మనసులోని భావం.. వీటికి చోటేది మోడీ సర్!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే `మన్‌కీ బాత్` కార్యక్రమం ఆదివారం(సెప్టెంబరు 27) ప్రసారమైంది.
By: Tupaki Desk | 28 Sept 2026 4:00 PM ISTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే `మన్‌కీ బాత్` కార్యక్రమం ఆదివారం(సెప్టెంబరు 27) ప్రసారమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 కీలక అంశాలు చుట్టూ చర్చ సాగుతోంది. ఇవి రాజకీయంగానే కాకుండా.. ప్రజల పరంగా కూడా.. పెద్ద ఎత్తున విమర్శలకు అవకాశం ఇస్తున్నాయి. ఆయా అంశాలపై వాస్తవానికి నెల రోజులుగా చర్చ సాగుతోంది. దీంతో ప్రధాని మనసులోని భావాలలో వాటికి కూడా చోటు దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ.. మోడీ మాత్రం.. బావులు శుభ్రం చేయడం, సర్జికల్ స్ట్రయిక్స్‌కు పదేళ్లు నిండడం, జనాభా లెక్కలు వంటి వాటినే పరిమితం చేశారు.
ఏంటా ఐదు?
1) సర్ వివాదం: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరుతో జరుగుతున్న ఓటర్ల ప్రక్షాళన వ్యవహారం.. దుమారం రేపుతోంది. ముఖ్యంగా ఫాం-6 విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్నతీరును.. ప్రజలు కూడా ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో సర్‌పై ప్రధాని స్పందిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన మౌనంగా ఉన్నారు.
2) జ్ఞానేష్ కుమార్: గత పది హేను రోజుల నుంచి కూడా దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌చుట్టూ వివాదం నడుస్తోంది. మిగిలిన కమిసనర్లతో ఆయన సఖ్యంగా లేరని.. ఏకపక్ష విధానాలు తీసుకుంటున్నారన్నవార్తలు వచ్చాయి. దీంతో అసలు జ్ఞానేష్‌ను ఆ పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. దీనికి కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కూడా వ్యక్తం చేసేందుకు ముహూర్తం పెట్టింది. కానీ, ఈ కీలక విషయంపైనా ప్రధాని మౌనంగా ఉన్నారు.
3) మండుతున్న ధరలు: అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి ఎగబాకాయి. పశ్చిమాసియా యుద్ధం ప్రభా వంతోపాటు.. స్థానికంగా పెరుగుతున్న ధరల ప్రభావంతో ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా దళారీ వ్యవస్థకు సంబంధించిన వ్యవహారం కూడా దేశవ్యాప్తంగా చర్చకు వస్తోంది. దీంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బియ్యం ధరలు రెండు మాసాల్లోనే 12 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగాయి. అయినా.. ప్రధాని తన మనసులో వీటికి చోటివ్వలేదు.
4) ఎల్‌నినో: దేశాన్ని కుదిపేస్తున్న ప్రధాన సమస్య ఎల్‌నినో. ప్రస్తుతం మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లోని సగం జిల్లాలు కరువుబారిన పడ్డాయని కేంద్రమే చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎల్‌నినో నుంచి ఉపశమ నం.. ప్రజలను, ముఖ్యంగా రైతులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలను కూడాప్రధాని ప్రస్తావించకపోవ డం గమనార్హం.
5) అమెరికా బెదిరింపులు: రష్యాపై ఆంక్షలు విధిస్తూ.. ఇటీవల పత్రాన్ని ఆమోదించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పనిలో పనిగా భారత్ కనుక రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే.. 100 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు నిరసన తెలుపుతున్నా.. ప్రధాని మాత్రం తన మనసుకు తీసుకున్నట్టు కనిపించడం లేదు. ఈ విషయాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు పడుతుండడం గమనార్హం.
