Begin typing your search above and press return to search.

మణిపూర్ అల్లర్లపై తాజా నివేదిక... మృతుల సంఖ్య ఇదే!

ఇదే సమయంలో ఆ 175 లో 96 మృతదేహాలు ఇప్పటికీ మార్చురీలలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు.

By:  Tupaki Desk   |   15 Sep 2023 12:43 PM GMT
మణిపూర్  అల్లర్లపై తాజా నివేదిక... మృతుల సంఖ్య ఇదే!
X

దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కుదుపు తీసుకొచ్చిన మణిపూర్ అల్లర్ల వ్యవహారానికి సంబంధించి తాజాగా నివేధిక విడుదల చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రిపోర్ట్ లో షాకిచ్చే విషయాలు పొందుపరచబడ్డాయి. వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మృతదేహాలతో ఈ రిపోర్ట్ అల్లకల్లోలంగా ఉంది.

అవును... ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో హింసాత్మక ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక గణాంకాలను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మే 3 నుంచి మణిపూర్ లో కూకీ-మైతీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 175 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర పోలీసులు తాజా నివేదికలో పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆ 175 లో 96 మృతదేహాలు ఇప్పటికీ మార్చురీలలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు.

అదేవిధంగా... ఈ ఘర్షణల్లో 1,118 మంది గాయపడ్డారని, 33 మంది అదృశ్యమయ్యారని పేర్కొంది. ఇదే క్రమంలో మే నెలలో ఈ హింస ప్రారంభమైనప్పటినుంచీ 4,786 ఇళ్లు, 386 మతపరమైన ప్రదేశాలకు (254 చర్చిలు - 132 దేవాలయాలు) అల్లరి మూకలు నిప్పు పెట్టారని పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో హింస ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్ర ఆయుధశాల నుండి ఏకంగా 5,668 ఆయుధాలు దోచుకోబడ్డాయని నివేధికలో పేర్కొన్నారు.

ఈ దోచుకోబడ్డ ఆయుధాలలో 1,329 ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇదే క్రమంలో... మరో 15,050 మందుగుండు సామాగ్రి, 400 బాంబులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో సుమారు 360 అక్రమ బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయని డేటా తెలిపింది.

మరోపక్క పరిస్థితులు కాస్త సద్దుమణిగాయని చెప్పే క్రమంలో ఫౌగాక్‌ చావో ఇఖాయ్ - కంగ్‌ వై గ్రామాల మధ్య ఇంఫాల్ - చురచంద్‌ పూర్ రహదారి వెంబడి ఒక కిలోమీటరు మేర ఏర్పాటు చేసిన బారికేడ్‌ లను కూడా అధికారులు తొలగించారు.

ఆ సంగతి అలా ఉంటే... మణిపూర్ లో చెలరేగిన జాతి హింసపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రచురించిన నిజనిర్ధారణ నివేదికను రద్దు చేయాలని కోరుతూ ఇంటర్నేషనల్ మైటీస్ ఫోరమ్ (ఐఎంఎఫ్) దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మణిపూర్ హైకోర్టు అంగీకరించింది.

కాగా... మణిపూర్ జనాభాలో దాదాపు 53 శాతం మెయితీలు ఉండ్దగా... వారు ఎక్కువగా ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. ఇక నాగాలు, కుకీలతో సహా గిరిజనులు 40 శాతం మంది ఉండగా... వారంగా ఎక్కువగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో షెడ్యూల్డ్ తెగ హోదా కోసం మెజారిటీ మెయితీ కమ్యూనిటీ డిమాండ్‌ కు వ్యతిరేకంగా మే 3న కొండ జిల్లాల్లో నిర్వహించిన "ఆదివాసి సంఘీభావ యాత్ర" పూర్తి స్థాయి జాతి సంఘర్షణగా మారింది!