Begin typing your search above and press return to search.

మార్గదర్శిపై సీఐడీ కీలక నిర్ణయం ?

ఖాతాదారుల పరిరక్షణే ధ్యేయంగా ఇప్పటికే మార్గదర్శికి చెందిన రు. 1035 కోట్లు జప్తుచేసిన విషయాన్ని అమిత్ గుర్తుచేశారు

By:  Tupaki Desk   |   29 July 2023 5:29 AM GMT
మార్గదర్శిపై  సీఐడీ కీలక నిర్ణయం ?
X

అవుననే అంటోంది సీఐడీ. మార్గదర్శి చిట్ ఫండ్ మోసాలపై సీఐడీ ఎస్పీ అమిత్ బర్డర్ మీడియాతో మాట్లాడుతు మార్గదర్శి యాజమాన్యానికి దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ మోసంగా వర్ణించారు. చిట్ ఫండ్ పేరుతో చందాదారుల నుండి వేలాది కోట్లరూపాయల డిపాజిట్లను సేకరించిన ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్ వాటిని చిట్టేతర వ్యాపారాలకు మళ్ళించినట్లు చెప్పారు. చిట్ ఫండ్ చట్టం ప్రకారం చిట్ ఫండ్స్ పేరుతో వసూలుచేసిన డిపాజిట్లను చిట్టేతర వ్యాపారాలకు ఉపయోగించకూడదన్నారు.

కానీ రామోజీరావు, శైలజ మాత్రం డిపాజిట్ దారుల డబ్బులను యధేచ్చగా అనేక కంపెనీల మ్యూచవల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. డిపాజిట్ దారుల డబ్బులను చిట్టేతర వ్యపారాల్లో డిపాజిట్లు చేయటం మోసం చేయటమే అని వివరించారు.

అందుకనే రామోజీని ఏ1, శైలజను ఏ2 గా తాము కేసులు నమోదుచేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు. వీళ్ళపైన ఏడు కేసులు నమోదుచేసి విచారణ జరుపుతున్నామన్నారు. ఇప్పటికి రెండు కేసులకు సంబంధించిన చార్జిషీట్లను కోర్టులో దాఖలు చేసినట్లు చెప్పారు.

రామోజీ, శైలజతో పాటు మరో 13 మందిపైన చార్జిషీట్లు వేశామన్నారు. విచారణ జరుగుతున్న మరో ఐదు కేసులను కూడా తొందరలోనే పూర్తిచేసి వాటిల్లో కూడా చార్జిషీట్లు దాఖలు చేయబోతున్నట్లు చెప్పారు. ఖాతాదారుల పరిరక్షణే ధ్యేయంగా ఇప్పటికే మార్గదర్శికి చెందిన రు. 1035 కోట్లు జప్తుచేసిన విషయాన్ని అమిత్ గుర్తుచేశారు. ఉషాకిరణ్ మీడియా లిమిటెడ్, ఉషోదయ ప్రైవేటు లిమిటెడ్ ఆస్తులను అటాచ్ చేశామన్నారు.

చిట్ ఫండ్ యాక్టును ఉల్లంఘించినందుకు రామోజీ, శైలజపై చీటింగ్ కేసులు నమోదుచేసినట్లు ఎస్పీ వెల్లడించారు. మొత్తం మీద ఇంతకాలం జరుగుతున్న విచారణ వేరు ఇకపై జరగబోయే విచారణ వేరన్నట్లుగా తయారైంది వ్యవహారం.

ఎందుకంటే రెండు కేసుల్లో రామోజీ, శైలజ పేర్లను చేర్చి సీఐడీ చార్జిషీట్లను దాఖలు చేయటంతో కేసు దర్యాప్తుకు ఊపొచ్చింది. చార్జిషీట్లు దాఖలు చేయటం అంటే వీళ్ళ మోసాలను ఆధారాలతో సహా కోర్టుకు అందచేయటమే.

కాబట్టి ఇపుడు కోర్టు అనుమతితో వీళ్ళని అదుపులోకి తీసుకుని మరింతగా విచారించే అవకాశాలున్నాయని సమాచారం. ఎందుకంటే మూడోసారి విచారణకు రమ్మని సీఐడీ నోటీసులిస్తే వీళ్ళు హాజరుకాలేదు. అందుకనే వెంటనే చార్జిషీటు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మరిపుడు కోర్టు ఏమంటుందో చూడాలి.