Begin typing your search above and press return to search.

కొత్త అసెంబ్లీకి ఎమ్మెల్యేలుగా అంతమంది డాక్టర్లు ఎన్నిక

తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో బోలెడన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ఈసారి గెలిచిన 119 మంది ఎమ్మెల్యేల్లో పెద్ద ఎత్తున వైద్యులు ఉండటం విశేషంగా చెప్పాలి.

By:  Tupaki Desk   |   4 Dec 2023 11:12 AM GMT
కొత్త అసెంబ్లీకి ఎమ్మెల్యేలుగా  అంతమంది డాక్టర్లు ఎన్నిక
X

తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో బోలెడన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ఈసారి గెలిచిన 119 మంది ఎమ్మెల్యేల్లో పెద్ద ఎత్తున వైద్యులు ఉండటం విశేషంగా చెప్పాలి. మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో ఈసారి సభలోకి అడుగు పెట్టే డాక్టర్ల సంఖ్య అక్షరాల 16 మంది. ఈ పదహారు మందిలో కొందరు స్పెషలిస్టులు కూడా కావటం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి. అంటే.. మొత్తం ఎమ్మెల్యేల్లో పది శాతానికి పైగా (మరింత కచ్ఛితంగా చెప్పాలంటే 13.3 శాతం) ఎమ్మెల్యేలు వైద్యులు కావటం గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదన్న మాట వినిపిస్తోంది.

తాజాగా గెలిచిన వైద్యుల్లో ఎంఎస్ జనరల్ సర్జన్ చేసిన వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాంచందర్ నాయక్ (డోర్నకల్), వంశీక్రిష్ణ (అచ్చంపేట), మురళీక్రిష్ణ (మహబూబాబాద్), సత్యనారాయణ (మానకొండూరు)లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన మరికొందరు వైద్యులు వివిధ స్పెషాలిటీస్ చేసిన వారు ఉండటం ఆసక్తికరంగా మారింది. సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందన రాగమయి ఎండీ పల్మనాలజిస్టు అయితే.. నాగర్ కర్నూలుకూచుకుళ్ల రాజేశ్ రెడ్డి ఎండీఎస్.

నిజామాబాద్ రూరల్ నుంచి గెలిచిన భూపతిరెడ్డి ఎంఎస్ ఆర్థో ఫిజిషియన్ కాగా.. నారాయణఖేడ్ నుంచి గెలిచిన సంజీవ్ రెడ్డి పిడియాట్రిషియన్. నారాయణపేట్ లో వర్ణికా రెడ్డి రేడియాలజీ చేశారు. మెదక్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ (మైనంపల్లి హన్మంతరావు కుమారుడు).. చెన్నూరు నుంచి విజయం సాధించిన గడ్డం వివేక్ లు కూడా వైద్యులే. మొత్తం16 మందిలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు 12 మంది కావటం విశేషం.

బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వైద్యుల్ని చూస్తే.. ఎంఎస్ ఆర్థో స్పెషలిస్టు తెల్లం వెంకట్రావు (భద్రాచలం), ఎంఎస్ న్యూరో స్పెషలిస్టు కల్వకుంట్ల సంజయ్ (కోరుట్ల)లు ఉన్నారు. వీరు కాక.. జగిత్యాల నుంచి విజయం సాధించిన సంజయ్ కూడా డాక్టరే. ఇక.. బీజేపీ నుంచి విజయం సాధించిన వారిలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్.. డోర్నకల్ ఎమ్మెల్యేగా గెలిచిన రాంచందర్ నాయక్ లు కూడా వైద్యులే. మొత్తంగా కొత్తగా కొలువు తీరే అసెంబ్లీలో ఇంత మంది వైద్యులు ఉండటం నిజంగానే ఆసక్తికరం. మరి.. ఎమ్మెల్యేలుగా వీరెలాంటి చికిత్స సమాజానికి చేస్తారో చూడాలి.