మహారాష్ట్రలో మరాఠా కోటా మంటలు.. హైదరాబాద్ గెజిట్ దే కీలకపాత్ర
మహారాష్ట్రలో మళ్లీ మరాఠాల ఓబీసీ రిజర్వేషన్ ఉద్యమం ఊపందుకుంది. రెండేళ్ల కిందటి నుంచి నలుగుతున్న ఈ డిమాండ్ ను సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే ముందుండి నడిపిస్తున్నారు.
By: Tupaki Desk | 1 Sept 2025 9:42 AM ISTమహారాష్ట్రలో మళ్లీ మరాఠాల ఓబీసీ రిజర్వేషన్ ఉద్యమం ఊపందుకుంది. రెండేళ్ల కిందటి నుంచి నలుగుతున్న ఈ డిమాండ్ ను సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే ముందుండి నడిపిస్తున్నారు. గత ఏడాది ఎన్నికల ముంగిట ఆయన చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. అప్పటికి చల్లబడినా.. మళ్లీ ఇప్పుడు గట్టిగా లేవనెత్తుతున్నారు. మరాఠాలు మహారాష్ట్ర జనాభాలో 28 శాతం ఉంటారని గతంలోనే ప్రభుత్వం పేర్కొంది. వీరికి 10 శాతం రిజర్వేషన్లు కోరుతూ ఉద్యమిస్తున్నారు జరాంగే. మరాఠాలను కున్బీలుగా గుర్తించాలంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్, సతారా గెజిట్ లను గుర్తుచేస్తున్నారు.
అప్పట్లో మహారాష్ట్ర వరకు నిజాం రాజ్యం
హైదరాబాద్ గెజిట్ ను 1918లో అప్పటి నిజాం రాజు జారీ చేశారు. అప్పట్లో నిజాం రాజ్యం మహారాష్ట్రకూ కొంతమేర విస్తరించి ఉంది. హైదరాబాద్ స్టేట్ గా పిలిచే నాటి రాజ్యంలో మరాఠాలు ఎక్కువగా ఉన్నా.. ఉద్యోగాలు, పాలనలో సరైన ప్రాతినిధ్యం దక్కడ లేదనే వాదన ఉంది. దీంతో సమస్య పరిష్కారానికి నిజాం రాజు.. మరాఠా వర్గాలను హిందూ మరాఠాలుగా గుర్తిస్తూ వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఈ మేరకు గెజిట్ ఇవ్వడంతో అది హైదరాబాద్ గెజిట్ అయింది.
నాటి గెజిట్ ను చూపుతూ...
మరాఠాలు సామాజికంగా, విద్య పరంగా వెనుకబడి ఉన్నారని రికార్డుల్లోనే ఉందని పేర్కొంటూ కోటా అమలు చేయాలని మరాఠా ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు సతారా గెజిట్ లను చూపుతూ రిజర్వేషన్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఓబీసీ జాబితాలో చేర్చి 10 శాతం రిజర్వేషన్ కోరుతూ జరాంగే ఉద్యమం లేవనెత్తారు. మరాఠాలను కున్బీలుగా గుర్తించాలని కోరుతున్నారు. కానీ, మరాఠాలు- కున్బీలు ఒకటి కాదంటూ గతంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని ప్రభుత్వం పేర్కొంటోంది. సుప్రీం ఆదేశాలను కాదనలేం కాబట్టి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అయితే, జరాంగేతో చర్చలు విఫలమయ్యాయి.
రెండో రోజూ నిరాహార దీక్ష
కోటా అమలు కోరుతూ జరాంగే చేపట్టిన నిరాహార దీక్ష ఆదివారం మూడో రోజూ కొనసాగింది. ఆయనతో ప్రభుత్వ ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలితం ఇవ్వలేదు. చర్చలకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సందీప్ శిందేను పంపడాన్ని జరాంగే తప్పుబట్టారు. హైదరాబాద్, సతారా గెజిట్‌లను చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు.
