Begin typing your search above and press return to search.

ఇక మిగిలింది గణపతి మాత్రమే.. తిరుపతి కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడా?

మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతి వంటి ఒకరిద్దరు నాయకులు తప్ప అగ్రనేతలు ఎవరూ ప్రస్తుతం బయట లేరన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

By:  Tupaki Desk   |   18 Nov 2025 7:45 PM IST
ఇక మిగిలింది గణపతి మాత్రమే.. తిరుపతి కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడా?
X

కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లే దేశంలో మావోయిస్టు పార్టీ పతనమైనట్లేనన్న టాక్ వినిపిస్తోంది. మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతి వంటి ఒకరిద్దరు నాయకులు తప్ప అగ్రనేతలు ఎవరూ ప్రస్తుతం బయట లేరన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం చోటుచేసుకున్న పరిణామాలతో మావోయిస్టు ఉద్యమం పరిసమాప్తమైనట్లేనని అంటున్నారు. మారేడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటరు తర్వాత పోలీసులు విజయవాడలో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ లో 9 మంది మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు పట్టుబడ్డారు. వీరిలో ఎవరెవరు ఉన్నారనేది బుధవారం అధికారికంగా ప్రకటిస్తారు.

విజయవాడ, కాకినాడల్లో అదుపులోకి తీసుకున్న వారిలో పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతికి బాడీగార్డులు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో అరెస్టు అయిన వారిలో తిరుపతి కూడా ఉన్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో పార్టీలో అత్యున్నత వ్యవస్థలుగా చెబుతారు. అయితే ఈ రెండింటిలో ఉన్న చాలా మంది నేతలు ఇప్పుడు అందుబాటులో లేరని అంటున్నారు. చాలా మంది ఎన్కౌంటర్లలో మరణించడం, మరికొందరు లొంగిపోవడంతో ఆయా కమిటీల్లో ఇంకెవరూ లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాజాగా అరెస్టు అయిన 9 మంది మాత్రమే కేంద్ర కమిటీలో ఉన్న సభ్యులు అని.. వారు కూడా అరెస్టు కావడంతో ఉద్యమం వెన్ను విరిగినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఇదే సమయంలో మావోయిస్టు ఆర్మీని నడిపే హిడ్మా కూడా హతం కావడంతో మావోయిస్టులు పూర్తిగా చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. మరోవైపు తాజా పరిస్థితులు గమనిస్తున్న వారు షెల్టర్ జోనులో ఉన్న మావోయిస్టు పార్టీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి గణపతి మాత్రమే అగ్రనేతల్లో బయట ఉన్నారని అంటున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన తిరుపతి ఆచూకీ కూడా మిస్టరీగా మారిందని అంటున్నారు. ఆయన టీంను అదుపులోకి తీసుకున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ ప్రకటించారు. దీంతో తిరుపతి ఆచూకీ కూడా పోలీసులకు తెలిసిపోయిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు విజయవాడలో మావోయిస్టులతోపాటు భారీ ఆయుధాల డంప్ కనుగొనడం చూస్తే ముఖ్యనేతలు ఉండి ఉండొచ్చని అంటున్నారు. దీంతో బుధవారం పోలీసు శాఖ ప్రకటనపై ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ మనుగడపై అన్నివర్గాల్లోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు మావోయిస్టు విముక్త భారత్ లక్ష్యాన్ని గడువు కన్నా ముందే చేరుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిన బూనారు.

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఈ ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత మావోయిస్టు పార్టీ కకావికలమైంది. కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అయిన బస్వరాజ్ అలియాస్ నంబాల కేశవరావుతోపాటు చాలా మంది నేతలు మరణించారు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా పనిచేసిన మల్లోజుల వేణుగోపాల్ వంటివారు నిర్బంధాన్ని తట్టుకోలేక లొంగిపోయారు. ఈ పరిస్థితుల్లో తాజా పరిణామాల తర్వాత మావోయిస్టు పార్టీలో ఇంకెందరు మిగిలి ఉన్నారు? వారంతా ఎక్కడ ఉన్నారనేది ఉత్కంఠ రేపుతోంది.