కేజ్రీవాల్‌కు షాక్.. రూ.2వేల కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లకు సమన్లు
ఏప్రిల్ 30న ఏసీబీ ఈ ఇద్దరు నాయకులపై 12,748 తరగతి గదుల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఒక ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసింది.
By: Tupaki Desk | 4 Jun 2025 6:28 AMఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నాయకులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ (Satyendar Jain)లకు మళ్ళీ కష్టాలు మొదలయ్యేలా ఉన్నాయి. ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ అవినీతికి సంబంధించిన ఒక కేసులో ఈ ఇద్దరికీ సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని వారికి ఆదేశాలు అందాయి. సత్యేందర్ జైన్ జూన్ 6న హాజరు కావాలి, సిసోడియా జూన్ 9న హాజరు కావాలని ఏసీబీ సూచించింది. ఈ సమన్లు ఆప్ గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణంలో జరిగిన అవినీతి ఆరోపణలకు సంబంధించి జారీ అయ్యాయి.
రూ.2,000 కోట్ల కుంభకోణంపై ఎఫ్‌ఐఆర్
ఏప్రిల్ 30న ఏసీబీ ఈ ఇద్దరు నాయకులపై 12,748 తరగతి గదుల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఒక ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసింది. ఆప్ ప్రభుత్వంలో సిసోడియా ఆర్థిక విద్యా శాఖలను పర్యవేక్షించగా.. సత్యేందర్ జైన్ ఆరోగ్యం, పరిశ్రమలు, విద్యుత్, హోం వ్యవహారాలు, పట్టణాభివృద్ధి, ప్రజా పనుల శాఖల (PWD) బాధ్యతలు చూసుకున్నారు.
ఏసీబీ చీఫ్, జాయింట్ కమిషనర్ మధుర్ వర్మ మాట్లాడుతూ.. ఈ ఎఫ్‌ఐఆర్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC) చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నమోదు చేసినట్లు తెలిపారు. "సీవీసీ నివేదికలో ఈ ప్రాజెక్ట్‌లో అనేక అవకతవకలు ఉన్నాయని స్పష్టంగా చెప్పింది. కానీ ఆ నివేదికను దాదాపు మూడు సంవత్సరాల పాటు బయటికి రాకుండా తొక్కిపట్టారు" అని ఆయన చెప్పారు.
రూ.5 లక్షల పనికి రూ.24 లక్షలు ఖర్చు
ఏసీబీ అధికారుల ప్రకారం.. తరగతి గదులను ఒక చదరపు అడుగుకు రూ.1,200 చొప్పున నిర్మించాల్సి ఉండగా, ఖర్చు దాదాపు రూ.2,292 చదరపు అడుగుకు పెరిగింది. ఇది భారీ అవినీతికి నిదర్శనమని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 2019లో బీజేపీ చేసిన ఫిర్యాదులో ఒక్కో తరగతి గది నిర్మాణానికి రూ.24.86 లక్షలు ఖర్చయ్యాయని, ఇది ఢిల్లీలో ఇలాంటి ప్రాజెక్ట్‌లకు సాధారణంగా అయ్యే ఖర్చు (దాదాపు రూ.5 లక్షలు) కంటే చాలా ఎక్కువ అని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో 34 మంది కాంట్రాక్టర్లు పాలుపంచుకున్నారు. వీరిలో చాలా మంది ఆప్ పార్టీకి దగ్గరి సంబంధం ఉన్నవారేనని ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ నాయకులు కపిల్ మిశ్రా, హరీష్ ఖురానా, నీలకాంత్ బక్షి గత ప్రభుత్వం మూడు స్కూల్ జోన్‌లలో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.
ఆప్ స్పందన
ఈ పరిణామాలపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది. తమ నాయకులపై కేసులు నమోదు చేయడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని, తమను బెదిరించడానికి, భయపెట్టడానికి బీజేపీ ఇలాంటి చర్యలు తీసుకుంటుందని ఆప్ ఆరోపించింది.