మొగ్గుచూపడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయం అంటే ఆరుగాలం శ్రమ అనే భావనే దీనికి కారణం. నాలుగు నెలలు కష్టపడి పంటను అయినకాడికి అమ్ముకునే వ్యవసాయదారుడి కంటే.. నెలనెల జీతం వచ్చే ఏదైనా ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేయాలని భావిస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగి అయితే.. కాస్త అప్పు చేసి అయినా కూతురిని ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు.

మనదగ్గరే కాదు.. అంతటా

సాగునీటి వనరులు మధ్య స్థాయిలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతటా ఇదే పరిస్థితి ఉందని చెప్పక తప్పదు. దీనికి ఉదాహరణగా కర్ణాటకలో తాజాగా జరిగిన ఉదంతాన్ని వివరించాలి. కర్ణాటక అంటే.. వ్యవసాయానికి మంచి పేరు. క్రిష్ణా జలాలు అక్కడి ఆల్మట్టి ప్రాజెక్టు నుంచే తెలుగు రాష్ట్రాలకు వస్తాయి. వారికి తుంగభద్ర కూడా ఉంది. పంటలు బాగా పండుతాయి అని చెబుతారు. వీటితోపాటు ఐటీ ఇండస్ట్రీకి కర్ణాటక రాజధాని బెంగళూరు చాలా ప్రసిద్ధి. కానీ, ఆ రాష్ట్రంలోనూ యువ రైతులకు వివాహాలు కావడం లేదట. దీంతోనే రైతును పెళ్లాడితే రూ.లక్షల ప్రోత్సాహం ఇవ్వాలంటూ ఏకంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకే వినతిపత్రం ఇచ్చారు అక్కడి రైతు సంఘాల ప్రతినిధులు.

45 ఏళ్లు వస్తున్నా వివాహం కావడం లేదు

కర్ణాటకలో వ్యవసాయం చేస్తున్నవారికి 45 ఏళ్లు వస్తున్నా పిల్లను ఇచ్చుందకు ఎవరూ రావడం లేదట. ఈ విషయాన్ని రైతు ప్రతినిధులు సీఎంకు వినతిపత్రంలో వివరించారు. కొంతకాలంగా కరువు నెలకొనడంతో పరిస్థితి మరింత ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రుణ మాఫీతో పాటు రైతులను పెళ్లాడే వారికి రూ.5 లక్షలు ప్రోత్సాహం ఇవ్వాలని విన్నవించారు. మరి దీనిపై సీఎం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో చూడాలి.