Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై బాంబు వేసిన మావోయిస్టు నేత ఎన్‌కౌంటర్

వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు తీవ్ర నష్టం జరుగుతోంది. బుధవారం జరిగిన ఎదురుకాల్పలలో సుమారు 28 మంది మరణించారని భద్రతాబలగాలు ప్రకటించాయి.

By:  Tupaki Desk   |   21 May 2025 1:41 PM IST
చంద్రబాబుపై బాంబు వేసిన మావోయిస్టు నేత ఎన్‌కౌంటర్
X

ఆపరేషన్ కగార్ లో మావోయిస్టులకు పెద్ద షాక్ తగిలింది. బుధవారం చత్తిస్ గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటరులో మావోయిస్టు సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు హతమయ్యారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేశవరావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన బాంబు దాడిలో సూత్రధారిగా పోలీసులు చెబుతున్నారు. 2018లో మావోయిస్టు సుప్రీం కమాండర్ గణపతి రాజీనామాతో కేశవరావు ఆ స్థానంలో నియమితులయ్యారు.

వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు తీవ్ర నష్టం జరుగుతోంది. బుధవారం జరిగిన ఎదురుకాల్పలలో సుమారు 28 మంది మరణించారని భద్రతాబలగాలు ప్రకటించాయి. ఇందులో మావోయిస్టు అగ్రనేతలు ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరణించిన వారిలో మావోయిస్టు సుప్రీం కమాండర్ నంబాళ్ల కేశవరావు ఉన్నారని చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది గాయపడినట్లు చెబుతున్నారు.

కాగా, మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావుపై పలు తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. 2003లో చంద్రబాబుపై దాడితో పాటు 2010లో సీఆర్పీఫ్ జవాన్లు 70 మందిపై బలిమెలలో జరిగిన దాడిలోనూ ఆయన కీలక సూత్రధారిగా చెబుతున్నారు. అతడిపై సుమారు కోటిన్నర రివార్డు ప్రకటించారు. మావోయిస్టు టాప్ లీడర్ అయిన కేశవరావు వరంగల్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ చదువుతూ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. అడవి బాట పట్టిన కేశవరావు తిరిగి ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు. గెరిల్లా వ్యూహాలు రచించడం, ఐఈడీ బాంబులు పేల్చడంలో ఆయన దిట్టగా చెబుతుంటారు. ఎట్టకేలకు కేశవరావు ఎన్‌కౌంటర్ తో భద్రతా బలగాలు భారీ విజయం సాధించారు.