Begin typing your search above and press return to search.

రాజ్యసభతో మన్మోహన్‌ అనుబంధానికి తెర... తెలుగు ఎంపీల లిస్ట్ ఇదే!

అవును... 54 మంది రాజ్యసభ సభ్యులు ఈ రెండు రోజుల్లోనూ పదవీ విరమణ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా... మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉండటం గమనార్హం.

By:  Tupaki Desk   |   3 April 2024 4:07 AM GMT
రాజ్యసభతో మన్మోహన్‌  అనుబంధానికి తెర... తెలుగు ఎంపీల లిస్ట్  ఇదే!
X

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాయి. మరోపక్క పార్లమెంట్ ఎగువ సభ (రాజ్యసభ) లో పదవీ విరమణల పర్వానికి తెరలేచింది. ఇందులో భాగంగా మంగళ, బుధవారాల్లో మొత్తం 54 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. వీరిలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (91) కూడా ఉన్నారు. వీరితో పాటు 9 మంది కేంద్రమంత్రులు కూడా ఈ పదవీ విరమణ చేసేవారి జాబితాలో ఉన్నారు!

అవును... 54 మంది రాజ్యసభ సభ్యులు ఈ రెండు రోజుల్లోనూ పదవీ విరమణ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా... మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉండటం గమనార్హం. దీంతో... రాజ్యసభ సభ్యుడిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ సుమారు 33 ఏళ్ల సుదీర్ఘ పార్లమెంటరీ ప్రస్థానం నేటితో ముగియనుంది. ఆర్థిక వ్యవస్థలో ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన ఆయన... 1991 అక్టోబర్ లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.

ఈ క్రమంలోనే 1991 నుంచి 1996 వరకూ అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన ఆయన... 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లూ ప్రధానిగా సేవలందించారు. ఈ క్రమంలో... ఈయన ఖాళీ చేయనున్న స్థానాన్ని... ఇటీవల రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ భర్తీ చేయనున్నారు.

ఇలా మన్మోహన్ సింగ్ తో పాటు పదవీ విరమణ చేయనున్న 54 మంది రాజ్యసభ సభ్యుల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ చెరో ముగ్గురు ఉన్నారు. ఈ జాబితాలో తెలంగాణ నుంచి జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ ఉండగా... వీరిలో వదిరాజు రవీంద్ర బీఆరెస్స్ నుంచి మరోసారి ఎన్నికయ్యారు. ఇక, ఆంధ్రప్రదేశ్ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్, సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.

ఇదే సమయంలో పదవీ విరమణ చేయనున్న కేంద్రమంత్రుల విషయానికొస్తే...

మన్ సుఖ్ మాండవీయం - ఆరోగ్యం

ధరేంద్ర ప్రధాన్ - విద్యాశాఖ

పురుషోత్తం రూపాల - పశుసంవర్ధకం

రాజీవ్ చంద్రశేఖర్ - ఐటీ

మురళీధరన్ - విదేశీ వ్యవహారాల సహాయమంత్రి

నారాయణ రాణె - మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజెస్

ఎల్ మురుగన్ - సమాచార ప్రసారశాఖ సహాయమంత్రి

భుపేంద్ర యాదవ్ - పర్యావరణం

అశ్వినీ వైష్ణవ్ - రైల్వే

కాగా.. ఈ 9 మంది కేంద్రమంత్రుల్లోనూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మినహా మిగతా 8 మంది తాజా లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనకు రాజ్యసభ సభ్యులుగా మరో అవకాశం ఇచ్చారు.