Begin typing your search above and press return to search.

పోలింగ్ కేంద్రాలకు మావోయిస్టుల దెబ్బ ?

తొందరలో జరగబోయే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో మావోయిస్టుల దెబ్బ తప్పదనే అనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   2 Nov 2023 4:57 AM GMT
పోలింగ్ కేంద్రాలకు మావోయిస్టుల దెబ్బ ?
X

తొందరలో జరగబోయే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో మావోయిస్టుల దెబ్బ తప్పదనే అనిపిస్తోంది. మామూలుగా అయితే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులు ప్రచారం చేసుకోవటానికి కూడా భయపడుతారు. ముఖ్యంగా అధికార పార్టీ అభ్యర్ధుల్లో ఈ భయం చాలా ఎక్కువగా ఉంటుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రచారమైనా, పోలింగ్ అయినా సాయంత్రం 4 గంటలకే ముగించేయాలని పోలీసులు చెబుతున్నారు. కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని కొన్ని నియోజకవర్గాల్లో మావోయిస్టుల ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుందనటంలో సందేహం అవసరంలేదు. అందుకనే అంతర్రాష్ట్ర పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటుచేసి వచ్చిపోయే వాహనాలను రెగ్యులర్ గా తనిఖీలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లోని అన్నీ గ్రామాల్లో ప్రత్యేక పోలీసులు దళాలతో పాటు కేంద్ర దళాలను ఎన్నికల కమీషన్ దింపేసింది. 24 గంటలూ పోలీసుల కాపల, కూంబింగ్ కారణంగా మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచేసింది.

కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, అసిఫాబాద్, రామగుండం, ఆదిలాబాద్, ఇల్లెందు, నిర్మల్ తదితర ప్రాంతాల్లో సుమారు 600 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిల్లో ఎక్కువగా అసిఫాబాద్, చెన్నూరు, ములుగు, మంథని, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, బెల్లంపల్లి, చెన్నూరు, సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గాల్లోనే ఉన్నాయి. నిజానికి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడటం పోలీసు అధికారులకు కత్తిమీదసాము లాంటిదనే చెప్పాలి. ఉదయం లేచింది మొదలు రాత్రి పొద్దుపోయేంతవరకు ఎక్కడేమి జరుగుతుందో ? ఎక్కడా మావోయిస్టులు దాడిచేస్తారో అనే టెన్షన్ తోనే పోలీసు అధికారులకు నిద్రకూడా సరిగా పట్టదు.

దీనికితోడు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను తరిమికొట్టాలని, ఈ రెండు పార్టీల అభ్యర్ధులకు ఓట్లు వేయకుండా ఓడించాలని మావోయిస్టులు పిలుపిచ్చారు. దాంతో ఈ రెండుపార్టీల అభ్యర్ధుల్లో కంగారు పెరిగిపోతోంది. ఏ మూలనుండి మావోయిస్టులు దాడులు చేస్తారో తెలీక అభ్యర్ధుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎన్నికల ప్రక్రియను భగ్నంచేయటంలో భాగంగా ఇప్పటికే మావోయిస్టు యాక్షన్ టీమ్ లు రంగంలోకి దిగేశాయన్న ఇంటెలిజెన్స్ నివేదికలతో పోలీసులంతా హై అలర్టులో ఉన్నారు. మరి చివరకు ఏమిజరుగుతుందో చూడాల్సిందే.