Begin typing your search above and press return to search.

కెనడా ఎన్నికలు: అధిక్యంలో అధికార పార్టీ

అధికారం చేతికి రాగానే.. ఒక్కో అధినేత వ్యవహరించే తీరు ఒక్కోలా ఉంటుంది. చాలా తక్కువ మంది మాత్రమే తమ చేతికి వచ్చిన అధికారానికి ప్రజల ఆమోదం కోసం సాహసం చేస్తారు.

By:  Tupaki Desk   |   29 April 2025 10:22 AM IST
కెనడా ఎన్నికలు: అధిక్యంలో అధికార పార్టీ
X

అధికారం చేతికి రాగానే.. ఒక్కో అధినేత వ్యవహరించే తీరు ఒక్కోలా ఉంటుంది. చాలా తక్కువ మంది మాత్రమే తమ చేతికి వచ్చిన అధికారానికి ప్రజల ఆమోదం కోసం సాహసం చేస్తారు. అన్నిసార్లు ఈ ఎత్తుగడ వర్కువుట్ కాదు. అంతేకాదు.. ఈ వ్యూహం చాలా ప్రమాదకరమైంది. రిస్కుతో కూడుకున్నది. అయినప్పటికి తగ్గని అధినేతలు కొందరు ఉంటారు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్లుగా.. తాము అనుకున్నది సాధించేందుకు కష్టపడి విజయం సాధిస్తుంటారు. ఇప్పుడు ఆ కోవలోకే వస్తారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ.

ప్రస్తుతం ప్రధానిగా వ్యవహరిస్తున్న ఆయన.. తాజాగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మరోసారి ప్రధానమంత్రి కానున్నట్లు చెబుతున్నారు. తాజాగా జరిగిన కెనడా ఎన్నికల బరిలో నాలుగు పార్టీలు నిలవగా.. అధికార లిబరల్ పార్టీదే విజయం సొంతం కానుంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం లిబరల్ పార్టీ అధిక్యంలో ఉంది. ప్రస్తుతం 152 స్థానాలున్న లిబరల్ పార్టీ తాజా ఎన్నికల్లో 189 స్థానాల్ని సొంతం చేసుకోవటం ఖాయమంటున్నారు. అదే సమయంలో విపక్ష కన్జర్వేటివ్ పార్టీ సైతం గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించే వీలుందని చెబుతున్నారు.

కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ జనవరిలో తన పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. అప్పటి నుంచి కెనడాలో ఎన్నికలు జరపాలని పలువురు రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబరులో కెనడాలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే.. ట్రూడో తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మార్క్ కార్నీ.. తాను పదవిని చేపట్టేందుకు ముందు నుంచి ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. తన మాటలకు తగ్గట్లే ఆయన చేతల్లోనూ చూపారు.

రెండుసార్లు సెంట్రల్ బ్యాంకులకు గవర్నర్ గా పని చేసిన మార్క్ కార్నీ.. మార్చి మధ్యలో కెనడా లిబరల్ పార్టీ నేతగా ఎంపికైన తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టటం.. ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఆయన సాహసంతోతీసుకున్న నిర్ణయం వర్కువుట్ అయినట్లుగా కనిపిస్తోంది. తాజాగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాలు ట్రెండ్ చూస్తుంటే.. అధికార పార్టీ విజయం సాధించటం పక్కా అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.