Begin typing your search above and press return to search.

ఫ్రమ్ రాయలసీమ.. వయా నల్లమల.. మార్కాపురం స్టోరీ ఇదే..

ఏపీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న రెండు జిల్లాల్లో మార్కాపురం జిల్లాకు చాలా చరిత్ర ఉంది.

By:  Tupaki Political Desk   |   31 Dec 2025 8:00 PM IST
ఫ్రమ్ రాయలసీమ.. వయా నల్లమల.. మార్కాపురం స్టోరీ ఇదే..
X

ఏపీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న రెండు జిల్లాల్లో మార్కాపురం జిల్లాకు చాలా చరిత్ర ఉంది. ఒకప్పుడు రాయలసీమలో అంతర్భాగంగా ఉన్న మార్కాపురం 1970లో జరిగిన జిల్లాల పునర్విభజనలో ప్రకాశం జిల్లాలో కలిసింది. అలా రాయలసీమ నుంచి వేరుపడిన మార్కాపురం ప్రాంతం జిల్లా కేంద్రం ఒంగోలుకు సుదూరంగా ఉండటం వల్ల అభివృద్ధిలో వెనుకబడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న మార్కాపురం భౌగోళికంగా భిన్నంగా ఉంటుంది. రాయలసీమ నుంచి వేరుపడిన ప్రాంతం కోస్తా సంస్కృతిని అలవాటు చేసుకోలేక ఇబ్బందికరంగా ఇన్నేళ్లు నెట్టుకొచ్చిందని అంటున్నారు. దీంతోనే 55 ఏళ్లుగా ప్రత్యేక జిల్లా కోసం మార్కాపురం ప్రాంతీయులు ఉద్యమించారు. ఎట్టకేలకు వారి డిమాండ్ నెరవేరింది.

జనవరి 1 నుంచి మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించింది. ఈ జిల్లా పరిధిలో మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలన్నీ ప్రకాశం జిల్లా పశ్చిమప్రాంత పరిధిలోకి వస్తాయి. గత 55ఏళ్లుగా ఈ ప్రాంతీయులు ప్రత్యేక జిల్లా డిమాండ్‌ వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీ కావడంతో ఎట్టకేలకు మార్కాపురం జిల్లా ఏర్పాటైందని అంటున్నారు. గత ప్రభుత్వంలో కూడా మార్కాపురం ప్రత్యేక జిల్లా కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. కానీ, అప్పటి ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయాలనే ప్రతిపాదనకే కట్టుబడి ఉండటం వల్ల మార్కాపురం జిల్లా ఏర్పాటు సాధ్యం కాలేదని చెబుతున్నారు.

చంద్రబాబు ఎన్నికల హామీ

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవతో 55 ఏళ్లుగా తీరని కోరికగా మిగిలిన ప్రత్యేక జిల్లా ఏర్పాటవుతోంది. నిజానికి మార్కాపురం ప్రాంతానికి ప్రకాశం జిల్లాతో ఎటువంటి సంబంధం లేదని చరిత్ర చెబుతోంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా 1970లో ఒంగోలు కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. 1972లో స్వాతంత్ర్య సమరయోధులు ప్రకాశం పంతులు పేరు మీద ప్రకాశం జిల్లాగా మార్చారు. ప్రస్తుత జిల్లాకేంద్రం ఒంగోలు, బాపట్ల జిల్లాలోకి వెళ్లిన చీరాల, పర్చూరు. అద్దంకి ప్రాంతాలను అప్పట్లో గుంటూరు జిల్లా నుంచి విడదీశారు. కొండపి, కందుకూరు, కనిగిరి దర్శిలోని కొంత ప్రాంతాన్ని అప్పటి నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలో కలిపారు.

ఒకప్పుడు రాయలసీమ

ప్రస్తుతం మార్కాపురం జిల్లాలో కలుస్తున్న గిద్దలూరు, మార్కా పురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాలను రాయలసీమలోని కర్నూలు జిల్లా నుంచి విడగొట్టారు. ఇలా పూర్తిగా వెనుకబడిన ప్రాంతాలతో ఏర్పాటైన కొత్త జిల్లా ప్రకాశం కేంద్రంగా కొందరు నాయకులు పొదిలి పట్టణాన్ని జిల్లాకేంద్రంగా చేయాలని డిమాండ్‌ చేశారు. కానీ, అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఒక నాయకుడి పలుకుబడితో ఒంగోలు జిల్లాకేంద్రంగా చేశారని అంటున్నారు. ఆ తర్వాత పొదిలిని కనీసం డివిజన్‌ కేంద్రగానైనా చేయాలని డిమాండ్‌ వచ్చినా పట్టించుకోలేదు. ఒకప్పుడు మార్కాపురం కేంద్రంగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గం కూడా పునర్విభజనలో రద్దయింది. అయితే రాయలసీమ నుంచి ప్రకాశం జిల్లాలో చేరిన తర్వాత ఆ ప్రాంత ప్రజల మనోభావాల్లో మార్పు వచ్చిందని చెబుతున్నారు. ఆయా దశల్లో పాలనా వికేంద్రీకరణ జరిగిన సందర్భాల్లో జిల్లాకేంద్రం సుదూరంగా ఉండటం సమస్యగా మారి పశ్చిమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలనే డిమాండ్‌ ఉద్భవించింది.

వ్యయప్రయాసలకు చెల్లు

మార్కాపురం ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు వెళ్లాలంటే అధికారులకు, ప్రజాప్రతి నిధులకు రోజంతా సరిపోతుంది. ప్రజలు జిల్లా కేంద్రానికి రావాలంటే చాలా వ్యయప్రయాసలకు లోనవుతున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకు గిద్దలూరు 140 కి.మీ, పుల్లలచెరువు మండలం 120 కి.మీ దూరంలో ఉన్నాయి. ఇక అటవీ ప్రాంత గ్రామాలకు అధికారులు కానీ, ఆయా సందర్భాల్లో పాలక ప్రజాప్రతినిధులు వెళ్లి రావాలంటే రెండు రోజులు పడుతుంది. దీంతో క్రమేపీ పశ్చిమ ప్రాంతవాసులు తమ ప్రాంతా న్ని ప్రత్యేక జిల్లా చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇలా 55 ఏళ్లుగా మార్కాపురం ప్రాంత ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక జిల్లా కూటమి ప్రభుత్వంలో నెరవేరడం నిజంగా ఒక చారిత్రాత్మక నిర్ణయంగానే చెబుతున్నారు.

ప్రత్యేక జిల్లా కోసం ఉద్యమం

మార్కాపురం జిల్లా సాధన సమితి పేరుతో పార్టీలకతీతంగా ప్రజలు ఐక్యకార్యాచరణతో ఆందోళన చేపట్టారు. కొన్నినెలల పాటు ఉద్యమం సాగింది. ఆ సమయంలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగానే కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందని ఒకచోట గాడితప్పితే మిగిలిన చోట ఇబ్బంది వస్తుందని మాజీ సీఎం జగన్‌ చెప్పడంతో మార్కాపురం జిల్లా ఏర్పాటు కాలేదని అంటున్నారు. స్థానికుల డిమాండ్‌కు అనుగుణంగా లోక్‌సభలతో సంబంధం లేకుండా కొన్ని నియోజకవర్గాలను మార్చారని, బాపట్ల లోక్‌సభలో ఉన్న ఎస్‌ఎన్‌పాడును ప్రకాశం జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గంలోని కొన్ని మండలాలను నెల్లూరు జిల్లాలో ఉంచిన విషయాన్ని మార్కాపురం ప్రాంతీయులు గత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ప్రత్యేక జిల్లా డిమాండ్ నెరవేరలేదని చెబుతున్నారు.

అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురం ప్రాంతీయుల మనోభీష్టానికి అనుగుణంగా ఎన్నికల్లో ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు కొత్త జిల్లా ఏర్పాటు అవుతుంది. దశాబ్దాల ఉద్యమానికి ఎండ్ కార్డు పడిందని అంటున్నారు. రెండు రెవెన్యూ డివిజన్లు, 21 మండలాలతో మార్కాపురం కొత్త జిల్లాగా ఏర్పాటు అవుతోంది. మార్కాపురం డివిజన్ లో 15 మండలాలు, కనిగిరి డివిజన్ లో ఆరు మండలాలు ఉన్నాయి. గతంలో కనిగిరి డివిజన్ లో ఉన్న పొదిలి, కొనకనమిట్ల మండలాలను మార్కాపురం డివిజన్ లో చేర్చారు. ఈ నిర్ణయం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగులు సైతం మార్కాపురం కొత్త జిల్లా ఏర్పాటును స్వాగతిస్తున్నారు. గతంలో జిల్లా కేంద్రం నుంచి మార్కాపురం ఏరియా వెళ్లలంటే ఎంతో వ్యవ ప్రయాసకు గురికావాల్సి వచ్చేదని, కూటమి ప్రభుత్వం ఆ కష్టాలకు చెక్ పెట్టిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.