Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్త జిల్లా త్వరలో అక్కడేనట !

ఏపీలో ఇప్పటికే 26 జిల్లాలు ఉన్నాయి. ప్రతీ పార్లమెంట్ సీటుకూ ఒక జిల్లా అని వైసీపీ ప్రభుత్వం 2022లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. అయితే దాని మీద విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు.

By:  Tupaki Desk   |   7 July 2025 9:40 AM IST
ఏపీలో కొత్త జిల్లా త్వరలో అక్కడేనట !
X

ఏపీలో ఇప్పటికే 26 జిల్లాలు ఉన్నాయి. ప్రతీ పార్లమెంట్ సీటుకూ ఒక జిల్లా అని వైసీపీ ప్రభుత్వం 2022లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. అయితే దాని మీద విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఒక్క బాలాజీ జిల్లా పేరుని మాత్రం తిరుపతి జిల్లాగా మార్చేందుకు అంగీకరించింది. అదే సమయంలో గిరిజనులకు రెండు జిల్లాలు చేశారు. అలా ఏపీలో పదమూడు నంబర్ కాస్తా ఇరవై ఆరుకు పెరిగింది.

అయినా సరే కొత్త జిల్లాల డిమాండ్లు ఇంకా చాలా వస్తూనే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం జిల్లాలను సైంటిఫిక్ మ్యానర్ లో చేయలేదని టీడీపీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. దాంతో తాము అధికారంలోకి వస్తే అవసరమైన చోట్ల మార్పులు చేర్పులు చేస్తామని అన్యాయాలను సరిదిద్దుతామని హామీ ఇచ్చింది. అంతే కాదు కొత్త జిల్లాల డిమాండ్లు ఉన్న చోట ఏర్పాటు చేస్తామని కూడా స్పష్టం చేసింది.

ఇక వైసీఎపీని ఓడించి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి అక్షరాలా ఏడాది గడచింది. అయితే కొత్త జిల్లాల హామీని మాత్రం నిలబెట్టుకోలేదని ఆయా ప్రాంతాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురం ని విడదీసి కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది.

దాంతో ఈ విషయం మీద కూటమి నేతలను స్థానిక ప్రజలు అడుగుతున్నారు. అయితే ఆ డౌట్ ని కాస్తా జిల్లాకు చెందిన మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తీర్చేశారు. ఆయన తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతూ తొందరలోనే మార్కాపురం పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇక ఈ కొత్త జిల్లా ఏర్పాటు ఎలా అంటే మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలను కలుపుతూ ఉంటుందిట. దాంతో ఈ కొత్త జిల్లాకు సంబంధించి ప్రభుత్వం అపుడే కసరత్తు స్టార్ట్ చేసింది అని అంటున్నారు. అంతే కాదు మంచి ముహూర్తం చూసి అధికారికంగా ప్రకటన ఉంటుందని అంటున్నారు.

మార్కాపురం జిల్లా అయితే మాత్రం అభివృద్ధి దూసుకుని పోతుందని అంటున్నారు. పైగా ఈ అయిదు నియోజకవర్గాల ప్రజలు కూడా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మారుతాయి అంటున్నారు. మొత్తానికి మార్కాపురం కొత్త జిల్లాతో ఆగుతుందా లేక మరిన్ని కొత్త జిల్లాల డిమాండ్లు పుట్టుకుని వస్తాయా అన్నది చూడాలి. అదే కనుక జరిగితే కూటమి ప్రభుత్వం దగ్గర ఉన్న పరిష్కారాలు ఏమిటి అన్నది చూడాలి. అయితే ఏపీలో ఇప్పటికి ఉన్న 26 జిల్లాలను 30గా చేస్తారు అన్న ప్రచారం కూడా ఉంది. మరి మార్కాపురం బోణీ కొడితే మిగిలినవి ఏమిటి ఎపుడు అన్నదే తేలాల్సి ఉందన్న మాట.