Begin typing your search above and press return to search.

అవును.. ఆ రాష్ట్రంలో రోడ్డుకు పెళ్లి చేశారు

దీంతో.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా తమకు అవసరమైన నిధుల్ని సమీకరించాలని భావించిన గ్రామస్థులు.. రోడ్డుకు పెళ్లి కార్యక్రమాన్ని నిర్వమించారు.

By:  Tupaki Desk   |   27 Feb 2024 4:32 AM GMT
అవును.. ఆ రాష్ట్రంలో రోడ్డుకు పెళ్లి చేశారు
X

అవును.. కేరళ రాష్ట్రంలో రోడ్డుకు పెళ్లి చేశారు. పని చేయాల్సిన ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించినప్పుడు.. ఎవరో ఒకరు ప్రజల్ని ఒక జట్టుగా చేసి తాము ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడే వీలుంది. ఇంతకూకేరళలో జరిగిందేమంటే.. కోజికోడ్ లోని కొడియాత్తూరు గ్రామానికి చెందిన ప్రజలు తీవ్రమైన రోడ్డుసమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి స్థానిక నేతలు కానీ.. ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోని దుస్థితి. కొడియాత్తూరులో 1200 మీటరల పొడవు.. మూడున్నర మీటర్ల వెడల్పు ఉన్న రోడ్డు ఉన్నప్పటికీ దాన్ని 1980లలో నిర్మించారు.

ఆ తర్వాత దాన్నిపట్టించుకున్న నాథుడు లేడు. అయితే.. ఈ నలభై ఏళ్లలో ఆ గ్రామ జనాబా మూడు రెట్లు పెరిగింది. వాహనాలు కూడా భారీగా పెరిగాయి.ఎప్పటికప్పుడు గుంతలు పడిన రోడ్డుకు రిపేర్లు చేయటమే తప్పించి.. రోడ్డు విస్తరణ కార్యక్రమం ముందుకు పడలేదు. కొత్త రోడ్డు కోసం రూ.60 లక్షలు ఖర్చు అవుతుందని లెక్క తేల్చారు.

దీంతో.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా తమకు అవసరమైన నిధుల్ని సమీకరించాలని భావించిన గ్రామస్థులు.. రోడ్డుకు పెళ్లి కార్యక్రమాన్ని నిర్వమించారు. ఇందులో భాగంగా రోడ్డు పెళ్లికి వచ్చినోళ్లందరికి బిర్యానీ.. స్వీట్లు వడ్డించారు. పెళ్లికి వెళ్లే వారంతా ఉత్త చేతలతో వెళ్లకుండా ఏదో ఒక బహుమతి పట్టుకొని వెళతారు కాబట్టి.. ప్రతి ఒక్కరు తమకు తోచిన ఆర్థిక సాయాన్ని అందించాలని భావించారు.

గ్రామానికి చెందిన పదిహేను మంది మిగిలిన వారికి భిన్నంగా ముందుకు వచ్చి రూ.లక్ష చొప్పున విరాళాన్ని ప్రకటించారు. మిగిలిన రూ.45 లక్షల కోసం రోడ్డుకు పెళ్లి అనే కార్యక్రమానికి తెర తీశారు. ఇక్కడో విషయాన్ని చెప్పాలి. ఉత్తర కేరళలో పనం పయట్టు లేదంటే కురికల్యాణం పేరుతో నిధుల కోసం పెళ్లి చేస్తారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అప్ గ్రేడ్ వెర్షన్ లో రోడ్డుకు పెళ్లి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. మీడియా చూపు దీని మీద పడింది. పెళ్లి ఘనంగా జరగటమే కాదు.. చదివింపులు బాగానే వచ్చినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా రోడ్డు కల నెరవేరుతుందన్న మాట వినిపిస్తోంది.